భారత్‌ జోడో యాత్ర ఏర్పాట్లలో అపశృతి

భారత్‌ జోడో యాత్ర ఏర్పాట్లలో అపశృతి

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఏర్పాట్లలో అపశృతి చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని పేపరస్‌ పోర్టు రిసార్ట్స్‌ సమీపంలో యాత్ర కోసం ఏర్పాట్లలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 125కేవీ, 62 కేవీ జనరేటర్లు, రెండు డీసీఎం వ్యాన్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని మహేశ్వరం అగ్నిమాపక శాఖ అధికారి రమేష్ తెలిపారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 

కొనసాగుతున్న యాత్ర..
మరోవైపు తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఐదవ రోజు కొనసాగింది. ఉదయం జడ్చర్ల నుంచి ప్రారంభమైన యాత్ర...సాయంత్రం షాద్ నగర్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా సోలీపూర్ చౌరస్తా నిర్వహించిన బహిరంగసభలో బీజేపీ, ఆర్ఎస్ఎస్పై  రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు  ప్రజల మధ్య హింస, విద్వేషాలను రేకెత్తిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో నిరుద్యోగం ఎక్కువగా ఉందని రాహుల్ గాంధీ అన్నారు. చదివిన చదువులకు తగిన ఉద్యోగాలు దొరకడం లేదన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు కారణంగా చిరువ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేనేత రంగంపై విధించిన పన్నును సంబంధించిన పరిహారాన్ని తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ పెట్టి నిరుపేదల భూములను లాక్కున్నారని విమర్శించారు.