రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం వల్ల జరిగే నష్టమేమీ లేదు

రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం వల్ల జరిగే నష్టమేమీ లేదు

మునుగోడు, వెలుగు: తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి మునుగోడు బైఎలక్షన్​లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి  కానుకగా ఇవ్వాలని పీసీసీ వైస్​ప్రెసిడెంట్​ మల్లు రవి, వర్కింగ్​ప్రెసిడెంట్ అంజన్​కుమార్​యాదవ్, కాంగ్రెస్​పార్టీ  బై ఎలక్షన్​నియోజకవర్గ ఇన్​చార్జి దామోదర్​రెడ్డి ​పిలుపునిచ్చారు. గురువారం కాంగ్రెస్​జిల్లా నాయకులతో కలిసి  చండూరులో నిర్వహించే బహిరంగసభ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మునుగోడు  మొదటి నుంచి కాంగ్రెస్​పార్టీకి కంచుకోటగా ఉందన్నారు. మధ్యలో వచ్చిన రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం వల్ల జరిగే నష్టమేమీ లేదన్నారు. సీఎం కేసీఆర్​ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. దళితులకు 3ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. ప్రతి కార్యకర్త పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేయాలన్నారు.  ఈ సమావేశంలో నల్గొండ, యాదాద్రి డీసీసీ ప్రెసిడెంట్లు శంకనాయక్,  అనిల్ రెడ్డి, పున్న కైలాష్​, పల్లె రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

మునుగోడులో కాంగ్రెస్​జెండా ఎగరేస్తం

చౌటుప్పల్, వెలుగు: మునుగోడులో మళ్లీ కాంగ్రెస్​జెండా ఎగరేస్తామని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్​అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం చౌటుప్పల్ లోని కాంగ్రెస్​పార్టీ ఆఫీస్​లో  చౌటుప్పల్, నారాయణపురం మండలాల  ముఖ్య కార్యకర్తల  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు మండలాల్లోని కాంగ్రెస్​పార్టీ కమిటీలు, అనుబంధ సంఘాల కమిటీలన్నింటిని రద్దు చేస్తున్నట్లు  ప్రకటించారు. త్వరలోనే కొత్త కమిటీలు నియమిస్తామని తెలిపారు.  రాజకీయ జన్మనిచ్చిన తల్లి లాంటి కాంగ్రెస్​పార్టీని  రాజగోపాల్ రెడ్డి  మోసం చేశాడని మండిపడ్డారు. పార్టీ ఎన్నో అవకాశాలిచ్చినా.. కాంట్రాక్టుల కోసం పార్టీ వీడారని విమర్శించారు. ఈటల రాజేందర్ ను సీఎం కేసీఆర్​అహంకారంతో పార్టీ నుంచి బయటకు పంపితే, హుజూరాబాద్​ప్రజలు తిరిగి గెలిపించుకున్నారని,  కానీ రాజగోపాల్ రెడ్డికి పార్టీలో ఎలాంటి అవమానాలు జరగలేదని, ఆయనను మునుగోడు ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు.