ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో వాస్తవం లేదు : నంద కుమార్

ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో వాస్తవం లేదు : నంద కుమార్

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై స్పందించిన నంద కుమార్.... పూజల కోసం మాత్రమే తాము ఫామ్ హౌస్ కు వెళ్ళామని చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేసినట్టు తమకు తెలియదన్న ఆయన.. సింహ యాజీ స్వామీజీతో సామ్రాజ్య లక్ష్మీ పూజ జరిపించడానికి మాత్రమే ఫామౌస్ కు వెళ్ళామన్నారు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలోనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి సమాచారంతో సోదాలు చేశారో తమకు తెలియదని, అసలు ఏం స్కామో తమకు తెలియదన్నారు. న్యాయాన్ని నమ్ముతున్నామన్న నంద కుమార్... న్యాయ స్థానంలో న్యాయం గెలిచిందని చెప్పారు. త్వరలో మీడియాకు అన్ని వివరాలు వెల్లడిస్తానని స్పష్టం చేశారు.

మొయినాబాద్ అజీజ్‌‌నగర్‌‌‌‌లోని పైలెట్ రోహిత్‌‌రెడ్డి ఫామ్‌‌హౌస్‌‌లో ఘటన అనంతరం  ముగ్గురు నిందితుల రిమాండ్‌‌ను ఏసీబీ కోర్టు జడ్జి రిజెక్ట్ చేశారు. నిందితులకు జ్యుడీషియల్ రిమాండ్ విధించేలా పోలీసులు రూల్స్ ఫాలో కాలేదని తెలిపారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ (పీసీ) యాక్ట్ సెక్షన్లు నమోదు చేసేందుకు సరైన ఆధారాలు లేవని అభ్యంతరం వ్యక్తం చేశారు. లంచం ఇవ్వజూపినట్లుగా ఎలాంటి నగదు లభ్యం కాకపోవడంతో పీసీ యాక్ట్ కేసుల కింద పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేశారు. నిందితుల అరెస్ట్ విషయంలోనూ 41 సీఆర్‌‌‌‌పీసీ నిబంధనలు పాటించలేదని జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. 41 సీఆర్‌‌‌‌పీసీ నోటీసులు ఇచ్చి విచారించిన తరువాత తమ ముందు ప్రవేశపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు పార్టీ మారేందుకు రూ.100 కోట్లు ఆఫర్ చేశారని ఎమ్మెల్యే రోహిత్‌‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు.. నిందితులు రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ, నందకుమార్, సింహయాజి స్వామిపై నేరపూరిత కుట్ర 120(బి), ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ (పీసీ) యాక్ట్171-బి, 506 ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు నిందితులను కోర్టు ముందు ప్రవేశపెట్టగా.. రిమాండ్‌‌ను జడ్జి తిరస్కరించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.