బర్దానీ లేదు.. లారీలు రావు

బర్దానీ లేదు.. లారీలు రావు
  • సమస్య పరిష్కరించాలని రోడ్డెక్కుతున్న రైతులు
  • తూకం వేయక కేంద్రాల్లో పేరుకు పోతున్న ధాన్యం
  • రైతులను వేధిస్తున్న హమాలీలు కొరత   
  • మరోవైపు వణికిస్తున్న అకాల వర్షాలు

మెదక్,  సిద్దిపేట, పాపన్నపేట, వెలుగు: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం రైతులకు నిద్ర లేకుండా చేస్తోంది.  బర్దానీ, లారీలు, హమాలీల కొరత కారణంగా కేంద్రాల్లో ధాన్యం తూకం లేటవుతోంది.  మిల్లులకు ధాన్యాన్ని తీసుకెళ్తున్న లారీలు సైతం రోజుల తరబడి అన్‌లోడింగ్‌ కాకుండా ఉంటున్నాయి.  దీంతో రైతులు వారం నుంచి రెండు వారాల వరకు సెంటర్లలోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. మరోవైపు అకాల వర్షాలు బయపెడుతుండడంతో ఓపిక నశించి అనేక చోట్ల ఆందోళనకు దిగుతున్నారు. ఇప్పటికే  శివ్వంపేట మండలం దొంతి, చిన్నగొట్టిముక్కుల, కొల్చారం మండలం రంగంపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట, చేగుంట మండలం పులి మామిడి, మక్కరాజ్​పేటలో తూప్రాన్​, నర్సాపూర్​పట్టణాల్లో వడ్ల సంచులు, ట్రాక్టర్లు అడ్డంపెట్టి రాస్తారోకో చేశారు. పలుచోట్ల  వడ్లకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు.  అధికారలు దిగివచ్చి లారీల కొరత తీరుస్తామని చెబుతున్నా.. పరిస్థితి మారడం లేదు. 

మిల్లుల వద్ద లారీలు, ట్రాక్టర్ల బారులు

మెదక్‌ జిల్లాలో యాసంగిలో 3.51 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు పీఏసీఎస్, ఐకేపీ, మార్కెటింగ్​శాఖల ఆధ్వర్యంలో 411 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 407 ఓపెన్ చేశారు.  జిల్లాలో 160 రైస్​ మిల్లులు ఉన్నా  కేవలం 50 పారా బాయిల్డ్​ రైస్​ మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయించడం సమస్యగా మారింది.  లారీలు, గన్నీబ్యాగుల కొరతతో సెంటర్ల వద్ద కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. మిల్లులకు ధాన్యం తీసుకెళ్లిన లారీలు కూడా నాలుగైదు రోజులు అక్కడే ఉంటుండడంతో  సెంటర్ల నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు.  కొన్నిచోట్ల ట్రాక్టర్లలో తీసుకెళ్లాలని రైతులకు సూచిస్తున్నారు.  అక్కడి రైతులు అలాగే చేస్తున్నా మిల్లుల వద్ద అన్‌లోడింగ్ కావడం లేదు.  స్థలం సమస్య, సరిపడినంత మంది హమాలీలు లేకపోవడంతో రోజుల తరబడి మిల్లుల వద్ద బారులు తీరాల్సి వస్తోంది.  మెదక్, హవేలి ఘనపూర్​, కొల్చారం మండలాల్లోని మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని మెదక్ సమీంపంలోని మంబోజిపల్లి నిజాం షుగర్​ ఫ్యాక్టరీ గోడౌన్​లలో నిల్వ చేయాలని నిర్ణయించినా.. హమాలీల కొరత  వేధిస్తోంది. 

గోనె సంచుల కోసం రైతుల రాస్తారోకో

గోనె సంచుల కొరత తీర్చాలని రైతులు డిమాండ్ చేశారు.  బుధవారం మార్కెట్ యార్డ్ ఎదురుగా కరీంనగర్ రోడ్డులో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  వారం రోజులుగా గోనె సంచులు లేకపోవడంతో అమ్మిన ధాన్యాన్ని మిల్లులకు పంపించలేక పోతున్నామన్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  గంట పాటు రోడ్డుపై బైఠాయించగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని అధికారులతో మాట్లాడి గన్నీ బ్యాగులను ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

వారమైనా లారీలు వస్తలేవు

సెంటర్ కాడికి వడ్లు తెచ్చి కుప్పపోసి వారమైపాయే.  అప్పటి సంది లారీలు రాక నిర్వాహకులు వడ్లు కాంట పెడ్తలేరు.   టాపర్ల కిరాయే 3 వేల దాకా అయ్యింది. నాలెక్క చాలా మంది రైతులు తిప్పలు పడుతున్నరు. ఆఫీసర్లు లారీలను పంపిస్తే మాకు గీ తిప్పలు ఉండకుండే.

కొత్త కృష్ణ, రైతు, వెలమ కన్నా