జెండా పండుగకు తిరంగాలకు గిరాకీ లేదు

జెండా పండుగకు తిరంగాలకు గిరాకీ లేదు
  • ఆర్డర్స్​ లేక జరగని ప్రొడక్షన్​ 
  • కరోనాతో నష్టపోతున్న వ్యాపారులు

హైదరాబాద్, వెలుగు: జెండా పండుగంటే దేశమంతటా ఎక్కడా లేని జోష్​ పుట్టుకొస్తుంది. వాడవాడలా తిరంగ జెండాలు రెపరెపలాడుతుంటాయి. ఆగస్టు మొదటి వారం నుంచే జెండాలను తయారు చేసే ప్రింటింగ్​ ప్రెస్​లకు ఆర్డర్లు వస్తుంటాయి. కానీ, కరోనా మహమ్మారితో నిరుడు మార్చి నుంచి ఆ జెండా పండుగ కళ తప్పింది. లాక్​డౌన్​, స్కూళ్లు మూతపడడం వంటి కారణాలతో పెద్దగా వేడుకలను నిర్వహించట్లేదు. దీంతో జెండాలకు గిరాకీ తగ్గిపోయింది. ఈ ఏడాదీ అదే పరిస్థితి. ఆర్డర్లు లేక బిజినెస్​ దారుణంగా దెబ్బతిన్నదని హైదరాబాద్​లోని ప్రింటింగ్​ప్రెస్​ ఓనర్లు వాపోతున్నారు.  మామూలుగా జులై, ఆగస్ట్​, డిసెంబర్​, జనవరి నెలల్లో హైదరాబాద్​లోని ప్రింటింగ్​ ప్రెస్​లలో జెండాలను తయారు చేస్తుంటారు. లక్షల సంఖ్యలో చిన్నా..పెద్ద జెండాలను తయారు చేసేవారు. కూలీలను నియమించుకుని తిరంగాలను ప్రింట్​ చేసేవారు. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వ్యాపారులు చెబుతున్నారు. గిరాకీ లేక ప్రొడక్షనే చేయట్లేదన్నారు. గత ఏడాది డిసెంబర్​లో గ్రేటర్​ ఎన్నికలతోనూ రిపబ్లిక్​ డే కోసం ఎక్కువగా జెండాలు తయారు చేయలేదని అంటున్నారు. త్వరలోనే హుజూరాబాద్​ ఉప ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉండడంతో.. టీఆర్​ఎస్​, బీజేపీ, కాంగ్రెస్​ పార్టీల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని చెబుతున్నారు. జెండాలతో పాటు పార్టీల నేతల పేర్లు, ఫొటోలతో మాస్కుల కోసమూ ఆర్డర్లు పెడ్తున్నారని అంటున్నారు.