కొత్త సహకార సంఘాల ఏర్పాటు లేనట్టే!

కొత్త సహకార సంఘాల ఏర్పాటు లేనట్టే!

ప్రతిపాదనలు వెనక్కి తీసుకున్న రాష్ట్ర సర్కారు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్త ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటు లేనట్లేనని తెలుస్తోంది. ప్రతి మండలంలో రెండు సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని పోయినేడాది ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట్ర సర్కార్.. ఆ తర్వాత ఆ ఫైల్‌‌ను పక్కన పడేసింది. సహకార ఎన్నికలు ముగిసిన వెంటనే కొత్త సంఘాలు ఏర్పాటు చేస్తామని అప్పట్లో చెప్పినా.. ఇప్పుడు ఆ ప్రతిపాదనపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో.. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీలు), మండలాల్లో సహకార సంఘాలు ఏర్పాటు ఉండబోదని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 909 సంఘాలు ఉన్నాయి. వీటికి పోయినేడాది ఎన్నికలు నిర్వహించారు. కాగా, రాష్ట్రంలో మొత్తం 589 మండలాలు ఉండగా.. 81 మండలాల్లో ఒక్క సహకార సంఘం కూడా లేదు. మరో 272 మండలాల్లో ఒక్కటి చొప్పున మాత్రమే సంఘాలు ఉన్నాయి. ఇలాంటి చోట్ల రైతుల రద్దీ ఎక్కువగా ఉంటోందని మండలానికి రెండు సహకార సంఘాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచనతో.. కొత్తగా 434 సంఘాల ఏర్పాటుకు సహకార శాఖ అధికారులు ప్లాన్ చేసినా..  ప్రభుత్వం నో చెప్పడంతో ఆ ప్రపోజల్స్‌‌ను​ పక్కన పెట్టారు.

కొత్త జిల్లాల్లో డీసీసీబీలూ లేవు

కొత్త జిల్లాల్లో డీసీసీబీలను ఏర్పాటు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు సహకార శాఖ ప్రతిపాదనలు ​పంపింది. అయితే వాటి ఏర్పాటుకు ఆర్బీఐ నో చెప్పింది. కొత్త డీసీసీబీలు ఏర్పాటు చేయాలంటే.. ప్రస్తుతమున్న వాటి ఆస్తులు, డిపాజిట్లు, రుణాలు, రికవరీ, వ్యాపారం ఆధారంగా విభజించాలి. అలా చేస్తే వాటి టర్నోవర్​ పడిపోతుంది. కనీసం రూ.కోటి టర్నోవర్​ ఉండాలని ఆర్బీఐ చెప్పినట్లు తెలిసింది. దీంతో కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటైనా.. తమ ప్రాంతంలో డీసీసీబీలు, సహకార సంఘాలు లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు.