కార్తీక మాసం వేళ.. తులసి, ఉసిరి మొక్కలకు ఫుల్ డిమాండ్ 

కార్తీక మాసం వేళ.. తులసి, ఉసిరి మొక్కలకు ఫుల్ డిమాండ్ 

అన్ని పండుగల కంటే కార్తీకమాసం కొంచెం స్పెషల్. ప్రత్యేకంగా ఈ నెలలో ఉసిరి, జువ్వి,తులసి చెట్లను పూజిస్తారు భక్తులు. దాంతో నర్సరీల్లో  ఉసిరి, తులసి మొక్కలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కొన్ని నర్సరీల్లో ఉసిరి మొక్కలు  దొరకడం లేదు. తులసిలో వివిధ రకాల మొక్కలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు జనం. కార్తీక మాసం శివుడికి చాలా ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో శివుడితో పాటు మహావిష్ణువు పూజలు, లక్ష్మీ పూజలు కూడా చేస్తుంటారు. 

ఆనవాయితీ ఉన్నవాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు తులసి, ఉసిరి చెట్లకు కల్యాణం కూడా జరిపిస్తుంటారు. ఆలయంలో ఉసిరి చెట్టు  కింద  దీపాలు వెలిగించడం, ఉసిరి చెట్టు లేకపోతే కనీసం ఉసిరి కాయలపై అయినా దీపాలు  వెలిగిస్తూ  కార్తీకమాసం పూజలు చేస్తుంటారు.  మహావిష్ణువుకు ప్రతీకగా ఉసిరి చెట్టు, లక్ష్మీ అమ్మవారికి ప్రతీకగా తులసి చెట్టుకు పూజలు నిర్వహిస్తారు. అందుకే సిటీలో నర్సరీల్లో  తులసి, ఉసిరి మొక్కలకు ఫుల్  డిమాండ్  ఉంది. కొన్ని నర్సరీల్లో అయితే ఉసిరి మొక్క చూద్దామంటే కనిపించడం లేదు. 

మార్కెట్లో  లక్ష్మీతులసి, కృష్ణతులసి, రామతులసి, విష్ణుతులసి ఇలా రకరకాల తులసి మొక్కలకు డిమాండ్ ఉంది. ఏ రకం తులసి మొక్కలైనా 25 నుంచి 30 రూపాయల రేటుంది. తులసితో పాటు అడవి ఉసిరి, హైబ్రిడ్ ఉసిరి మొక్కలు నర్సరీల్లో అందుబాటుల్లో  ఉన్నాయి. ఉసిరి మొక్కలకు గిరాకీ ఎక్కువ ఉండటంతో వంద నుంచి 120 రూపాయల వరకు  పలుకుతున్నాయి. ఈ మొక్కలు తెచ్చిన  రెండు, మూడు రోజుల్లోనే స్టాక్ అయిపోతోందని వ్యాపారులు అంటున్నారు.