
- కోఠి ఈఎన్టీ హాస్పిటల్‌లో మూలకుపడ్డ మెషీన్
- పేషెంట్లకు పీఎన్ఎస్ స్కాన్ మస్ట్
- సీటీ స్కాన్ కోసం ఉస్మానియాకు
- ఎంఆర్‌ఐ అవసరమైతే ప్రైవేట్‌కే..
- ఆలస్యమైతే ప్రాణాలు దక్కవంటున్న డాక్టర్లు
- ఈఎన్టీలో ఇప్పటికే 60 బ్లాక్ ఫంగస్ కేసులు
హైదరాబాద్, వెలుగు: బ్లాక్ ఫంగస్ ట్రీట్‌మెంట్‌కు నోడల్ సెంటర్‌గా ప్రకటించిన కోఠిలోని ఈఎన్టీ హాస్పిటల్‌లో ఆ వ్యాధి ట్రీట్‌మెంట్‌కు ముఖ్యమైన సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ స్కానింగ్ యంత్రాల్లేక రోగులు అవస్థ పడుతున్నారు. పదుల సంఖ్యలో వస్తున్న రోగులను సీటీ స్కాన్ కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు డాక్టర్లు రిఫర్ చేస్తున్నారు. స్కానింగ్‌కు ఆ ఆస్పత్రికి వెళ్లండని చెబుతున్నా అంబులెన్స్‌లు ఏర్పాటు చేయకపోవడంతో రోగులు నడుస్తూ, ఇబ్బంది పడుతూ వెళ్తున్నారు. మరోవైపు ఇప్పటికే గాంధీ పూర్తిగా కరోనా సెంటర్‌గా మారడంతో ఎమర్జెన్సీ కేసులన్నీ ఉస్మానియాకే వస్తున్నాయి. ఈ ఎమర్జెన్సీ పేషెంట్లు, బ్లాక్ ఫంగస్ అనుమానితులతో ఉస్మానియాలో సీటీ స్కాన్ వద్ద పెద్ద క్యూలైన్లు ఏర్పడుతున్నాయి. మంగళవారం ఒక్క రోజే 97 మందికి స్కాన్ చేశామని, ఇంకా వంద మందికిపైగా లైన్‌లో ఉన్నారని అక్కడి టెక్నీషియన్ ఒకరు ‘వెలుగు’కు తెలిపారు. వాస్తవానికి ఈఎన్టీ హాస్పిటల్‌లోనూ సీటీ స్కాన్ ఉంది. అది పాడై ఆర్నెల్లు దాటినా రిపేర్ చేయించలేదు. టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఆఫీసర్లకు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు విషయాన్ని చాలాసార్లు చెప్పామని, పట్టించుకునేవాళ్లు లేరని ఈఎన్టీలో పనిచేసే డాక్టర్లు చెబుతున్నారు. ఈఎన్టీలో బ్లాక్ ఫంగస్ కేసులు ఇప్పటికే 60 దాటాయి. ఇంకో వారంలో ఈ సంఖ్య 200లకు చేరొచ్చని డాక్టర్లు చెబుతున్నారు.
బ్లాక్ ఫంగస్ ట్రీట్‌మెంట్‌కు పారా నాజల్ సైనస్ (పీఎన్ఎస్) సీటీ స్కాన్ కంపల్సరీ చేయాలి. కొన్ని కేసుల్లో ఎంఆర్‌ఐ స్కాన్ కూడా చేయాల్సి ఉంటుంది. సైనస్‌లో ఫంగస్ ఏ స్థాయిలో ఉంది, కంటికి సోకిందా, బ్రెయిన్ వరకూ పాకిందా తెలుసుకునేందుకుఈ స్కానింగ్ చేస్తారు. స్కానింగ్ రిపోర్టు ప్రకారమే ఆపరేషన్లు (డిబ్రైడ్‌మెంట్) చేస్తారు. ఆపరేషన్ తర్వాత కూడా స్కానింగ్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. కొన్ని కేసుల్లో కను గుడ్డు తొలగించాల్సి వస్తుంది. ఈ కేసుల్లో ఎంఆర్‌ఐ కచ్చితంగా చేయాల్సి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. కానీ ఈఎన్టీ హాస్పిటల్‌లో ఎంఆర్‌ఐ మెషీన్ లేదు. గాంధీ దవాఖానలో ఉన్న ఎంఆర్‌ఐ మెషీన్ రిపేర్‌లో ఉంది. ఉస్మానియాలో ఓ పాత ఎంఆర్‌ఐ ఉంది. ఇది నాలుగురోజులకోసారి మొరాయిస్తోంది. ప్రస్తుతం ఎంఆర్‌ఐ కోసం ఉస్మానియాకే రిఫర్ చేస్తున్నారు. అయితే అక్కడున్న మెషీన్‌తో రోజుకు 10 కేసులు చేయడమూ కష్టమేనని టెక్నీషియన్లు చెబుతున్నారు. దీంతో ఎంఆర్‌ఐ కావాలంటే ప్రైవేటుకు పోక తప్పని దుస్థితి నెలకొంది.
వీలైనంత త్వరగా ట్రీట్‌మెంట్ చేస్తేనే..
బ్లాక్ ఫంగస్ బాధితులకు వీలైనంత త్వరగా ట్రీట్‌మెంట్ అందిస్తేనే ప్రాణాలు నిలుస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఆలస్యం చేస్తున్నాకొద్దీ శరీరాన్ని ఫంగస్ చిద్రం చేసి ప్రాణాలు తీస్తుందని అంటున్నారు. కంటి వరకూ పోతే కన్ను తీసేయాల్సి వస్తుందని, మెదడు వరకూ పోతే ప్రాణాలు దక్కే అవకాశం చాలా తక్కువని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోగులకు తాము ఎట్లా ట్రీట్‌మెంట్ చేయాలని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.