గ్రేటర్ హైదరాబాద్ శివారులో రియల్ జోరు..  ఇండ్లకు భారీగా పెరిగిన డిమాండ్

గ్రేటర్ హైదరాబాద్ శివారులో రియల్ జోరు..  ఇండ్లకు భారీగా పెరిగిన డిమాండ్

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పుంజుకుంది. కొంతకాలంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో  ఇళ్ల అమ్మకాలు జోరందుకుంటున్నాయి. భూములు కొనేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇక అక్టోబర్ నెలలో జరిగిన రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లకు (నివాస గృహాల రిజిస్ట్రేషన్లు) సంబంధించి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా ఒక రిపోర్ట్ విడుదల చేసింది. హైదరాబాద్‌లో ఒక్క నెలలోనే 5 వేల 787 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు చెప్పింది. ఇక ఇది కిందటేడాది ఇదే సమయంతో పోలిస్తే ఏకంగా 25 శాతం పెరిగినట్లు వివరించింది.

అక్టోబర్ 2023లో రూ. 3 వేల 170 కోట్ల విలువ చేసే 5 వేల 787 రెసిడెన్షియల్ ప్రాపర్టీ యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి.  నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక ప్రకారం...  ప్రతి ఏడాది రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అంతకంతకు పెరుగుతోంది. ఈసారి  25 శాతం పెరుగుదల కనిపిస్తోంది. హైదరాబాద్‌ రెసిడెన్షియల్ మార్కెట్‌లో హైదరాబాద్, మేడ్చల్- మల్కాజిగిరి, రంగారెడ్డి,  సంగారెడ్డి  జిల్లాలు అగ్రస్థానంలో ఉన్నాయి.

మొత్తం ప్రాపర్టీల విలువ రూ.3 వేల170 కోట్లుగా ఉండటం విశేషం. ఇది కూడా గతేడాదితో పోలిస్తే 41 శాతం పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఎక్కువ విలువ ఉన్న ఇళ్లు ఎక్కువగా అమ్ముడుబోయాయి. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ అంటే.. హైదరాబాద్, మేడ్చల్- మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి దీని పరిధిలోకే వస్తాయి.

ఎక్కువగా అక్టోబర్ నెలలో చూసుకుంటే మొత్తం ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లలో రూ. 25-50 లక్షల మధ్య ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్లే ఎక్కువగా జరిగాయి.  మొత్తం రిజిస్ట్రేషన్లలో దీని వాటానే 50 శాతంగా ఉంది. ఇక రూ. 25 లక్షల లోపు విలువ ఉన్న ప్రాపర్టీల వాటా 16 శాతంగా ఉండగా.. ఇది 2022 అక్టోబర్‌లో 22 శాతంగా ఉంది. ఇక రూ. కోటికిపైగా విలువ ఉన్న ప్రాపర్టీల అమ్మకాలు మొత్తం రిజిస్ట్రేషన్లలో 10 శాతంగానే ఉన్నాయి.

హైదరాబాద్ హౌసింగ్ మార్కెట్‌కు ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ ఉందని అన్నారు నైట్‌ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శిషిర్ బైజాల్. ఆర్‌బీఐ రెపో రేట్లను యథాతథంగా ఉంచడం, పెంచకుండా ఉపశమనం కల్పించడం కారణంగా ఇళ్ల కొనుగోలుదారులు ఇప్పుడు పండగ వేళ మరింత ఉత్సాహం చూపించినట్లు చెప్పారు. ఎక్కువగా 1000 నుంచి 2000 చదరపు అడుగుల మేర విస్తీర్ణం ఉన్న ప్రాపర్టీలపైనే బయ్యర్లు ఆసక్తి చూపించారని.. వీటి వాటానే 69 శాతంగా ఉందని అన్నారు. జిల్లాల వారీగా చూస్తే.. మేడ్చల్- మల్కాజ్‌గిరి 43 శాతం హోమ్ సేల్స్ రిజిస్ట్రేషన్లతో టాప్‌లో ఉంది. రంగారెడ్డి 42 శాతం, హైదరాబాద్ 14 శాతం రిజిస్ట్రేషన్లతో వరుసగా ఉన్నాయి.