ఫ్యూచర్ సిటీకి లేఅవుట్!.. రెడీ చేస్తున్న సింగపూర్ కన్సల్టెన్సీ కంపెనీ

ఫ్యూచర్ సిటీకి లేఅవుట్!.. రెడీ చేస్తున్న సింగపూర్ కన్సల్టెన్సీ కంపెనీ
  • 15 వేల ఎకరాల్లో ఏ వింగ్ ఎంత విస్తీర్ణంలో చేపట్టాలనే దానిపై డీపీఆర్
  • మరో 15 వేల ఎకరాల్లో అర్బన్ ఫారెస్ట్ యాక్టివిటీస్‌‌కు ప్లాన్‌‌ 
  • గ్లోబల్ టెండర్లతోనే ముందుకు వెళ్లేలా ప్రపోజల్స్​

హైదరాబాద్​, వెలుగు:‘భారత్​ ఫ్యూచర్ సిటీ’ ప్రణాళికలు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. సింగపూర్‌‌కు చెందిన ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఈ మెగా ప్రాజెక్టుకు తుది మెరుగులు దిద్దుతున్నది. మొత్తం 30 వేల ఎకరాల విస్తీర్ణంలో.. అత్యాధునిక నగరంగా దీనిని తీర్చిదిద్దేందుకు బ్లూప్రింట్ సిద్ధం చేస్తున్నది. ఇందులో 15 వేల ఎకరాలను కోర్ సిటీ డెవలప్‌‌మెంట్‌‌కు, మరో 15 వేల ఎకరాల ఫారెస్ట్‌‌ను అర్బన్ ఫారెస్ట్ యాక్టివిటీస్‌‌కు కేటాయించారు. 

సింగపూర్ కన్సల్టెన్సీ ప్రాథమిక నివేదిక ప్రకారం.. ముచ్చర్ల, మీర్‌‌ఖాన్‌‌పేట, పన్ దండు, కందుకూరు గ్రామాల పరిధిలోని  వేల ఎకరాల్లో ఈ మెగా సిటీ విస్తరించనున్నది. భౌగోళిక అనుకూలతలు, నేల స్వభావం  ఆధారంగా ఏ వింగ్ ఎక్కడ ఉండాలన్నది నిర్ణయించారు. హైవేకు ఇటువైపు కోర్ సిటీ, అటువైపు ఎకో -టూరిజం వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.  ఈ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ దాదాపు కొలిక్కి వచ్చింది.

 ప్రధానంగా 15 వేల ఎకరాల్లో ఏ వింగ్ ఎక్కడ ఉండాలి? రోడ్ల వెడల్పు ఎంత? డ్రైనేజీ సిస్టమ్, అండర్ గ్రౌండ్ కేబులింగ్‌‌లాంటి అంశాలపై డీపీఆర్ తుది దశకు చేరుకుంది. భవిష్యత్తులో ట్రాఫిక్ చిక్కులు లేకుండా గ్రిడ్ రోడ్లు, మెట్రో కనెక్టివిటీని ప్రధాన లే అవుట్‌‌లోనే చేర్చారు. ‘నెట్ జీరో’ సిటీగా కార్బన్ ఉద్గారాలు లేని నగరంగా దీనిని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

పక్కా ప్రణాళికతో  పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది.  ఈ మొత్తం ప్రాజెక్టులో అవినీతికి ఆస్కారం లేకుండా, అత్యున్నత ప్రమాణాలు పాటించేలా ప్రభుత్వం గ్లోబల్ టెండర్ల విధానానికే మొగ్గు చూపుతున్నది.  

ముచ్చర్ల సెంట్రల్ పాయింట్.. స్కై స్క్రాపర్లతో ‘ఏఐ సిటీ’..

ఫ్యూచర్ సిటీకి గుండెకాయలాంటి ముచ్చర్ల ప్రాంతంలో గతంలో ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లోనే ప్రధాన ‘ఏఐ సిటీ’ని ప్రతిపాదించారు. న్యూయార్క్, దుబాయ్ తరహాలో ఆకాశహర్మ్యాలు , ఐటీ టవర్లు, కార్పొరేట్ ఆఫీసులన్నీ ఈ ముచ్చర్ల కోర్ ఏరియాలోనే రానున్నాయి. ఎత్తైన గుట్టలు, రాళ్లతో కూడిన ఈ ప్రాంతం ఎత్తైన భవనాల నిర్మాణానికి అత్యంత అనుకూలమని నిపుణులు తేల్చారు. 

అమెజాన్, గూగుల్‌‌‌‌‌‌‌‌లాంటి డేటా సెంటర్లన్నీ ఈ సెంట్రల్ హబ్‌‌‌‌‌‌‌‌లోనే ఏర్పాటు కానున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి వచ్చే ప్రధాన 300 అడుగుల రోడ్డు నేరుగా ఈ ఏఐ సిటీని తాకుతుంది. అంటే.. ఫ్యూచర్ సిటీలోకి ఎంటర్ అవ్వగానే కనిపించే ఐకానిక్ జోన్ ఇదే ఉండనున్నట్లు తెలుస్తున్నది. కాలుష్యానికి తావులేని ‘గ్రీన్ ఫార్మా’ కంపెనీలకు,  డేటా సెంటర్లకు ప్రత్యేక క్లస్టర్లను కేటాయించారు. ఇవి రెసిడెన్షియల్ జోన్‌‌‌‌‌‌‌‌కు నిర్ణీత దూరంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 

ఫార్మా సిటీ అంటే కాలుష్యం అనే అపోహను చెరిపేస్తూ, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానంతో నడిచే కంపెనీలకే ఇక్కడ అనుమతి ఇవ్వనున్నారు. మరోవైపు ఏఐసిటీ కోసం భారీ స్కై స్క్రాపర్లతో కూడిన ఐటీ టవర్లను డిజైన్ చేశారు. నాలెడ్జ్ అండ్ స్కిల్ వ్యాలీ ముచ్చర్లకు ఆనుకొని ఉన్న మీర్‌‌‌‌‌‌‌‌ఖాన్ పేట ప్రాంతాన్ని ‘ఎడ్యుకేషన్ హబ్’గా తీర్చిదిద్దే ప్లాన్ ఖరారైంది. ఇప్పటికే ఇక్కడ ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’కి శంకుస్థాపన చేశారు. దీనికి చుట్టుపక్కల ఉన్న సువిశాలమైన స్థలాల్లోనే అంతర్జాతీయ యూనివర్సిటీల క్యాంపస్‌‌‌‌‌‌‌‌లు రాబోతున్నాయి.  ఇక్కడ ఉండే సహజమైన చెరువులను అలాగే ఉంచుతూ, వాటి ఒడ్డున లైబ్రరీలు, రీసెర్చ్ సెంటర్లు వచ్చేలా డిజైన్ చేస్తున్నారు. 

ఫారెస్ట్ ఎడ్జ్‌‌‌‌‌‌‌‌లో.. హెల్త్ సిటీ అండ్​ వెల్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ రిసార్ట్స్

మొత్తం 30 వేల ఎకరాల్లో సగభాగం అంటే 15 వేల ఎకరాల ఫారెస్ట్​లో కొంత భాగం అర్బన్ ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌గా అభివృద్ధి చేయనున్నారు. చెట్లు పెంచడమే కాదు.. ఇందులో ఎకో- టూరిజం యాక్టివిటీస్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. నైట్ సఫారీలు, ట్రెక్కింగ్ ట్రాక్‌‌‌‌‌‌‌‌లు, సైక్లింగ్ జోన్లు, వెల్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ రిసార్ట్‌‌‌‌‌‌‌‌లు ఈ అటవీ ప్రాంతంలో ఉంటాయి. నగరవాసులు వారాంతాల్లో సేద తీరేలా గ్లాంపింగ్ సదుపాయాలు కల్పిస్తారు. సిటీకి ఒకవైపు దట్టమైన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కనెక్టివిటీ ఉంది. 

సరిగ్గా అటవీ సరిహద్దులకు దగ్గరలో ‘హెల్త్ టూరిజం’ జోన్‌‌‌‌‌‌‌‌ను ప్లాన్ చేశారు. ప్రకృతి చికిత్సాల యాల తరహాలో ఆస్పత్రులు ఉండబోతున్నాయి. కం దుకూరు మండలం పరిధిలో అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండే భూముల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, వెల్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ సెంటర్లు, యోగా రీట్రీట్స్ ఏర్పాటుకానున్నాయి.  

స్పోర్ట్స్ కాంప్లెక్స్ అండ్  గోల్ఫ్ కోర్స్

కొండలు, గుట్టలు లేకుండా సాఫీగా ఉండే మైదాన ప్రాంతాలను స్పోర్ట్స్ సిటీ కోసం కేటాయించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం.. 3 వేల ఎకరాల విస్తీర్ణంలో ప్లాన్​ చేశారు.  ఒలింపిక్స్ స్థాయి క్రీడలను నిర్వహించే సామర్థ్యంతో ఈ స్పోర్ట్స్ విలేజ్ ఉండబోతున్నది. ఇందులో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంతోపాటు ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్, హాకీ, టెన్నిస్ కోర్టులకు ప్రత్యేక జోన్లను కేటాయించారు.  

భవిష్యత్తులో కామన్‌‌‌‌‌‌‌‌వెల్త్ లేదా ఏషియన్ గేమ్స్‌‌‌‌‌‌‌‌లాంటి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో జరిగితే, ఈ ఫ్యూచర్ సిటీనే ప్రధాన వేదిక కానున్నది. ఫ్యూచర్ సిటీ పరిధిలో ఉన్న పెద్ద చెరువులు, కుంటలను కలుపుతూ.. ‘బ్లూ-గ్రీన్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్’ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌తో ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ విభాగాన్ని డిజైన్ చేస్తున్నారు. హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ స్టూడియోలు, 
పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్లు, వీఎఫ్ఎక్స్  హబ్‌‌‌‌‌‌‌‌లు ఇక్కడ ఏర్పాటు కానున్నాయి.  

సిటీకి ఏ మూల నుంచి అయినా ఇక్కడికి 15 నిమిషాల్లో చేరుకునేలా అంతర్గత రోడ్ల అనుసంధానం ఉంటుంది.  శ్రీశైలం హైవేకి ఇరువైపులా హై-డెన్సిటీ కమర్షియల్ జోన్‌‌‌‌‌‌‌‌ను ప్రతిపాదించారు. అంటే.. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌‌‌‌‌‌‌‌లు, స్టార్ హోటల్స్ అన్నీ మెయిన్ రోడ్డుకు ఆనుకొనే ఉంటాయి. దీని వెనుక భాగంలో.. అంటే ఐటీ సిటీకి, కమర్షియల్ జోన్‌‌‌‌‌‌‌‌కు మధ్యలో ‘రెసిడెన్షియల్ టౌన్‌‌‌‌‌‌‌‌షిప్స్’ వస్తాయి.  

ఎయిర్​పోర్ట్ టూ ఫ్యూచర్ సిటీ.. మెట్రో మణిహారం

శంషాబాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ నుంచి నేరుగా ఫ్యూచర్ సిటీ (ముచ్చర్ల) వరకు మెట్రో లైన్ ప్రతిపాదన సిద్ధమైంది. తుక్కుగూడ ఎగ్జిట్ నుంచి ప్రారంభమయ్యే ప్రధాన రహదారి మధ్యలో మెట్రో పిల్లర్లు రానున్నాయి. ఫ్యూచర్ సిటీలో ప్రధాన కూడలి వద్ద భారీ ‘ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్ హబ్’ను ఏర్పా టు చేయనున్నారు. ఇక్కడే మెట్రో స్టేషన్, బస్ బే, ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్లు ఒకే చోట ఉంటాయి.

 సిటీ లోపల డీజిల్, పెట్రోల్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌ను అనుమతించకుండా.. కేవలం ఎలక్ట్రిక్ బస్సులు, పాడ్ టాక్సీలే తిరిగేలా ప్లాన్ చేస్తున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ ఆర్​) కూడా ఈ సిటీకి దక్షిణాన టచ్ అవుతుండటంతో లాజిస్టిక్స్ రవాణాకు ఆ మార్గాన్ని కేటాయించారు.