బాసర ట్రిపుల్ ఐటీలో సీట్ల కేటాయింపుపై అయోమయం

బాసర ట్రిపుల్ ఐటీలో  సీట్ల కేటాయింపుపై అయోమయం

హైదరాబాద్, వెలుగు:  బాసర ట్రిపుల్ ఐటీలో  సీట్ల కేటాయింపుపై అయోమయం నెలకొన్నది. గత నెల 30న  సీట్లు అలాట్ చేస్తామన్న అధికారులు.. ఆ గడువు దాటి పదిరోజులైనా స్పందించడం లేదు. కనీసం ఎప్పుడు కేటాయిస్తారో కూడా స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బాసరలోని ఆర్జీయూకేటీలో 1,500 సీట్లను 2022–23 విద్యా సంవత్సరంలో పాలిసెట్ ద్వారా భర్తీ చేస్తామని ముందుగా ప్రకటన చేశారు. ఆ తర్వాత మళ్లీ పదో తరగతి మార్కులతోనే నింపుతామని జూన్ 30న ఆర్జీయూకేటీ అడ్మిషన్ నోటిఫికేషన్ జారీచేసింది. అప్లికేషన్ల ప్రక్రియ పూర్తి చేసి జులై 30న సీట్ల అలాట్ మెంట్ చేస్తామని వర్సిటీ వెల్లడించింది. ఆయా సీట్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 33,005 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వారంలోనే సీట్లను అలాట్ చేయొచ్చు. 

కానీ అప్లికేషన్ల ప్రక్రియ పూర్తయి 20 రోజులైనా ఇప్పటికీ సీట్ల కేటాయింపుపై ఆర్జీయూకేటీ అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రస్తుతం అప్లై చేసిన వారంతా టెన్త్ మెరిట్ స్టూడెంట్లు. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీల్లో గతనెలలోనే ఇంటర్ ఫస్టియర్ క్లాసులు మొదలయ్యాయి. చాలా మంది ఆర్జీయూకేటీలో సీట్లు వస్తాయనే నమ్మకంతో ఇప్పటికీ ఇంటర్ ​కాలేజీల్లో చేరలేదు. అయితే కార్పొరేట్ కాలేజీల్లో ముందుగా చేరితేనే స్టూడెంట్లకు కొంత ఫీజు మినహాయింపు ఉంటుంది. ఈ టైమ్​లో వెళ్తే ఫీజు భారీగా వసూలు చేసే అవకాశముంది. ఇదేదీ పట్టని ఆర్జీయూకేటీ అధికారులు సీట్ల కేటాయింపుపై  ప్రకటన కూడా చేయడం లేదు. 

ఈడబ్ల్యూఎస్ పై క్లారిటీ లేకనేనా? 

ప్రస్తుతం ఈడబ్ల్యూఎస్ కోటా అమలుపై క్లారిటీ లేకపోవడంతోనే సీట్ల కేటాయింపులో జాప్యం జరుగుతోందనే వాదనలున్నాయి. ఈ కోటా కింద 10 శాతం సీట్లు రెండేండ్ల వరకు సూపర్ న్యూమరీ కింద క్రియేట్ చేసి ఇవ్వాలని కేంద్రం సూచించింది. అయితే ఈ ఏడాదే కొత్తగా ఆర్జీయూకేటీలో ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేస్తున్నందున ఇప్పటికిప్పుడు సూపర్ న్యూమరీ కింద పది శాతం సీట్లు పెంచి కేటాయింపు చేపట్టాలా? లేక  ఓపెన్ కేటగిరీలోనే పది శాతం ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలా? అన్న దానిపై  వర్సిటీ అధికారులు డైలమాలో ఉన్నారు. ఉన్నత విద్యామండలి లేదా విద్యాశాఖ నుంచి క్లారిటీ వస్తేనే ముందుకెళ్లే ఆలోచనలో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో అడ్మిషన్లు మరింత లేట్​ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అన్ని యూనివర్సిటీలకు ఈడబ్ల్యూఎస్ కోటా సీట్ల భర్తీపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చామని ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు.