విత్తనాలియ్యరు.. ఏమెయ్యాల్నో చెప్పరు..

విత్తనాలియ్యరు.. ఏమెయ్యాల్నో చెప్పరు..
  • వడ్ల కొనుగోళ్లపై క్లారిటీ ఇవ్వని రాష్ట్ర సర్కారు
  • వరి వద్దని చెప్పుడుకే సర్కారు పరిమితం 
  • పునాస పంటలు వేసుకొమ్మని సూచనలు
  • ఏవి, ఎంత వెయ్యాలో చెప్పకుండా దాటవేత
  • తమకూ తెల్వదంటున్న అగ్రి ఆఫీసర్లు
  • సగం పంటలకు అదును దాటిపోయింది
  • వరి కొనుగోళ్లకు, కొత్త సీజన్ కు ప్లానే లేదు
  • ఎన్నడూ లేనంత సంక్షోభంలో యాసంగి

ఆరుగాలం కష్టపడి పండిస్తే కండ్ల ముందే వడ్లు తడిసి మొలకలొస్తున్నయ్​.. కల్లాల్లో ఎక్కడి కుప్పలు అక్కడ్నే ఉన్నయ్​.. 
పంట అమ్ముడుపోక రైతు చేతిలో చిల్లిగవ్వ లేదు.. యాసంగికి వరి వెయ్యొద్దని చెప్పుడు తప్ప ఏమెయ్యాల్నో, ఏం జెయ్యాల్నో రాష్ట్ర సర్కారు చెప్తలేదు.. మరోపక్క పునాస పంటలకు అదును దాటుతోంది.. వీటికి తోడు ఎరువులు, విత్తనాల కొరత. మొత్తం మీద యాసంగి సాగు ఎట్లయితదోనని రైతన్న అయోమయంలో పడ్డడు.

హైదరాబాద్ / మంచిర్యాల, వెలుగు: యాసంగికి సర్కారు యాక్షన్ ప్లాన్ లేకపోవడంతో రైతుల్లో గందరగోళం నెలకొంది. అదను దాటిపోతున్నా, ఏ పంట, ఎంత వేసుకోవాలో సర్కారు చెప్తలేదు. ఏ పంట సాగు చేద్దామన్నా  సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో లేవు. గత యాసంగిలో 25-.3 లక్షల ఎకరాల్లో పునాస పంటలు సాగయ్యాయి. ఇప్పుడు వరి వద్దనడంతో ఒక్కసారిగా కనీసం 60 లక్షల ఎకరాల్లో మొత్తం పునాస పంటలే వేయాల్సి ఉంటుంది. ఇంతటి విస్తీర్ణానికి  సరిపడా విత్తనాలు మార్కెట్లో అందుబాటులో లేవు. వేరుశనగ, పప్పుశనగ, పెసర, మినుములు, ఆవాలు, నువ్వులు, కుసుమలు, ఆముదాలు, సన్​ఫ్లవర్​, జొన్న  వేయండని చెప్పడమే తప్ప ఏది ఎంత విస్తీర్ణంలో వేయాలో ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. మెజారిటీ రైతులు ఒకే పంట సాగు చేస్తే వానకాలం వడ్లకు పట్టిన గతే పడుతుందన్న ఆందోళన ఉంది. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రాష్ట్రంలో ఇప్పటికే వేరుశనగ విత్తనాలకు కొరత ఉంది. సన్‌‌ఫ్లవర్‌‌, మినుములు, పెసర విత్తనాలు కూడా ఏ జిల్లాలోనూ అందుబాటులో లేవు. తాము 46 శాతం విత్తనాలే సప్లై చేస్తామని, మిగతావి రైతులే చూసుకోవాలని ఆఫీసర్లే చెబుతున్నారు. వరి, జొన్న, మక్క, సజ్జ వంటి ఫుడ్‌‌ గ్రెయిన్స్‌‌, వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, సోయా వంటి ఆయిల్‌‌ సీడ్స్‌‌, కంది, పెసర, మినుము విత్తనాలకు 2018 దాకా సర్కారు 33 శాతం సబ్సిడీ ఇచ్చేది. మూడేండ్లుగా అది ఆగిపోవడంతో క్వాలిటీ విత్తనాలు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. ఇలాంటప్పుడు ఇంత భారీ విస్తీర్ణంలో ప్రత్యామ్నాయ పంటలు ఎలా సాధ్యమని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నారు. 
ఇదేనా విత్తన భాండాగారం?
తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ సాగుకు సరిపడా విత్తనాలందించడం లేదు. సేకరిస్తున్నవి చాలక ప్రతిసారీ జాతీయ విత్తన సంస్థ వైపు చూస్తోంది. మిగతా విత్తనాల సరఫరా బాధ్యతలను జిల్లాలవారీగా ప్రైవేటు సంస్థలకే  అప్పగించింది. రాష్ట్రంలో యాసంగికి 5.90 లక్షల క్వింటాళ్ల  విత్తనాలు కావాలి. టీఎస్‌‌ఎస్‌‌డీసీ 99,174 క్వింటాళ్లే సప్లై చేస్తోంది. 
మరో 62 వేల  క్వింటాళ్లు ఎన్‌‌ఎస్‌‌సీ నుంచి తెచ్చి సరఫరా చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కలిపి 1.61లక్షల క్వింటాళ్లే సేకరించాయి. మరో లక్ష క్వింటాళ్ల బాధ్యత ప్రైవేటు కంపెనీలపై పెట్టింది. మిగతా 3.29 లక్షల క్వింటాళ్ల విత్తనాలు రైతులే సేకరించుకోవాలంటోంది!
ఎరువులు సగం కూడా రాలే
యాసంగికి 20.5 లక్షల టన్నుల ఎరువులు కావాల్సి ఉండగా ఇప్పటికీ సగం కూడా రాలేదు. అక్టోబర్‌‌, నవంబరు నెలల్లో కోటా ప్రకారం 3 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉంటే 1.27లక్షల టన్నులే వచ్చింది. ఇందులోనూ ఇప్పుడు 89 వేల టన్నులే మిగిలింది. డీఏపీ, ఎన్‌‌పీకే, ఎంఓపీలదీ ఇదే పరిస్థితి. రెండు నెలల్లో 48 వేల టన్నుల డీఏపీ కి 8వేల టన్నులే వచ్చింది. ఏన్‌‌పీకే 1.76 లక్షల టన్నులకు 52వేల టన్నులే ఉంది. ఎంఓపీ 17 వేల టన్నులకు 6 వేల టన్నులే ఉంది. డిసెంబర్​, జనవరి కోటా ఎరువులు కూడా ఇంకా తెప్పించాల్సే ఉంది.
అదును దాటితే అసలుకే ఎసరు
రాష్ర్టంలో శనగ, ఆవాలు, కుసుమ, ఆముదం పంటలకు ఈ నెల 15తో అదును దాటిపోయింది. పల్లి విత్తుకోవడానికి మరో వారమే గడువుంది. పెసర, మినుము సాగుకు డిసెంబర్​10 వరకు, జొన్నలకు ఆ నెలాఖరు వరకు, నువ్వులకు ఫిబ్రవరి 15 దాకా ఉంది. అదును దాటాక పునాస పంటలు వేస్తే  తెగుళ్ల ముప్పుంటుంది. ప్రత్యామ్నాయ పంటలపై ఇప్పటికీ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వక కన్​ఫ్యూజన్లో పడిపోయారు. పొలాల్లో నీళ్లు, బురద ఆరకపోవడంతో కోతలకే ఇబ్బందిపడ్డందున ఇప్పటికిప్పుడు పునాస పంటలు వేసుకునే పరిస్థితి కూడా లేదంటున్నారు.
వేరే పంటలు పండయి
వానాకాలం పంట కోసి ఇరవై రోజులు దాటుతంది. యాసంగికి దొడ్డొడ్లు వేద్దామనుకుంటె సర్కారు వద్దంటున్నదట. మాయి సౌడు భూములు. వేరే పంటలేమీ పండయి. వడ్లు తప్ప ఇంకోటి పెడితే మొదటికే మోసమొస్తది. పునాస పంటలకు అదును దాటిపోతంది. ఆల్శంగ పునాస పంటలు వేస్తె ఏం పండుతై? ఎవలు కొంటరు? మేం మొత్తం మునుగకముందే యాసంగి మీద సర్కారు 
ఏదో ఒకటి చెప్పాలె. ‑ పింగళి రమేశ్, ఎల్లారం, మంచిర్యాల జిల్లా
రైతులను ఆగం చేస్తున్రు..
రెండున్నర లక్షలకు 12 ఎకరాలు కౌలు పట్టిన. పండిచ్చిన వడ్లను కొనే దిక్కు లేదు. వడ్లు నేనే కొంటున్న అని కేసీఆర్​ఇన్నేండ్ల నుంచి చెప్పకుంట వచ్చిండు. ఎన్నడన్న మోడీ జోలి తీసిండా? ఇప్పుడేమో మోడీ కొంటలేడు గనుక వడ్లు వెయ్యకున్రి అంటుండు. ఏమెయ్యాల్నో చెప్తలేడు. విత్తనాల గురించి, మద్దతు ధర గురించి ఏం మాట్లాడ్తలేడు. ఆల్లాళ్లు కొట్టుకుంట మమ్ముల ఆగం చేస్తున్నరు.- గొట్టె మల్లేశ్​, జెండ వెంకటాపూర్​, మంచిర్యాల జిల్లా