తెలంగాణకు అన్యాయం జరగలేదు

తెలంగాణకు అన్యాయం జరగలేదు

ఎలాంటి వివక్షా లేదు.. అన్ని రాష్ట్రాలు సమానమే
రాష్ట్రానికి ఐజీఎస్టీ బకాయిలు లేవన్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ

కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధుల్లో తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరగలేదు. ఫైనాన్స్‌‌ కమిషన్‌‌ చేసిన సిఫార్సులు, తీసుకున్న నిర్ణయాల మేరకే మేం కేటాయింపులు జరుపుతాం. ఇందులో ఫైనాన్స్‌‌ మినిస్ట్రీ పాత్ర ఏమీ లేదు. అన్యాయం జరిగిందంటూ మినిస్ట్రీని తప్పుపట్టడం కరెక్ట్‌‌ కాదు. రాష్ట్రాలతో మేం సఖ్యతతోనే వెళ్లాలనుకుంటున్నాం. ప్రధాని మోడీ కూడా కోఆపరేటివ్‌‌ ఫెడరలిజం స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నారు

– నిర్మలా సీతారామన్​

హైదరాబాద్‌‌, వెలుగు: గత ఐదేండ్లుగా కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు వచ్చే నిధులు 128% పెరిగాయని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్​ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్​ చెప్పారు. అంటే వంద నుంచి 228 శాతం వరకు ట్యాక్సులు, గ్రాంటుల రూపంలో నిధులు అధికంగా వస్తున్నాయని ఆమె అన్నారు. 2010–15 మధ్య తెలంగాణకు కేంద్రం నుంచి రూ.46,767 కోట్లు అందగా, 2015–2020 మధ్య అది రూ.1,06,606 కోట్లకు పెరిగిందని తెలిపారు.

పన్నుల వాటా తగ్గింపు కూడా ఫైనాన్స్‌ కమిషన్‌ రికమండేషన్‌ ప్రకారమే జరిగిందని, 42 నుంచి 41 శాతానికి తగ్గడానికి కేంద్ర పాలిత ప్రాంతాలు(యూటీ) పెరగడమే కారణమని చెప్పారు. ‘‘దేశంలో ఒక రాష్ట్రం తగ్గింది. రెండు యూటీలు పెరిగాయి. దాంతో యూటీలకు నిధులు కేటాయించడంలో భాగంగా ఫైనాన్స్‌ కమిషన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. మా మినిస్ట్రీ పాత్ర ఇందులో ఏమీ లేదు’’అని ఆమె వివరించారు. పర్ఫార్మింగ్‌ స్టేట్స్‌కి కేంద్రం నిధులు తగ్గిస్తోందనే వాదనను ఆమె తోసిపుచ్చారు. ‘‘దేశంలోని ప్రతి రాష్ట్రం తన వాటాను కాంట్రిబ్యూట్‌ చేస్తుంది. తెలంగాణ కూడా చేసింది. అడ్మైరబుల్‌గా చేసింది. దాన్ని మేం ఒప్పుకుంటాం. ఏ ఒక్క రాష్ట్రాన్ని తక్కువగా చూడాలని మాకు ఉండదు. అందరితో సహకార పద్ధతిలోనే వెళ్తాం. అందరినీ ప్రోత్సహించేలాగే మా విధానం ఉంటుంది. పనిషింగ్‌ ధోరణి మాకు ఉండదు’’అని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ అన్న మాటలను గుర్తు చేసిన నిర్మలా సీతారామన్.. ఆయన మాటలు తనను నొప్పించాయన్నారు. ‘‘మంత్రి కామెంట్లను నేను మీడియాలో చూశాను. ‘గివ్‌’అనే పదం పట్ల ఆయన కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. పార్లమెంట్‌లో ఒక ప్రశ్నకు జవాబుగా నేను గివ్‌ అనే పదాన్ని వాడాను. అది పార్లమెంటరీ పదజాలమే. అందులో మంత్రికి ఏమైనా అభ్యంతరాలుంటే ఆ పదం తొలగించమని లోక్‌సభ స్పీకర్‌కు రాసుకోవచ్చు. స్పీకర్‌ ఆ పదం వాడమంటే, వాడుతాం. వద్దంటే మానేస్తాం’’అంటూ ఆమె ఘాటుగా బదులిచ్చారు. ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సందేహాల నివృత్తి, అభిప్రాయాల సేకరణలో భాగంగా దేశవ్యాప్తంగా తలపెట్టిన ప్రోగ్రామ్​లో భాగంగా నిర్మలా సీతారామన్​ ఆదివారం హైదరాబాద్‌ వచ్చారు. సిటీలోని ఓ హోటల్‌లో వాణిజ్య సంఘాలు, ఎంఎస్‌ఎంఈ ప్రతినిధులు, వ్యాపారులతో ఇంటరాక్షన్‌ అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ పలు ప్రశ్నలకు జవాబులు చెప్పారు.

2 వేల నోటు రద్దుపై సమాచారం లేదు

జీఎస్టీ, ఐజీఎస్టీ కాంపెన్సేషన్‌ ఇవ్వడంలో ఆలస్యం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం అంటోందని, బకాయిపై సీఎం కేసీఆర్‌ లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేయగా నిర్మల స్పందిస్తూ.. ‘‘జీఎస్టీ కాంపెన్సేషన్‌ సెస్‌ కలెక్షన్‌ తగ్గడం వల్లనే మధ్యలో మేం ఒకసారి ఇవ్వలేకపోయాం. తెలంగాణకే కాదు. అన్ని రాష్ట్రాల విషయంలోనూ ఇలాగే జరిగింది. జీఎస్టీ యాక్ట్‌ ప్రకారం కాంపెన్సేషన్‌ సెస్‌ ద్వారానే చెల్లింపులు జరపాలి. అది తగ్గడం వల్ల ఇబ్బంది అయ్యింది. అయితే ఒక విడత విడుదల చేశాం. మళ్లీ మరో విడతలో మిగితావి ఇచ్చేస్తాం. ఈ విషయాన్ని నేను పార్లమెంటులో వివిధ సందర్భాల్లో చెప్పాను కూడా. జీఎస్టీ కాంపెన్సేషన్‌ సెస్‌ వస్తే కేటాయింపులు మేం ఆపలేం. అలాగని సెస్‌ కలెక్ట్‌ కాకుండా కేటాయింపులు చేసేందుకు కేంద్రం దగ్గర ప్రత్యేక నిధులు ఏమీ ఉండవు’’అని చెప్పారు. మిషన్‌ భగీరథ, మిషన్​ కాకతీయలకు నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అడిగిన విషయంపై స్పందన కోరగా.. ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా పరిశీలించాలని, నియమ నిబంధనల మేరకే కేటాయింపులు చేయగలుగుతామని అన్నారు. రెండు వేల రూపాయల నోటును రద్దు చేస్తున్నారా అనే ప్రశ్నకు ఈ విషయం తన దృష్టికి రాలేదని, దీనిపై ఎలాంటి సమాచారం లేదన్నారు. ఉపాధి హామీకి నిధుల కేటాయింపులు తగ్గుతున్నాయనే ప్రశ్నకు సమాధానం చెబుతూ అది పూర్తిగా డిమాండ్‌ మీద ఆధారపడి ఉంటుందని, తమకు పని కావాలని ఎక్కువ మంది వస్తే కేటాయింపులు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయన్నారు.

కాంప్లికేషన్స్ తగ్గించడానికే..

కొత్త ట్యాక్స్‌ విధానంపై నిర్మలా సీతారామన్​ మాట్లాడుతూ పన్నుల విధానాన్ని సరళీకరించేందుకే దీన్ని ప్రవేశపెట్టామన్నారు. ట్యాక్సుల విధానంలో ఉన్న కాంప్లికేషన్స్‌ని తగ్గించడమే తమ ఉద్దేశమన్నారు. కొత్త విధానంలోకి వెళ్లడం, వెళ్లకపోవడం ప్రజల ఇష్టమని, తాము బలవంతమేమీ చేయడం లేదని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం లేదనే ప్రశ్నకు స్పందిస్తూ.. ఆయా రాష్ట్రాల్లో స్థానికంగా ఉండే సమస్యల వల్లే రైల్వే ప్రాజెక్టు పనులు మెల్లగా సాగుతున్నాయని, నిధుల కేటాయింపులోని జాప్యం వల్ల కాదన్నారు. ఎవరైనా అలా భావిస్తే ప్రాజెక్టుల వారీగా వివరాలు అందిస్తే రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తానని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. కాగా, ఐజీఎస్టీ సంబంధించి కేంద్రం నుంచి బకాయిలు రావాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందిస్తూ రాష్ట్రానికి చెల్లించాల్సిన ఎలాంటి బకాయిలు లేవని వివరణ ఇచ్చింది. కార్యక్రమంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే, ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అతాను చక్రవర్తి, వ్యయశాఖ కార్యదర్శి సొమనాథన్, సీబీడీటీ చైర్మన్ పీసీ మోడీ, సీబీఐసీ చైర్మన్ అజిత్ కుమార్ పాల్గొన్నారు.