కృష్ణా బోర్డుకు రూ.6 కోట్లు ఇవ్వండి

కృష్ణా బోర్డుకు రూ.6 కోట్లు ఇవ్వండి
  • సర్కారుకు ఇరిగేషన్​ శాఖ లేఖ 


హైదరాబాద్, వెలుగు: కృష్ణా నదీ జలాల బోర్డు(కేఆర్ఎంబీ) నిర్వహణకు తీవ్ర నిధుల కొరత ఏర్పడింది. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.2025-‌‌‌‌‌‌‌‌–26 ఆర్థిక సంవత్సరానికి బోర్డుకు మొత్తం రూ.24 కోట్లు అవసరమని గత జనవరిలో జరిగిన 19వ సమావేశంలో ఆమోదం లభించింది. కానీ ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల నుంచి ఒక్క రూపాయి కూడా బోర్డుకు రాలేదు. 

ఈ నేపథ్యంలో  బోర్డు నిర్వహణకు వెంటనే నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబీ విజ్ఞప్తి చేసింది. బోర్డుకు తెలంగాణ వాటా రూ.12 కోట్లలో వెంటనే రూ.6 కోట్లు విడుదల చేయాలని కోరింది. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఇరిగేషన్ శాఖ ఈఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ తాజాగా లేఖ రాశారు. కాగా..నిధులు విడుదల చేయకుంటే టెలీమెట్రీ వ్యవస్థ కోసం  తెలంగాణ ఇచ్చిన రూ.4.18 కోట్ల నుంచి వాడుకోవాల్సి వస్తుందని ఇటీవల కృష్ణా బోర్డు హెచ్చరించింది. 

టెలీమెట్రీల ఏర్పాటుకు రూ.7.18 కోట్లు అవసరమని భావించగా.. తెలంగాణ మాత్రమే నిధులను విడుదల చేసింది. ఏపీ చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే బోర్డుకు నిధులు ఇవ్వకుంటే టెలీమెట్రీలకు మన వాటాగా చెల్లించిన నిధులనూ బోర్డు వాడుకునే అవకాశముందని, కాబట్టి వెంటనే బోర్డు నిర్వహణకు నిధులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఇరిగేషన్ శాఖ రిక్వెస్ట్ చేసింది.