కాంగ్రెస్​తో లెఫ్ట్ కటీఫ్!.. సీపీఎంకు ఇచ్చే సీట్లపై రాని స్పష్టత

కాంగ్రెస్​తో లెఫ్ట్ కటీఫ్!.. సీపీఎంకు ఇచ్చే సీట్లపై రాని స్పష్టత
  • ఒంటరిగా పోటీకి సీపీఎం కార్యదర్శివర్గం నిర్ణయం
  • అదే బాటలో సీపీఐ..నేడు ఆ పార్టీ స్టేట్ కమిటీ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల పొత్తు ఇక లేనట్టేనని తెలుస్తున్నది. సీపీఎంకు ఇచ్చే స్థానాలపై స్పష్టత రాకపోవడంతో ఒంటరిగా పోటీ చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఇవ్వాల ఆ పార్టీ రాష్ట్ర కమిటీలో దీన్ని ఫైనల్ చేసే అవకాశాలున్నాయి. మరోపక్క సీపీఐ కూడా అదే బాటలో నడుస్తున్నట్టు సమాచారం. దాదాపు నెలరోజులకు పైగా సీపీఎం, సీపీఐ పార్టీలకు చెరో రెండు సీట్లు ఇస్తామంటూ చెప్పి, చివరికి పోటీ ఎక్కువగా ఉందనే పేరుతో కాంగ్రెస్ ఆ పార్టీలకు హ్యాండ్ ఇచ్చింది. తాజాగా రెండు ఎమ్మెల్సీలు ఇస్తామంటూ ప్రతిపాదనలు ముందుకు తీసుకొచ్చింది. దీన్ని లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే, గతంలో సీపీఎంకు మిర్యాలగూడ, వైరా, సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు సీట్లను ఇస్తామంటూ కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించి ఆ తర్వాత మాట మార్చారు. దీంతో చేసేదేమీ లేక సింగిల్​గా పోటీ చేయాలని ఇరు పార్టీలు ప్రాథమికంగా డెసిషన్ తీసుకున్నాయి.

సీపీఎం నేతల ఆగ్రహం

హైదరాబాద్​లోని ఎంబీ భవన్​లో మంగళవారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం స్టేట్ సెక్రటరీ తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన జరిగింది. దీనికి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు విజయరాఘవన్, బీవీ రాఘవులు హాజరయ్యారు. కాంగ్రెస్ తో పొత్తులపై సుదీర్ఘంగా చర్చించారు. పొత్తులుంటాయంటూ కాంగ్రెస్ ఆశలు పెట్టి, చివరికి చేతులు ఎత్తేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తుల్లేవనే మాట చెప్పకుండా సిటీలో సీట్లు తీసుకోవాలని ఓ సారి, ఎమ్మెల్సీలు, రాజ్యసభ అంటూ మాటలు మారుస్తున్నట్లు సీపీఎం నేత ఒకరు చెప్పారు. బుధవారం రాష్ట్ర కమిటీ సమావేశం జరగనున్నది. కాంగ్రెస్ తో పొత్తు లేదనే దానిపై రాష్ట్ర కమిటీ ఆమోదం పొంది, ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో సీపీఐ రాష్ట్ర నేతలతోనూ చర్చించి, కలిసి పోటీ చేసే అంశంపై మాట్లాడనున్నారు.

సీపీఐకీ హ్యాండిచ్చిన కాంగ్రెస్​

సీపీఐకి ఇస్తామన్న సీట్ల విషయంలోనూ కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చింది. పొత్తులపై కనీసం మళ్లీ చర్చలు కూడా చేయడం లేదని ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సీపీఐ రాష్ట్ర కమిటీతో పాటు కౌన్సిల్ సమావేశం బుధవారం ఉంది. ఇందులో కాంగ్రెస్​తో పొత్తుల అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, టీజేఎస్ ఆఫీస్​కు రేవంత్ రెడ్డి, ఠాక్రే ఇతర జాతీయ నాయకులు వెళ్లి చర్చలు జరిపి.. లెఫ్ట్ పార్టీలతో చర్చలు చేయకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ తీరును తప్పుపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ తో లెఫ్ట్ పొత్తులుదాదాపు లేనట్టేనని స్పష్టమవుతున్నది.