
- రెవెన్యూ సదస్సుల్లో పెరుగుతున్న దరఖాస్తులు
- జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో 4 వేల అప్లికేషన్లు
- మరోవైపు కొత్తగా సర్వేయర్ల శిక్షణకు అప్లికేషన్ల స్వీకరణ
సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో భూ సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉంది. సర్వేయర్లు పూర్తిస్థాయిలో లేక భూముల కొలతలు జరగక సమస్యలు పెరిగిపోతున్నాయి. భూభారతి చట్టంలో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 5వేల పైచిలుకు దరఖాస్తులు అందగా 4,470 దరఖాస్తులుపెండింగ్ లో ఉన్నాయి. వాటిలో మండల సర్వేకు 4,070, జిల్లా సర్వేకు 400 అప్లికేషన్లు వచ్చాయి. సమస్య పరిష్కారం కోసం అప్లై చేసుకున్న దరఖాస్తుదారులు సర్వే అధికారుల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం నీమ్జ్ భూ సేకరణ, 65వ నేషనల్ హైవే విస్తరణ పనులు, ట్రిపుల్ఆర్ వంటి పనుల్లో సర్వేయర్లు బిజీగా ఉన్నారు. వీటికి తోడు భూభారతి చట్టానికి సంబంధించి సర్వే పనులు చేయడం వారికి తలనొప్పిగా మారింది. మరోవైపు జిల్లా యంత్రాంగం ఇటీవల లైసెన్స్ డ్సర్వేయర్ల శిక్షణకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
జిల్లాలో ఇలా..
జిల్లాలో ఉన్న 28 మండలాల్లో ప్రతి మండలానికి ఒక సర్వేయర్ తప్పనిసరిగా ఉండాలి. మున్సిపాలిటీలు వాటి గ్రేడ్ ను బట్టి ఆయా ప్రాంతాల్లో సర్వేయర్ల సంఖ్య ఉంటుంది. కానీ 28 మండలాల్లో కేవలం 15 మంది సర్వేయర్లు ఉండగా జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో 8 మంది సర్వేయర్లకు ఒకరు మాత్రమే ఉన్నారు. దీనికి తోడు డిప్యూటీ సర్వేయర్ ఇన్స్పెక్టర్పోస్టులు కూడా ఖాళీగానే ఉండడం మరింత ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం ఉన్న సర్వేయర్లకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో పనులు ముందుకు సాగడం లేదు.
జిల్లా వ్యాప్తంగా 760 రెవెన్యూ గ్రామాలు ఉండగా, 1,67,948 సర్వే నెంబర్లు ఉన్నాయి. ఆ సర్వే నెంబర్లు చాలాకాలం కిందివి కావడంతో హద్దులు చెరిగిపోయి భూములు వివాదాస్పదంగా మారి దరఖాస్తుల సంఖ్య పెరుగుతోంది. మండల స్థాయిలో సర్వే చేయించుకునేందుకు రూ.295, జిల్లాస్థాయిలో రూ.1, 400 చెల్లించాల్సి ఉంటుంది. డబ్బులు చెల్లించినప్పటికీ నెలల తరబడి సర్వే కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సర్వే చేసేముందు సరిహద్దు యజమానులకు నోటీసులు ఇవ్వాలి. ఇదివరకు ఆ నోటీసులు వీఆర్వోలు ఇచ్చేవారు. ప్రస్తుతం వారు లేని కారణంగా నోటీసుల జారీలో కూడా జాప్యం జరుగుతోంది.
సర్వేయర్ల శిక్షణకు ఏర్పాట్లు
జిల్లాలో సర్వేయర్ల కొరతను నివారించేందుకు ఇటీవల లైసెన్స్ డ్సర్వేయర్ల శిక్షణకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు మీసేవా కేంద్రాల ద్వారా రూ.100 చెల్లించి ఈనెల 17 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. వీరికి 50 రోజులు తెలంగాణ అకాడమీ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తారు. ఇదిలా ఉంటే జిల్లాలో ప్రధానంగా పట్టా పాస్ పుస్తకాల్లో వాస్తవ భూమి కంటే తక్కువ, ఎక్కువగా నమోదవడం, మండలాల వారిగా తహసీల్దార్ ఆఫీసుల్లో ఉన్న రికార్డులకు పాస్ పుస్తకాలకు సరి లేకపోవడం, కబ్జాలో ఉన్న నెంబర్లకు బదులు ఇతర నెంబర్లు నమోదు కావడం వంటి భూ సమస్యలను రైతులు ఎదుర్కొంటున్నారు.
పరిష్కారమవుతున్నయ్
జిల్లాలో భూ సమస్యలు వీలైనంత మేరకు పరిష్కారమవుతున్నయ్. సర్వేయర్ల కొరతను నివారించేందుకు నోటిఫికేన్ఇచ్చాం. త్వరలో అర్హులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తాం. ఉన్న సర్వేయర్లకు పని ఒత్తిడి పెరిగి కొంతమేర ఇబ్బందులు ఎదురవుతున్న మాట వాస్తవమే. కానీ ప్రభుత్వ సూచనలు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనుకున్న టైంలోగా సర్వే పనులు పూర్తిచేస్తాం.
ఐనేశ్, ఏడీ, సర్వే ల్యాండ్ రికార్డ్