
- వలస పోయిన సీనియర్లు..అదే దారిలో మరికొందరు
- పార్టీ తీరుపై కొందరు నేతల అసంతృప్తి
- దుబ్బాక పరిస్థితే వస్తుందేమోనని ఆందోళన
హైదరాబాద్, వెలుగు: ‘‘గ్రేటర్ కాంగ్రెస్‌లో లీడర్ ఎవరున్నరన్నా? ఈయన మా లీడర్ అని గట్టిగా చెప్పుకునేటోళ్లు ఎవరున్నరు? కొందరు పార్టీ వదిలి పోయిన్రు. ఇంకొందరు అదే దారిలో ఉన్నరు. ఎందరు మిగుల్తరో తెల్వదు. పోయేటోళ్లను ఆపేటోళ్లు లేరు. మంచీచెడు ఎవరితో చెప్పుకోవాల్నో తెలుస్తలే. అంతా కన్ఫ్యూజన్‌లో ఉన్నం. ఈ పార్టీని నమ్ముకున్నందుకు ఏమవుతదో తెలుస్తలేదు’’.. గ్రేటర్ హైదరాబాద్‌లో ఓ కాంగ్రెస్ లీడర్ ఆవేదన ఇది. లోకల్ లీడర్లు, క్యాడర్ కూడా ఇదే పరేషాన్‌లో ఉన్నారు. పార్టీలో చరిష్మా ఉన్న నాయకుడు ఎవరూ లేకుండా పోయారని, సిటీలో కాంగ్రెస్ ఉనికే ప్రమాదంలో పడిందని బాధపడుతున్నారు. రెండో ప్లేస్‌లో ఉన్న కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమించినా ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. పార్టీ కోసం ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్న తమకు దిశానిర్దేశనం చేసే లీడరే లేడని బాధపడుతున్నారు.
52 నుంచి 2కి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009లో మజ్లిస్‌తో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్.. 52 సీట్లు గెలుచుకొని మేయర్ పీఠం దక్కించుకుంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక 2016లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 2 సీట్లకే పరిమితమైంది. ‘ఒక్క చాన్స్’ నినాదంతో వెళ్లిన టీఆర్‌ఎస్‌కు సిటిజనులు పట్టం కట్టారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా గ్రేటర్ కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. ఎన్నికలతో సంబంధం లేకుండా గ్రేటర్ కాంగ్రెస్ సిటీ ఆఫీసు గతంలో సందడిగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అప్పట్లో గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడి హాదాలో ఉన్న దానం నాగేందర్.. శివారు ప్రాంతాల్లో బలంగా ఉండి, గ్రేటర్ అధ్యక్ష స్థానాన్ని ఆశించిన సుధీర్ రెడ్డి.. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు పార్టీ వీడారు. ఇలా తమ డివిజన్లను గెలిపించుకునే సత్తా ఉన్న నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఇప్పుడు గట్టి లీడర్ లేకుండా పోయారు.
కొత్త ఇన్చార్జ్ వచ్చినా..
చేవెళ్ల కాంగ్రెస్ ఇన్చార్జ్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లోకి వచ్చిన ఉద్దేశం నెరవేరడం లేదని కొండా.. జీహెచ్ఎంసీ అభ్యర్థులకు టికెట్లు తాను కాకుండా గాంధీభవన్ ఇవ్వడం ఏమిటని అంజన్ కుమార్ అలకపూనినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీళ్లను పార్టీ ముఖ్య నేతలు బుజ్జగించే పనిలో ఉన్నారని పేర్కొంటున్నాయి. పోలింగ్‌కు పది రోజుల మందు పార్టీలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం దారుణమని లోకల్ లీడర్లు వాపోతున్నారు. గాంధీభవన్‌లో మీటింగ్‌లు పెట్టి ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సందేశాలు పంపితే క్యాడర్‌లో ఏం ఉత్సాహం ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రానికి కొత్త ఇన్చార్జ్ వచ్చారని సంబరపడ్డా.. ఆయన రాక కూడా జోష్ నింపలేకపోతోందని నిరాశపడుతున్నారు. కాంగ్రెస్‌కు గ్రేటర్‌లో కూడా దుబ్బాక పరిస్థితి ఏర్పడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.
ఉందామా? జంపైదామా?
తాజాగా మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, శేరిలింగంపల్లి నియోజక వర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ రవి కుమార్ యాదవ్.. బీజేపీలోకి చేరారు. ఇదే దారిలో మరికొందరున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. ‘ఏం చేస్తే బాగుంటుంది? పార్టీలో కంటిన్యూ కావాలా? లేక బీజేపీలోకి వెళ్లాలా’ అంటూ మరికొందరు చర్చించుకుంటున్నారు. నెల రోజుల కిందట కాంగ్రెస్‌లో చేరిన ఒక యువ నాయకుడు కూడా ఇలాంటి డైలమాలోనే ఉన్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. గ్రేటర్ లీడర్లు, క్యాడర్‌ను ఉత్సాహపరిచే కార్యక్రమాలు కూడా పార్టీ చేపట్టడం లేదని, నియోజక వర్గ, డివిజన్ స్థాయి నాయకులను పిలిచి మాట్లాడేవారే కరువయ్యారని ఆవేదన చెందుతున్నారు. పార్లమెంటరీ నియోజక వర్గాల వారీగా గ్రేటర్‌ను విభజించి.. ఇన్చార్జ్ నేతృత్వంలో కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని వాపోతున్నారు.