ఈ పెయింటింగ్స్ చాలా విలువైనవి

ఈ పెయింటింగ్స్ చాలా విలువైనవి

మార్చి 18, 1990 అర్ధరాత్రి దాటింది. సరిగ్గా 1:24 గంటలకు ఇసబెల్లా స్టీవర్ట్ గార్డెనర్ ‌‌ మ్యూజియంలోకి ఇద్దరు పోలీసు ఆఫీసర్లు వచ్చారు. 81 నిమిషాల తర్వాత వాళ్లు వెళ్లిపోయారు. వెళ్తూ.. వెళ్తూ.. అప్పట్లోనే 200 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన 13 పెయింటింగ్స్ ‌‌ని తీసుకెళ్లారు. అప్పుడు తెలిసింది.. వచ్చింది పోలీసులు కాదు. దొంగలు అని. అయితే.. వాటిని ఎందుకు దొంగిలించారు? ఏం చేశారు? 

మసాచుసెట్స్ ‌‌లోని బోస్టన్ మ్యూజియంలో జరిగిన దొంగతనాన్ని ఆధునిక చరిత్రలో అతి పెద్ద ఆర్ట్ థెఫ్ట్ ‌‌గా చెప్తుంటారు. ఎందుకంటే.. ఇక్కడినుంచి దొంగిలించిన పెయింటింగ్స్ చాలా విలువైనవి. ఇప్పుడు వాటి విలువ 500 మిలియన్ అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువగానే ఉంటుంది. అయితే.. ఈ దొంగతనం జరగడానికి ముఖ్య కారణం.. సెక్యూరిటీ సిస్టమ్ సరిగా లేకపోవడమే. ఎందుకంటే.. ఆ రోజు మ్యూజియం దగ్గర గార్డ్స్ చాలా తక్కువమంది ఉన్నారు. అంతెందుకు అసలు దొంగతనం జరిగిందనే విషయం, జరిగిన ఏడు గంటల తర్వాత తెలిసింది. పోలీసు డ్రెస్సుల్లో వచ్చిన ఇద్దరు దొంగలు నేరుగా లోపలికి వెళ్లారు. వాళ్లను గార్డ్స్ ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. వాళ్లు నిజంగానే పోలీసులు అనుకున్నారు. 

గార్డ్ ‌‌లను కట్టి పడేసి..

మ్యూజియం లోపలికి వెళ్లేటప్పుడు పోలీసు ఆఫీసర్ల అవతారాల్లో బాగానే వెళ్లారు. కానీ.. వచ్చేటప్పుడు చేతుల్లో ఆర్ట్స్ ఉండడంతో గార్డ్స్ కి అనుమానం వచ్చి అడ్డుకున్నారు. దాంతో గార్డ్స్ కాళ్లు, చేతులు, నోటికి టేప్ వేసి మ్యూజియం బేస్ ‌‌మెంట్ ‌‌లోకి నెట్టేశారు. ఉదయం 8 గంటలకు వాళ్లను రిలీవ్ చేయడానికి తర్వాత షిఫ్ట్ గార్డ్స్ వచ్చి చూస్తే పాతవాళ్లు కనిపించలేదు. వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు కేస్ ఫైల్ చేసి, సెర్చ్ చేస్తే గార్డులు దొరికారు. అప్పుడే రెంబ్రాండ్ట్ వాన్ రిజ్న్, జోహన్నెస్ వెర్మీర్ వేసిన కొన్ని కాస్ట్ ‌‌లీ పెయింటింగ్స్ ‌‌తోపాటు మొత్తంగా 13 ఆర్ట్స్ దొంగిలించారని తెలిసింది. వాటిలో ఒక్కటికూడా ఇప్పటివరకు దొరకలేదు. 

ఎఫ్ ‌‌బీఐ 

ఈ కేసుపై చాలా రోజుల పాటు ఎంక్వైరీ జరిగింది. కానీ.. పోలీసులు ఒక్క క్లూ కూడా పట్టుకోలేకపోయారు. గార్డ్స్ చెప్పిన వివరాలతో దొంగల ఊహా చిత్రాలు వేయించారు. వాటివల్ల కూడా ఉపయోగం లేకుండా పోయింది. వాళ్లను చూసినట్టు ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఎఫ్ ‌‌బీఐ రంగంలోకి దిగింది. దొంగల్ని పట్టిస్తే.. 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. అయినా. . లాభం లేకపోయింది. అవి ఎక్కడ ఉన్నాయి? ఎవరి దగ్గర ఉన్నాయి? ఎందుకు దొంగిలించారు? అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు దొరకలేదు. 

ఎన్నో అనుమానాలు

అసలు ఈ దొంగతనం ఎందుకు చేశారనేదే ఈ కేసులో పెద్ద ప్రశ్న. ఎందుకంటే.. దొంగిలించిన పెయింటింగ్స్ చాలా విలువైనవి. పాపులర్ ‌‌ కూడా. కాబట్టి వాటిని చాలామందిని గుర్తుపడతారు. అందువల్ల వాటిని దొంగిలించిన వాళ్లు ఎక్కడా తగిలించలేరు. పైగా ఎవరికీ అమ్ముకోలేరు. అలా అమ్మినా వెంటనే దొరికిపోతారు. అలాంటప్పుడు వాటిని ఎందుకు దొంగిలించారు? అనేది తెలుసుకోవడం పోలీసులకు పెద్ద టాస్క్ అయ్యింది. మరో విషయం ఏంటంటే.. పోలీసుల్లా వచ్చిన దొంగలు లోపలికి వచ్చిన వెంటనే అలారంని ఆఫ్ చేశారు. సెక్యూరిటీ అలారం ఎక్కడుంది? ఎలా ఆఫ్ చేయాలి? అనేది వాళ్లకు ఎలా తెలిసిందో తెలుసుకోవడానికి పోలీసులు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ.. తెలుసుకోలేకపోయారు. ఆ మ్యూజియంలో ఉన్న పరిస్థితులను బట్టి ఈ దొంగతనానికి 10 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు. కానీ.. వీళ్లు 81 నిమిషాలు తీసుకున్నారు. అంతసేపు వాళ్లు లోపల ఏం చేశారు? అనేది కూడా తెలియలేదు. 

పెద్ద ముఠా ఉందా? 

ఈ దొంగతనం వెనక చాలా పెద్ద మాఫియా ముఠా ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. ముఖ్యంగా బోస్టన్ ‌‌లోని ఇటాలియన్ గ్యాంగ్ ఈ దొంగతనం వెనుక ఉన్నట్లు పోలీసులు కూడా అనుమానించారు. కానీ.. సరైన ఆధారాలు సంపాదించలేకపోయారు. రీస్ ‌‌ఫెల్డర్, డిముజియో అనే ఇద్దరు దొంగలు అదే టైంలో చనిపోయారు. అయితే.. వాళ్లే ఈ దొంగతనం చేశారని, దొంగతనం చేసిన తర్వాత వాళ్లకు సుపారీ ఇచ్చిన వ్యక్తి వాళ్లను చంపించాడని ప్రచారం జరిగింది. 

ఇప్పటికీ అలాగే.. 

మ్యూజియం గ్యాలరీల్లో నుంచి దేనినీ తీయకూడదని, కొత్తవి చేర్చకూడదని మ్యూజియం ఫౌండర్ ‌‌ తన వీలునామాలో రాశాడు. అందువల్ల దొంగిలించిన పెయింటింగ్స్ ప్లేస్ ‌‌లో ఇప్పటివరకు కొత్తవి పెట్టలేదు. వీలునామా ప్రకారం.. కొత్త వస్తువులు కొనకూడదు, అమ్మకూడదు కాబట్టి ఆ ఫ్రేమ్ ‌‌లు ఇప్పటికీ ఖాళీగా వేలాడుతూనే ఉన్నాయి.