పేద విద్యార్థుల చదువులపై ఏ మాత్రం శ్రద్ధ లేదు

పేద విద్యార్థుల చదువులపై ఏ మాత్రం శ్రద్ధ లేదు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్‌‌‌‌కు పేద విద్యార్థుల చదువులపై ఏ మాత్రం శ్రద్ధ లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని బీజేఆర్‌‌‌‌ నగర్‌‌‌‌లో ఉన్న ప్రభుత్వ స్కూల్‌‌ 15 రోజులుగా వర్షం నీటిలోనే ఉందని, ఆ నీళ్లను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. సోమవారం ఈ స్కూల్‌‌ను ఆయన సందర్శించి మాట్లాడారు. 15 రోజుల నుంచి స్కూల్ వరద నీటిలోనే ఉందని, లోపల మోకాలు లోతు నీళ్లు వచ్చి చేరినా విద్యా శాఖ, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కనీసం స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా సోయి లేకుండా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. నగరం నడిబొడ్డున ఉన్న స్కూల్ విషయంలో చూపుతున్న ఈ నిర్లక్ష్యం, పేద విద్యార్థుల చదువులపై రాష్ట్ర సర్కార్‌‌‌‌కు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోందన్నారు. బడాబాబుల పిల్లలు చదివే ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు అండగా నిలుస్తోన్న రాష్ట్ర సర్కార్.. పేదవారి పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడులను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఈ స్కూల్‌‌లో వర్షం నీరు చేరడం ఇదే మొదటిసారి కాదని, ఏటా వానాకాలంలో ఇది కామన్‌‌గా మారిపోయిందన్నారు. ఇప్పటికైనా స్కూల్‌‌లో నీటిని తొలగించాలని డిమాండ్ చేశారు.