మీ స్ట్రెస్ దూరమవ్వాలంటే ఈ టిప్స్​ ఫాలో కావాల్సిందే

మీ స్ట్రెస్ దూరమవ్వాలంటే ఈ టిప్స్​ ఫాలో కావాల్సిందే

హాయిగా, ఆరోగ్యంగా బతకాలని చాలామంది కోరుకుంటారు. కానీ ఆచరణలోకి రాగానే వెనకడుగు వేస్తుంటారు. తెలియకుండానే ఒత్తిడి బారిన పడుతుంటారు. సరైన ప్లానింగ్​, టైమ్​ మేనేజ్​మెంట్​ ఉంటే స్ట్రెస్ ​కు గుడ్​బై చెప్పేయొచ్చు. స్ట్రెస్ ​కు దూరంగా ఉండాలంటే ఈ టిప్స్​ ఫాలో కావాల్సిందే.

రెండింటి బ్యాలెన్స్​

కార్పొరేట్​ జాబ్ అయితే టార్గెట్స్​ ఉంటాయి. కచ్చితమైన డెడ్‌‌‌‌‌‌‌‌‌‌లైన్లూ చేరుకోవాలి. పని పూర్తికాకపోతే, ఆ పనిని ఇంటికీ మోసుకెళ్తుంటారు చాలామంది. ఇది ప్రతిసారీ మంచిది కాదు. ఇంట్లో కూడా పనిచేస్తే పర్సనల్​ లైఫ్​పై ప్రభావం పడుతుంది. అందుకని వర్క్​ను వీలైనంతవరకు ఆఫీస్​లోనే చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంటి పనులు, ఆఫీస్​ వర్క్​ను బ్యాలెన్స్​ చేసుకోవడం మాటల్లో చెప్పినంత ఈజీ కాదు. అలాగని కష్టమేమీ కాదు. ఆలోచిస్తే అనేక మార్గాలు ఉంటాయి.

టేక్​ ఎ బ్రేక్​

రెస్ట్​ లేకుండా పనిచేయడం కన్నా, ప్రతి గంటకోసారి రిలాక్స్​ అవ్వాలి. మనసుకు హాయినిచ్చే పనులు చేయాలి. పిల్లలతో గడపడం, లైఫ్​ పార్ట్​నర్​కు మెసేజ్​ పెట్టడం, ఫ్రెండ్స్​తో మాట్లాడటం చేస్తుండాలి. స్పీడ్​ జీవితంలో రకరకాల సమస్యలు ఎదురవుతాయి. అలాంటి వాటిని ఎలా పరిష్కరించుకోవాలి? అని ఆలోచించాలి. వాటినే తలచుకుని బాధపడకూడదు. ఎన్నో ఆలోచనలతో సతమతమయ్యే మనసుకు విశ్రాంతినివ్వాలి. రోజు ఎలా గడిచినా.. కుంగిపోకుండా ఉండాలి. ఇంట్లోవాళ్లు సహకరించకపోయినా, కొలీగ్స్​తో ఇబ్బందులు ఎదురైనా చిరాకు పడకుండా ఉండాలి.

పాజిటివ్​గా…

ఎవరైనా నచ్చినట్లు ఉండకపోయినా, సిచ్యుయేషన్స్​ పాజిటివ్​గా లేకపోయినా ‘నేను ఎలాంటి టెన్షన్​ పెట్టుకోను’ అని డిసైడ్​ అవ్వాలి. పాజిటివ్​ థింకింగ్​తో ప్రతిరోజును మొదలుపెట్టాలి. నిద్రలేచిన తర్వాత ఆ రోజు ఏం చేయాలి? అని ఓ పది నిమిషాలు ఆలోచించుకుంటే హడావుడి ఉండదు. అవసరంలేని పనుల్ని వీకెండ్స్​లో కంప్లీట్​ చేసుకోవచ్చు. ఆఫీస్​ వర్క్​ను ముందురోజే ఆలోచించుకుని ప్లాన్​ చేసుకోవాలి. ఇంటి పనుల విషయంలోనూ అంతే.

వర్క్​ డివైడ్​

‘ప్రతి పనినీ నేను మాత్రమే బాగా చేయగలను’ అనే ఆలోచనను దూరం చేయాలి. చిన్న చిన్న పనులు ఏవైనా ఉంటే ఫ్యామిలీ మెంబర్స్​కు అప్పగించాలి. అదేవిధంగా వర్క్​ విషయంలో ఏవైనా ఉంటే కొలిగ్స్​ సాయం తీసుకోవాలి. ఒత్తిడిలో కూరుకుపోకుండా అనేక దారులు వెతకాలి. ఎవరికైనా రోజులో ఇరవై నాలుగు గంటలే ఉంటాయి. ఆ టైం సద్వినియోగం చేసుకోవాలి. కెరీర్‌‌‌‌లో పట్టుబిగిస్తున్నకొద్దీ టైం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వర్క్​ డివిజన్​ కంపల్సరీ.

ఇలా చేద్దాం

మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో ఒత్తిడి తప్పదు. చెడు అలవాట్లు కూడా ఒత్తిడిని పెంచుతాయి. ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ముందుగా ఒత్తిడికి కారణం అయ్యే చెడు అలవాట్లను గుర్తించాలి.

కొందరికి నిద్రలేవడంతోనే ఒత్తిడి మొదలవుతుంది. ప్రతిరోజూ నిద్రలేవడం ఆలస్యమైతే, తరువాత అంతా ఆలస్యమే. దాంతో ఆఫీస్​కు లేటుగా వెళ్లడం, బ్రేక్ ఫాస్ట్ చెయ్యకపోవడం లాంటివి ఒత్తిడిని పెంచుతాయి. కాబట్టి త్వరగా నిద్రపోయి, త్వరగా నిద్రలేవాలి.

ఎక్సర్​సైజ్​ అనేది ప్రతిఒక్కరికి అవసరం. జీవితంలో ఆరోగ్యంగా ఉండటానికి ఇదొక మంచి అలవాటు. రన్నింగ్, జాగింగ్, వ్యాయామం, బ్రీతింగ్ ఎక్సర్​సైజ్​ వంటివి ఒత్తిడిని తగ్గిస్తాయి. రోజులో కనీసం ఏడు లేదా ఎనిమిది గంటల నిద్ర అవసరం. కానీ చాలా మంది తక్కువ గంటలు నిద్రపోతూ ఒత్తిడిని పెంచుకుంటున్నారు. కాబట్టి మంచి అలవాట్లు కూడా ఒత్తిడిని దూరం చేస్తాయి.

చాలామంది టీవీ ముందు గంటలకొద్దీ కూర్చుంటారు. టీవీ చూడటమే రెస్ట్​ తీసుకోవడం అనుకుంటారు. ఆ టైంలో తీసుకొనే అనవసర శ్నాక్స్​ ఒత్తిడిని పెంచుతాయి. ఈ అలవాటు ఉంటే వెంటనే టాటా చెప్పి, టెర్రస్​పైన నాలుగైదు రౌండ్స్ నడవాలి. స్మోకింగ్​ అలవాటుకు దూరంగా ఉండాలి. లేదంటే స్ట్రెస్ లెవెల్స్​ పెరుగుతాయి.

ప్రతిఒక్కరూ బిజీ జీవితాన్ని గడుపుతున్నారు. సరైన టైంలో ఫుడ్​ తీసుకోకపోవడం కూడా ఒత్తిడి పెంచుతుంది. ప్రాసెస్డ్​ ఫుడ్​ తింటే బరువు పెరుగుతారు. చాలామంది నచ్చిన శ్నాక్స్​ తినడం వల్ల కొంత రిలీఫ్ వస్తుందని అనుకుంటారు. అది ఎంత మాత్రం నిజం కాదు. అదోరకమైన ఒత్తిడికి కారణం అవుతుంది.