- రిక్రూట్‌మెంట్లలో నైతిక విలువలకే పెద్దపీట వేయాలి: రాష్ట్రపతి ముర్ము
- పేదల కోసం పనిచేసేటోళ్లనే ఎంపిక చేయాలి
- టెక్నాలజీని వాడుకుని పారదర్శకతను పెంపొందించాలని సూచన
- పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ల జాతీయ సదస్సులో ప్రసంగం
హైదరాబాద్, వెలుగు: నిజాయితీ లేని అధికారులతో దేశానికే ముప్పు పొంచి ఉంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హెచ్చరించారు. ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల నైతిక విలువలకే పెద్దపీట వేయాలని అన్నారు. “ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యే అభ్యర్థుల్లో స్కిల్స్, సామర్థ్యం కొంచెం తక్కువున్నా భయపడాల్సిన పని లేదు. ట్రైనింగ్ ఇచ్చి వాటిని సరిదిద్దవచ్చు. కానీ ఒక అభ్యర్థిలో నిజాయితీ లోపిస్తే మాత్రం.. దానిని ఎవరూ సరిచేయలేరు. నిజాయితీ లేని అధికారులతో దేశానికి, సమాజానికి ఊహించని నష్టం వాటిల్లుతుంది. అందుకే ఆఫీసర్ల ఎంపికలో నిజాయితీ, నైతిక విలువలకే పెద్దపీట వేయాలి. ఈ విషయంలో రాజీపడొద్దు” అని ముర్ము సూచించారు.
శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్ల జాతీయ సదస్సును రాష్ట్రపతి ముర్ము ప్రారంభించి మాట్లాడారు. కేవలం సిలబస్ చదివి పాస్ అయ్యేవాళ్లు కాకుండా, ప్రజలకు సేవా చేయాలనే అంకితభావం ఉన్నవాళ్లే ఆఫీసర్లుగా రావాలని ఆమె అన్నారు. నిజాయితీ తర్వాత సివిల్ సర్వెంట్లకు ఉండాల్సిన అతిపెద్ద లక్షణం.. స్పందించే గుణమని పేర్కొన్నారు.
‘‘ముఖ్యంగా పేదలు, మహిళల విషయంలో ఆఫీసర్లు సున్నిత భావంతో ఉండాలి. లింగ వివక్ష చూపొద్దు. అణగారిన వర్గాలు, పేదలు కోసం పని చేయాలన్న తపన ఉన్న యువతనే ఎంపిక చేయాలి. వీటికి కమిషన్లు ప్రాధాన్యం ఇవ్వాలి” అని సూచించారు.
కమిషన్లు.. చేంజ్ ఏజెంట్లు
బీఆర్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహానుభావులు సివిల్ సర్వీసెస్ వ్యవస్థపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. ‘‘మన రాజ్యాంగంలోని ఒక భాగాన్ని పూర్తిగా సేవలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లకే కేటాయించారు. కేంద్రం, రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పాత్ర, వాటి విధులకు రాజ్యాంగ నిర్మాతలు ఎంతటి ప్రాధాన్యమిచ్చారో.. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.
రాజ్యాంగంలోని సమానత్వం, సామాజిక న్యాయం అనే లక్ష్యాలను నెరవేర్చే ‘చేంజ్ ఏజెంట్లు’.. పబ్లిక్ సర్వీస్ కమిషన్లే. కేవలం అందరికీ సమాన అవకాశం కల్పించడమే కాదు.. ఫలితాల్లోనూ సమానత్వం సాధించేలా పనితీరు ఉండాలి” అని సూచించారు.
1926లోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్..
స్వాతంత్ర్యం రాకముందే 1926లోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటైందని, మన వ్యవస్థలకు ఘనమైన చరిత్ర ఉందని రాష్ట్రపతి ముర్ము గుర్తు చేశారు. ‘‘1935 యాక్ట్ ద్వారా ఫెడరల్, ప్రొవిన్షియల్ కమిషన్లు ఏర్పడ్డాయి. 1950లో గణతంత్ర దేశంగా మారాక ఇప్పుడున్న యూపీఎస్సీ, స్టేట్ కమిషన్లు ఏర్పడ్డాయి. యూపీఎస్సీ, స్టేట్ కమిషన్లు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ, దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
అయితే పాత పద్ధతులకు కొత్త ఆలోచనలను జోడించి.. వినూత్నంగా ఆలోచించే సివిల్ సర్వెంట్లను అందించాలి. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని అందుకోవాలంటే సమర్థవంతమైన పాలన అవసరం” అని అన్నారు.
ఈ చర్చలతో ఎంతో మేలు: గవర్నర్
దేశవ్యాప్తంగా నియామక ప్రక్రియను మరింత పకడ్బందీగా మార్చేందుకు ఈ చర్చలు ఉపయోగపడతాయని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఇంతటి ప్రతిష్టాత్మక సదస్సును నిర్వహి స్తున్నందుకు టీజీపీఎస్సీని ఆయన అభినందించారు. యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ మాట్లా డుతూ.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటై ఈ ఏడాదితో వందేండ్లు పూర్తవుతుందని చెప్పారు.
ఈ సందర్భంగా రిక్రూట్‌మెంట్ వ్యవస్థలో అత్యుత్తమ విధానాలు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. ఈ సదస్సును రాష్ట్రపతి ప్రారంభించడం తమకు ఎంతో గర్వకారణమ న్నారు. ఆమె రాకతో కమిషన్లన్నీ రెట్టించిన ఉత్సాహంతో, మరింత సమర్థవంతంగా పనిచేస్తాయని పేర్కొన్నారు.
