సీఎం కేసీఆర్ పచ్చి అబద్దాలాడుతున్రు..

సీఎం కేసీఆర్  పచ్చి అబద్దాలాడుతున్రు..

నీచ రాజకీయాలకు పాల్పడితే సహించేది లేదు
సీఎం కేసీఆర్, కేటీఆర్ లకు బండి సంజయ్ వార్నింగ్

నారాయణపేట/మక్తల్/ఊట్కూర్​, వెలుగు : సమతామూర్తి విగ్రహా విష్కరణకు రావొద్దంటూ పీఎంవో నుంచి సీఎం కేసీఆర్ కు ఫోన్ వచ్చిందని,  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ చెప్పడాన్ని బీజేపీ స్టేట్​చీఫ్​ బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. తండ్రీ కొడుకులు పచ్చి అబద్దాలు మాట్లాడుతారనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా గురువారం రాత్రి మక్తల్ నియోజకవర్గం పగిడిమర్రి గ్రామంలో నిర్వహించిన రచ్చబండలో బండి సంజయ్​ కేసీఆర్, కేటీఆర్ లపై నిప్పులు చెరిగారు. సాక్షాత్తు ప్రధాని మోడీని  అవమానించేలా అబద్దాలు మాట్లాడడం సిగ్గు చేటన్నారు.  అనారోగ్య కారణాల వల్లే  విగ్రహావిష్కరణకు రావట్లేదని ప్రకటించింది కేసీఆరే అన్నారు. మోడీని కలవడానికి ముఖం చెల్లకే సమతామూర్తి విగ్రహావిష్కరణకు కేసీఆర్ రాలేదని ప్రజలందరికీ తెలుసన్నారు. అబద్ధాలతో కాలం వెల్లదీస్తూ, ప్రజలను మోసం చేస్తూ కుర్చీ కాపాడుకుంటున్న దౌర్భాగ్య సీఎం కేసీఆర్ అని సంజయ్​ ధ్వజమెత్తారు.  సమతామూర్తి విగ్రహాన్ని రూపొందించి, తానే  ప్రతిష్ఠ చేయిస్తున్నట్లు  కేసీఆర్ ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు.

 ‘భగీరథ’ నీళ్లపై కేసీఆర్ ను నిలదీయండి
 మిషన్​ భగీరథ నీళ్లేవని సీఎం కేసీఆర్​ను నిలదీయాలని బీజేపీ స్టేట్​చీఫ్​ బండి సంజయ్ ​ప్రజలకు పిలుపునిచ్చారు.   పగిడిమర్రి గుడిసెల్లో దుర్భర జీవితం గడుపుతున్న ఓబులాపూర్ నర్సమ్మ,  భీంరావు ఇండ్లను సందర్శించారు. దళిత బస్తీలో ప్రజల బాధలు విన్నారు.  టాయిలెట్స్​కట్టుకుంటే పైసలిస్తామని ప్రభుత్వం చెబితే అప్పుచేసి కట్టామని కానీ ఇంతవరకు బిల్లులే రాలేదని వాపోయారు. మా గ్రామం నుంచే మిషన్ భగీరథ పైప్ లైన్  వెళ్తోందని మాకు తాగు నీళ్లు రావడం లేదని దీంతో ఉప్పు నీళ్లు తాగి బతుకుతున్నామని ప్రజలు బండి  సంజయ్​కు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్​ లీడర్​ సీహెచ్.విఠల్, పాదయాత్ర ప్రముఖ్  మనోహర్ రెడ్డి, మహిళా మోర్చా ప్రెసిడెంట్​ గీతామూర్తి  పాల్గొన్నారు.