అన్నా చెల్లె మధ్య పెరిగిన దూరం.. రాఖీ పండుగ సాక్షిగా బయపడ్డ విభేదాలు.. !

అన్నా చెల్లె మధ్య పెరిగిన దూరం.. రాఖీ పండుగ సాక్షిగా బయపడ్డ విభేదాలు.. !

హైదరాబాద్​, వెలుగు: అన్నా చెల్లెళ్లు కేటీఆర్, కవిత మధ్య దూరం రోజురోజుకూ మరింత పెరిగిపోతున్నది. వీరి మధ్య విభేదాలు రాఖీ పండుగ సాక్షిగా బయపడ్డాయి. ప్రతి సంవత్సరం కవితతో రాఖీ కట్టించుకునే కేటీఆర్.. ఈసారి మాత్రం  పండుగ రోజు ఔటాఫ్​స్టేషన్​వెళ్లిపోయారు. కేసీఆర్​చుట్టూ దెయ్యాలున్నాయన్న కవిత వ్యాఖ్యలతోనే మొదలైన పొలిటికల్​వార్.. చినికిచినికి గాలివానలా మారి, ఇటీవల మరింత పెరిగిందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వాస్తవానికి ‘అన్నా.. రాఖీ కడతాను.. అందుబాటులో ఉండు’ అంటూ కవిత శుక్రవారం ఉదయమే  కేటీఆర్‌‌కు మెసేజ్​ పెట్టినట్టు తెలిసింది. 

కానీ, కేటీఆర్​వెంటనే రిప్లై ఇవ్వలేదని తెలుస్తున్నది. కవిత మెసేజ్​పెట్టిన తర్వాత నందినగర్‌‌లోని తన నివాసంలో  కేటీఆర్‌‌కు లగచర్ల ఆడబిడ్డలు రాఖీ కట్టారు. వారితో ఆయన మాట్లాడారు. అనంతరం కేటీఆర్​దొరికిన ఫ్లైట్​పట్టుకొని బెంగళూరు వెళ్లారని తెలిసింది. బెంగళూరు చేరుకున్నాక.. తాను హైదరాబాద్‌లో లేనని, ఔటాఫ్​స్టేషన్​అని కవితకు కేటీఆర్​రిప్లై ఇచ్చారని సమాచారం. 

కవిత మనస్తాపం 

కేటీఆర్​తీరుతో కవిత తీవ్ర మనస్తాపం చెందినట్టు తెలిసింది. తాను ఎప్పుడో పొద్దున మెసేజ్​పెడితే.. కావాలనే ఆలస్యంగా రిప్లై ఇచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. రాఖీ పండుగ రోజు ఉండకుండా వెళ్లేంత అర్జంట్​పనులు ఏముంటాయని సన్నిహితులు, కుటుంబ సభ్యుల వద్ద ఆమె వాపోయినట్టు సమాచారం. తాను ఒక మెట్టు దిగి రాఖీ కడతానన్నా ఇలాంటి పంతాలకు పోవాల్నా అని ఆవేదన చెందినట్టు తెలిసింది.  ఇటు తన తండ్రి వద్దకూ వెళ్లకపోవడంతో.. కవితకు పుట్టింటితో కూడా గ్యాప్​పెరిగిందా అన్న చర్చ జోరుగానే సాగుతున్నది. 

కాగా, ఇటు పార్టీ నుంచి.. అటు కుటుంబం నుంచి ప్రాధాన్యం తగ్గిపోవడంతో కవిత సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇటు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్​)లోనూ ఆమె ప్రభావాన్ని తగ్గించేందుకు ఇప్పటికే ఇన్​చార్జిని కేటీఆర్​మార్చేశారు. ఎప్పటినుంచో టీబీజీకేఎస్​గౌరవాధ్యక్షురాలిగా కవిత కొనసాగుతున్నా.. ఇటీవల కొప్పుల ఈశ్వర్‌‌ను కేటీఆర్​ నియమించారు. ఈ క్రమంలో సింగరేణి ప్రాంతంలో సొంతంగా విస్తరించేందుకు కవిత అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా హెచ్ఎంఎస్​ (హిందుస్తాన్​ మజ్దూర్​ సంఘ్​)తో జట్టుకట్టబోతున్నట్టు తెలుస్తున్నది. ఆదివారం సింగరేణి కార్మికుల మరో సంఘమైన హెచ్ఎంఎస్​ కార్యదర్శి రియాజ్​అహ్మద్‌తో కవిత భేటీ కానున్నట్టు తెలిసింది.