తెలంగాణలో పవన్ ఎంట్రీ ఎందుకు?

తెలంగాణలో పవన్ ఎంట్రీ ఎందుకు?
  • తెలంగాణ టెస్ట్ లో డకౌట్ అయితే?
  • అక్కడ టీడీపీతో జత.. ఇక్కడ బీజేపీతో పొత్తు 
  • పార్టీ నిర్మాణంలేని చోట 8 సీట్లలో పోటీ 
  • ఇప్పటికీ బీజేపీతో కలవని జనసైనికులు
  • కేసీఆర్ పై విమర్శల్లేకుండానే పవన్ స్పీచ్
  • ప్రత్యర్థి ఎవరో తేల్చుకోలేక ఆ పార్టీ నేతల పరేషాన్ 

హైదరాబాద్: తెలంగాణలో ఆ పార్టీకి నిర్మాణం లేదు. సినిమా స్టార్ గా పవన్ కల్యాణ్ అభిమానులు మాత్రమే ఉన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఎలాంటి సమస్యల మీద పోరాటాలు చేసిన దాఖలాలు లేవు. ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగినా.. ఇక్కడి బీజేపీతో కలిసి ఆ పార్టీ ప్రతినిధులెవరూ స్టేజ్ షేర్ చేసుకోలేదు. బండి సంజయ్ పాదయాత్ర చేసినా.. కిషన్ రెడ్డి బస్సుయాత్ర చేసినా జనసైనికులు ఆ దరిదాపుల్లో కూడా కనిపించలేదు. ఆల్ ఆఫ్ సడన్ గా తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చింది గ్లాస్ పార్టీ..! బీజేపీతో జతకట్టి 8 సెగ్మెంట్లలో బరిలోకి దిగుతోంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న జనసేన.. అక్కడ టీడీపీతో కలిసి 2024 అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది.  రెండు  పార్టీలు కలిసి అక్కడ యాక్టివిటీస్ చేస్తున్నాయి. ఈ తరుణంలో జనసేన ఎందుకు తెలంగాణకు ఎందుకు షిప్ట్ అయ్యిందనే చర్చ కొనసాగుతోంది.

కలిసి ముందుకు సాగేనా?

బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. తెలంగాణలో జనసేనకు నిర్మాణం జరగలేదు. ఆ పార్టీ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ఆ పార్టీకి ఉన్న కార్యకర్తలెందరు..?  నాయకులెవరు..?  వాళ్లు బీజేపీ నాయకులతో కలిసి ప్రచారం చేస్తారా..? జనసేనతో పొత్తు బీజేపీకి ఏమేరకు కలిసి వస్తుంది? అనేది ప్రశ్నార్థకంగానే మారింది. అటు జనసేన అభ్యర్థులు  సైతం అంతర్మథనంలో పడ్డారు. పోటీ చేస్తున్నాం సరే.. బీజేపీ నాయకులు తమతో  కలిసి వస్తారా..? ఆ పార్టీ ఓట్లు తమకు  కన్వర్ట్ అవుతాయా..? అన్న టెన్షన్ వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ప్రధానంగా కూకట్ పల్లి లాంటి స్థానంలో సహకారం ఏమేరకు ఉంటుందనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి స్థానాలను పొత్తులో భాగంగా ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోవద్దని బీజేపీ లీడర్ల పట్టుబట్టిన విషయం తెలిసిందే. నాంపల్లి ఆఫీసులో ఆందోళనలు సైతం నిర్వహించారు. శేరిలింగం పల్లి స్థానం కోసం మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పట్టుబట్టారు. బీజేపీకే కేటాయించాలనే డిమాండ్ ను అధినాయకత్వం ముందుంచారు. ఈ పరిణామాలతో శేరిలింగంపల్లిని బీజేపీకే కేటాయించారు. కూకట్ పల్లి నుంచి జనసేన అభ్యర్థి ఎం. ప్రేమ్ కుమార్ బరిలోకి దిగుతున్నారు. జనసేన అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లో ఆ పార్టీ నిర్మాణం లేదు. పొలిటికల్  యాక్టివిటీస్ కూడా చేయలేదు. తెలంగాణలో ఆ పార్టీ స్టాండ్ ఏమిటన్నది రాజకీయ విశ్లేషకులకు కూడా అంతుచిక్కని సమస్యగానే మిగిలిపోయింది. ఈ తరుణంలో బీజేపీతో కలిసి బరిలోకి దిగుతున్న జనసేన ఆయా సెగ్మెంట్లలో ఎంత మేరకు ప్రభావం చూపగలుగుతుంది? 

పవన్ ప్రత్యర్థి ఎవరు..?

నిన్న ఎల్బీ స్టేడియంలో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాని మోదీతో పాటు పవన్ కల్యాణ్​ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం పేలవంగా సాగిందనే విమర్శలున్నాయి. అటు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఇటు సీఎం కేసీఆర్ ను విమర్శలు చేయకుండానే ముగించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ తమ ప్రత్యర్థి బీఆర్ఎస్ అని చెబుతుండగా జనసేనాని ఎలాంటి విమర్శలు చేయకపోవడం గమనార్హం. తెలంగాణ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ పార్టీ అసలు స్టాండ్ ఏమిటి? పవన్ తో దోస్తానా బీజేపీ లాభం చేకూర్చుతుందా..? అలాంటి పార్టీతో బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుంది..? అనేది హాట్ టాపిక్ గా మారింది.