
లండన్: క్రికెట్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు, వరల్డ్ కప్ నాకౌట్ గేమ్స్‌లో తాము ఎదుర్కొనే ఒత్తిడిని టెన్నిస్ ప్లేయర్ ప్రతీ వారం ఎదుర్కొంటారని టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. టీ20, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన కోహ్లీ తన వైఫ్ అనుష్క శర్మతో కలిసి సోమవారం (జులై 0) వింబుల్డన్ మ్యాచ్‌లు చూశాడు.
ఈ సందర్భంగా ఇండియా టెన్నిస్ లెజెండ్ విజయ్ అమృత్‌రాజ్‌తో కలిసి స్టార్ స్పోర్ట్స్ చానెల్‌తో మాట్లాడుతూ క్రికెటర్లతో పోలిస్తే టెన్నిస్ ప్లేయర్లు ఎదుర్కొనే ఒత్తిడి ఎక్కువ అన్నాడు. ‘ఒత్తిడితో కూడిన పరిస్థితులలో అనుభవం ఒకేలా ఉండొచ్చు. కానీ వరల్డ్ మ్యాచ్‌ల్లో, ముఖ్యంగా వరల్డ్ కప్‌లో ఇండియా–పాకిస్తాన్ లేదా సెమీఫైనల్, ఫైనల్స్‌లో భారీ ఒత్తిడి కారణంగా క్రికెటర్ల కాళ్లు వణుకుతాయి.
కానీ టెన్నిస్ ఆటగాళ్లు క్వార్టర్ ఫైనల్స్ నుంచి ఫైనల్స్ వరకు అలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటారు. అది చాలా పెద్ద ప్రెజర్. అలాంటి పరిస్థితుల్లోనూ అద్భుతమైన ఫిట్‌నెస్, మానసిక దృఢత్వాన్ని కొనసాగిస్తూ ఆడే టెన్నిస్ ఆటగాళ్లంటే నాకు చాలా గౌరవం’ అని కోహ్లీ తెలిపాడు. వింబుల్డన్ సెంటర్ కోర్ట్‌లో ఆడటం క్రికెట్ స్టేడియంలోఆట కంటే ఎక్కువ ప్రెజర్ కలిగిస్తుందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ‘క్రికెట్ స్టేడియాల్లో చాలా మంది జనం ఉన్నా ఫ్యాన్స్ మాకు దూరంగా ఉంటారు. కాబట్టి ఆటగాడు తన ప్రపంచంలో లీనమైపోవచ్చు.
అభిమానుల మాటలు,చప్పట్లు, తిట్లు మాకు వినిపించవు. కానీ టెన్నిస్‌లో ఫ్యాన్స్ చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉండొచ్చు’ అని అన్నాడు. ఇక, టెన్నిస్‌తో పోలిస్తే క్రికెట్‌లో తిరిగి పుంజుకోవడానికి అవకాశాలు తక్కువని కోహ్లీ అన్నాడు. ‘క్రికెట్‌లో బ్యాటింగ్ చేసేటప్పుడు ప్లేయర్‌కు ఒకే అవకాశం ఉంటుంది. ఒక తప్పు చేస్తే అంతే సంగతులు. మిగిలిన రోజంతా చప్పట్లు కొట్టడం తప్ప చేసేదేమీ ఉండదు. కానీ టెన్నిస్ ప్లేయర్లు రెండు సెట్లు వెనుకబడినా తిరిగి వచ్చి గెలవగలరు’ అని కోహ్లీ చెప్పాడు.
జొకోవిచ్ వింబుల్డన్ గెలవాలి
సెర్బియా లెజెండ్ నొవాక్ జొకోవిచ్ ఈ వింబుల్డన్ టైటిల్ గెలిచి రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్ స్లామ్ సాధించాలని కోహ్లీ ఆకాంక్షించాడు. తను కొంతకాలంగా నోవాక్‌తో టచ్‌లో ఉన్నానని, అతను చాలా మంచి వ్యక్తి అని చెప్పాడు. జొకోవిచ్, స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ మధ్య ఫైనల్ జరగాలని కోహ్లీ ఆశిస్తున్నాడు.
‘అల్కరాజ్, నొవాక్ ఫైనల్లో ఆడాలి. జొకో టైటిల్ గెలవాలి. ఎందుకంటే తన కెరీర్‌లో ఈ స్టేజ్‌లో ఇది చాలా అద్భుతమైన విజయం అవుతుంది. అత్యధిక గ్రాండ్ స్లామ్స్ నెగ్గి, ఆటలో ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్ అయిన నొవాక్ విజయానికి పూర్తి అర్హుడు’ అని విరాట్ పేర్కొన్నాడు.