కొలువులు నామ్​కే వాస్తే.. ఖాళీలు బారానా.. నింపింది చారానా

కొలువులు నామ్​కే వాస్తే.. ఖాళీలు బారానా.. నింపింది చారానా
  • ఖాళీలు బారానా.. నింపింది చారానా
  • ఏడేండల్లో ప్రభుత్వ శాఖల్లో నింపింది 77 వేల ఉద్యోగాలే
  • తెలంగాణ వచ్చాక తీసేసిన ఉద్యోగాలు 10 వేలపైనే
  • పీఆర్సీ రిపోర్ట్ ప్రకారం మరో 1.91 లక్షల పోస్టులు ఖాళీ
  • 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పవట్టి ఐదు నెలలాయె

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ వచ్చి ఏడేండ్లయినా నిరుద్యోగుల పరిస్థితి ఏమీ మారలేదు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భారీగా ఉన్నా రాష్ట్ర సర్కారు నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. దీంతో స్టూడెంట్లు, నిరుద్యోగుల్లో అశాంతి, ఆవేదన నెలకొంది. ‘‘తెలంగాణ వస్తే.. ఆంధ్రోళ్లు పోతరు. మన కొలువులు మనకు వస్తయ్.. బతుకులు బాగుపడ్తయ్’’ అని ఉద్యమ టైంలో చెప్పిన లీడర్లు ఇప్పుడు గద్దెనెక్కినా నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు. ఏడేండ్లలో ముక్కుతూ మూలుగుతూ 77 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు. ఇందులో సగం పోలీస్ ఉద్యోగాలే. ప్రస్తుతం 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని,  పీఆర్సీ కోసం ప్రభుత్వం నియమించిన కమిటీనే రిపోర్ట్ ఇచ్చింది. ఈ లెక్కలను బట్టి ప్రభుత్వ శాఖల్లో బారానా మందం ఖాళీలు ఉంటే.. చారానా మందం పోస్టులు మాత్రమే నింపినట్లు స్పష్టమవుతోంది.

అంతంతే
ఈ ఏడేండ్లలో ఒక్క గ్రూప్ 1 నోటిఫేషన్ కూడా వెలువడలేదు. ప్రభుత్వం డీఎస్సీని టీఆర్టీగా మార్చి పక్కనపడేసింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొత్తం 1,50, 326 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇందులో 1,26,641 పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇందులో టీఎస్ పీఎస్సీ  ద్వారా 30,594, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 31,972, గురుకుల టీచర్లు, లెక్చరర్ పోస్టులు 3,623, డిపార్ట్​మెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేసిన 11,278 పోస్టులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాల కేటగిరీలోకి వస్తున్నాయి. ఇవన్నీ కలిపితే 77,467 ఉద్యోగాలవుతున్నాయి. వీటితో పాటు ఆర్టీసీ, సింగరేణి, టెస్కాబ్, డీసీసీబీ, విద్యుత్ సంస్థల్లో 49,174 పోస్టులను రెగ్యులరైజ్ చేశామని కేటీఆర్ ప్రకటించినప్పటికీ, వారెవరికీ ఉద్యోగ భద్రత లేదు. 

మరో 1.91 లక్షల పోస్టులు ఖాళీ
రాష్ట్రంలో 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ కమిటీ​ వెల్లడించింది. మొత్తం శాంక్షన్డ్ స్ట్రెంత్ 4,91,304 మంది కాగా.. ప్రస్తుతం 3,00,178 (61%) మందే పని చేస్తున్నారు.  2011 లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా  3.52 కోట్లు కాగా.. మంజూరైన పోస్టులను పరిగణనలోకి తీసుకుంటే ప్రతి వేయి మందికి 14 మంది ఉద్యోగులు ఉండాలి. కానీ ఉద్యోగుల రేషియా 1:40 శాతంగా మాత్రమే ఉంది. పీఆర్సీ రిపోర్టు ప్రకారం హోం శాఖలో అత్యధికంగా 37,182  పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్​మెంట్ లో 23,998 ఖాళీలు ఉన్నాయి. వైద్యారోగ్య శాఖలో 30,570 పోస్టులు, రెవెన్యూ శాఖలో 7,961, పంచాయతీరాజ్‌‌ శాఖలో 12,628 ఖాళీలు ఉన్నాయి. 

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందితోనే..
తెలంగాణ రాష్ట్రమొస్తే కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ పదమే వినపడొద్దని చెప్పిన కేసీఆర్.. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయకుండా అతి తక్కువ జీతానికి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ను పెట్టుకుని నెట్టుకొస్తున్నారు. వీరికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు. ఎన్నటికైనా తమ ఉద్యోగం పర్మినెంట్ కాకపోతుందా అనే ఆశతో వీళ్లంతా ఏండ్ల తరబడి వెట్టిచాకిరి చేస్తున్నారు. రాష్ట్రంలో 50,400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, 58,128 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు డ్యూటీ చేస్తున్నారు. ఈ పోస్టులను రెగ్యులరైజ్/భర్తీ చేయాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 

టీచర్ పోస్టుల భర్తీ మరిచిన సర్కార్..  
తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం డీఎస్సీని టీచర్ రిక్రూట్ మెంట్(టీఆర్టీ)గా మార్చేసింది. టీఎస్ పీఎస్సీ ద్వారా ఒక్కసారే టీచర్ పోస్టులను భర్తీ చేసింది. 8,792 టీచర్ పోస్టుల భర్తీకి 2017లో నోటిఫికేషన్‌‌ ఇచ్చి, చాలా ఆలస్యంగా పూర్తి చేసింది. గత ఆరేండ్ల లో వేలాది మంది టీచర్లు రిటైర్​ అయినప్పటికీ మళ్లీ టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరోవైపు టెట్​ను కేవలం రెండుసార్లే (2016 మే 22న, 2017 జులై 23న) నిర్వహించారు. ఒకసారి టెట్‌‌లో అర్హత సాధించిన అభ్యర్థికి ఏడేండ్ల వరకు కాల పరిమితి ఉంటుంది. ఆ గడువు దాటితే మళ్లీ టెట్‌‌ రాయాలి. ఎన్‌‌సీటీఈ రూల్స్ ప్రకారం ఏటా రెండుసార్లు నిర్వహించాల్సి ఉన్నా, విద్యాశాఖ మాత్రం ఏడాదికి ఒక్కసారే నిర్వహించేలా 2015లో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారమైనా 2018, 2019, 2020, 2021లో నాలుగు సార్లు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. ఒక్కసారైనా పెట్టలేదు.  ఇప్పటికే గడువు తీరిన ఆరు లక్షల మంది అభ్యర్థులు టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. మరో వైపు టెట్ అర్హత లేకపోవడంతో ఇతర ప్రైవేటు స్కూళ్లలో, నేషనల్ రిక్రూట్మెంట్ టెస్టుల్లో నిరుద్యోగులకు అవకాశం లేకుండా పోతోంది.

50 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఐదు నెలలు 
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 55 స్థానాలకు టీఆర్ఎస్ పడిపోవడం, బీజేపీ పుంజుకోవడంతో సీఎం కేసీఆర్ 2020 డిసెంబర్ 14న 50 వేల ఉద్యోగాల ప్రకటన చేశారు. రాష్ట్రం లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్నా రు. కానీ ఎలాంటి నోటిఫికేషన్లు జారీ చేయలేదు. ఆ తర్వాత రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు, నాగార్జున సాగర్ బైపోల్, మున్సిపల్ ఎన్నికలు ఇలా అన్ని ఎన్నికల్లోనూ ‘త్వరలో 50 వేల ఉద్యోగాల భర్తీ’ అనే హామీని ప్రచారం చేశారు. ఎన్నికలు పూర్తయ్యాయి. జోనల్ వ్యవస్థకు కేంద్రం కూడా ఓకే చెప్పింది. అయినా ఒక్క ఉద్యోగ ప్రకటన వెలువడలేదు. 

తీసేసిన ఉద్యోగాలు 10 వేల పైనే
తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని కోరుతూ సమ్మె చేసిన 7,500 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తీసేసింది. అలాగే ఇంటింటికి నల్లా నీళ్లు అందించే మిషన్ భగీరథ స్కీమ్ లో పనిచేసిన ఇంజనీర్లు, వర్క్ ఇన్ స్పెక్టర్లు,  జూనియర్ అసిస్టెంట్లకు పదకొండు నెలలు జీతాలు ఇవ్వకుండా సతాయించిన ప్రభుత్వం వారిని 2020 జూన్ లో తొలగించింది. హార్టికల్చర్ డిపార్ట్​మెంట్​లో ఆఫీస్ అసిస్టెంట్లు, గార్డెనింగ్, కంప్యూటర్ ఆపరేటర్లుగా పని చేసే సుమారు 500 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఏడాది కింద  తొలగించింది. నిధుల్లేవని కాంట్రాక్ట్ రెన్యువల్ చేయకుండా మూడు నెలల జీతాలను ఎగ్గొట్టింది. నష్టాల పేరిట ఆర్టీసీలోనూ సుమారు 300 మంది హోంగార్డులను డ్యూటీ నుంచి తొలగించింది.

గ్రూప్-1 నోటిఫికేషన్ జాడ లేదు
రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదల కాలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి టర్మ్ లో 128 గ్రూప్ –1 ఖాళీల భర్తీ పనిని టీఎస్​పీఎస్సీకి అప్పగించినా సర్కారు నిరక్ష్యం కారణంగా ముందడుగు పడలేదు. కొత్త జోన్ల ప్రకారం పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించినా.. ఏ పోస్టు ఏ జోన్ పరిధిలోకి వస్తుందన్నది తేల్చాలని టీఎస్‌‌పీఎస్సీ ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. గ్రూప్ –1 నోటిఫికేషన్ వస్తుందన్న ఆశతో లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఐదారేండ్లుగా కోచింగ్ తీసుకుంటున్న నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇక గ్రూప్ – 2 నోటిఫికేషన్ ఒక్కసారి వేసి.. రిజల్ట్ ఇచ్చిన తర్వాత రెండేండ్ల వరకు పోస్టింగ్ ఇవ్వకుండా క్యాండి డేట్లను ప్రభుత్వం తిప్పుకుంది. ఇప్పటికీ 77 మంది ఎక్సైజ్ ఎస్సైలకు పోస్టింగ్ ఇవ్వలేదు. 

నెరవేరని నిరుద్యోగ భృతి హామీ  
2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ‘నిరుద్యోగ భృతి’ అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఆ హామీని గాలికొదిలేశారు. రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేర్లు నమోదు చేసుకున్న నిరుద్యోగులే సుమారు 29 లక్షల మంది ఉన్నారు. వీరిలో అర్హులైన వారందరికీ ప్రతి నెలా రూ. 3,016 ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 2019 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్  లో ఈ స్కీమ్ కు రూ. 1,810 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. కానీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. తర్వాత ప్రవేశపెట్టిన రెగ్యులర్ బడ్జెట్ లో అసలు నిధులే కేటాయించలేదు. కరోనా, లాక్ డౌన్ తో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు ఊడి యువత రోడ్డున పడిన సమయంలోనైనా భృతి ఇచ్చి అండగా నిలవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడమే లేదు.