
కీళ్లు, మోకాళ్లు, నడుము భాగాల్లో కదలికలు లేక కొన్నిసార్లు నిశ్చలంగా ఉండిపోతాయి. కొంతమంది కాసేపు ఒళ్లు వంచితే (కదలిక జరిగితే) ఎక్కడో ఒక చోట నొప్పులు అంటుంటారు. ఇవి కొట్టిపారేసేంత చిన్న సమస్యలేం కాదు. కానీ, ఏ వ్యాధుల వల్లో వచ్చేవి కాకపోతే.. కాస్త శరీరాన్ని కదిలించమని చెప్పే సిగ్నల్స్ అని గుర్తించాలి. శరీర కదలికలను కూడా ట్రైనర్లు నేర్పిస్తారు. దాన్నే మొబిలిటీ ట్రైనింగ్ అంటారు.
నిజానికి దీన్ని చాలామంది పెద్దగా పట్టించుకోరు. కానీ, రోజుకు పది నిమిషాలు ఈ ట్రైనింగ్ తీసుకోవాల్సిందే. శారీరకంగా మనకు ఎంత శక్తి ఉందో దాన్ని బట్టి బాడీని కాస్త కదిలించాలి. అంతేకాదు.. బాడీలో ఈ మూడు సంకేతాలు కనిపిస్తే.. జాగ్రత్తపడాలి అంటున్నారు ఎక్స్పర్ట్స్.
మొబిలిటీ ట్రైనింగ్ అంటే.. శరీర కదలికలను, కండరాలు సాగే గుణాన్ని మెరుగుపరిచేందుకు చేసే ఎక్సర్సైజ్. ఇది కీళ్ల చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేయడం ద్వారా కీళ్లు ఈజీగా కదలడానికి సాయపడుతుంది. మొబిలిటీ ఎక్సర్సైజ్ కేవలం అథ్లెట్స్‌కి మాత్రమేకాదు.. అందరికీ అవసరమే. పదినిమిషాలు మొబిలిటీ ఎక్సర్సైజ్ చేస్తే చాలు.. బాడీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. గాయాలు కాకుండా నివారించొచ్చు. రోజూవారీ కదలికలు ఈజీ అవుతాయి.
బిగుతైన కండరాలు
స్ట్రెచింగ్ చేసిన తర్వాత కూడా నడుము భాగంలో బిగుతుగా అనిపిస్తే.. చాలా తక్కువగా శరీరాన్ని కదిలిస్తున్నారని అర్థం. కీళ్లు కదిలించకపోతే.. కండరాలు బిగుతుగా మారొచ్చు. కాబట్టి కదలికల ద్వారా ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఫ్రాగ్ స్ట్రెచ్, క్యాట్– కౌ పోజ్, హిప్ రాకింగ్ వంటివి రోజూ చేయాలి. ఈ మూమెంట్స్ చేయడం వల్ల కీళ్లలో ఉండే ఫ్లూయిడ్ నేచర్ ఇంప్రూవ్ అవుతుంది.
మోకాళ్ల నొప్పి రాకుండా..
ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ల నొప్పులు ఉన్నాయని బాధపడేవాళ్లు చాలామంది ఉన్నారు. మోకాళ్ల నొప్పులు రాకుండా ఉండాలంటే నీ రాకింగ్, హిప్ ఫ్లెక్సర్ స్ట్రెచ్, యాంకిల్ మొబిలిటీ డ్రిల్స్ వంటివి చేయాలి.
వెన్ను నొప్పి ఎందుకంటే..
కూర్చునేటప్పుడు భంగిమ (పోశ్చర్) సరిగా లేకపోతే వెన్ను నొప్పి వస్తుంది. ఈ మధ్య యువతలో ఎక్కువగా కనిపించే సమస్య ఇదే. ఎక్కువసేపు కూర్చుని ఉండడం కూడా దీనికి కారణమే. భుజాలు, వెన్ను నొప్పి, వంగిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారంటే దానికి మూల కారణం కదలిక లేకపోవడమే. కూర్చునే భంగిమ సరిగా లేకపోతే కండరాలు బలహీనంగా మారతా యి.
వెన్నెముక కదలిక పరిమితంగా ఉండిపో తుంది. ఆఫీస్‌ల్లో, కదలకుండా పని చేసేవాళ్లు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు. వెన్ను నొప్పి రాకుండా ఉండాలంటే కోబ్రా పోజ్ (భుజంగాసనం), బర్డ్–డాగ్ పోజ్ వంటివి వేయాలి. ఈ కదలికల వల్ల నడుము కింది భాగంలో ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. మొబిలిటీ ట్రైనింగ్‌లో చేసే.. ప్రతి ఎక్సర్సైజ్ మీ ట్రైనర్ సలహా మేరకు చేయాలి.