ఈ బొమ్మలు భయపెడతాయ్‌‌!

ఈ బొమ్మలు భయపెడతాయ్‌‌!

అనబెల్‌‌, రాబర్ట్‌‌ లాంటి బొమ్మలు ఇప్పటికే చాలామందిని భయపెట్టాయి. వాటి కథలు వరల్డ్‌‌ వైడ్‌‌గా పాపులర్‌‌‌‌ అయ్యాయి. వాటి గురించి తెలిసి భయపడేవాళ్లు ఇప్పటికీ ఉన్నారు. అయితే.. అలాంటి హాంటింగ్‌‌ డాల్స్‌‌ సింగపూర్‌‌‌‌లో కూడా ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు బొమ్మల్ని గుర్తించారు. వాటన్నింటికీ పారానార్మల్‌‌ యాక్టివిటీస్‌‌కి ఏదో లింక్‌‌ ఉందని అక్కడి వాళ్లు అనుకుంటున్నారు. ఆ బొమ్మల వెనుక మిస్టీరియస్‌‌ కథలూ ఉన్నాయట! 

ఆడుకునే బొమ్మలు కాస్త హారిబుల్‌గా ఉంటేనే చూడాలనిపించదు. అలాంటిది ఒక బొమ్మకు పారానార్మల్‌‌ పవర్స్ ఉన్నాయని తెలిస్తే ఇంకేమైనా ఉందా? దాని దగ్గరకు వెళ్లాలంటేనే భయపడతారు. ఆ బొమ్మల్లో చనిపోయిన వ్యక్తి ఆత్మ ఉందనో, బ్లాక్‌‌ మ్యాజిక్‌‌ వల్ల ఆ బొమ్మలకు పవర్ వచ్చిందనో నమ్ముతుంటారు. అయితే.. ఇలాంటి బొమ్మలు ఇప్పటివరకు సింగపూర్‌‌‌‌లో ఐదు గుర్తించారు. కానీ..వాటి వెనకున్న మిస్టరీ మాత్రం ఇప్పటికీ ఎవరూ కనిపెట్టలేకపోయారు.  చనిపోయిన వాళ్ల ఆత్మలు వాటిలో ఉన్నాయని బతికున్న వాళ్లను వాటితో తీసుకెళ్లాలనే వచ్చాయని నమ్ముతున్నారు. 

బ్లైండ్‌‌ ఫోల్డెడ్‌‌ డాల్‌‌! 
సింగపూర్‌‌‌‌లోని హౌగాంగ్‌‌ సిటీ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. 2014 జూన్‌‌లో ఆ సిటీలోని ఒక రోడ్డు పక్కన చెట్టుకు ఆనుకుని ఒక బొమ్మ కనిపించింది. దానికి తెల్లని డ్రెస్‌‌ వేశారు. కళ్లకు తెల్లటి బట్ట కట్టారు. అందులో భయపడడానికి ఏముందంటారా? కథ వింటే మాత్రం భయపడడం ఖాయం. దాని కళ్లకు కట్టిన బట్ట మీద అరబిక్ భాషలో  ‘‘బిస్మిల్లా”అని నల్ల రంగు అక్షరాలతో రాసి ఉంది. ఎవరో దాన్ని ఫొటో తీసి సోషల్‌‌ మీడియాలో పోస్ట్ చేశారు. చాలామంది ఆ పోస్ట్‌‌కి రియాక్ట్ అయ్యారు. అది వరల్డ్‌‌ వైడ్‌‌గా వైరల్‌‌ అయింది కూడా. వాస్తవానికి ఆ బొమ్మ కళ్లకు ఎందుకు గంతలు కట్టారో తెలిసి  అందరూ భయపడ్డారు. ఆ బొమ్మ యజమాని లేనప్పుడు ఇక ఇంటి పరిసరాల్లోకి వెళ్లి. ఎప్పుడూ ఆ ఇంటి చుట్టూనే కనిపించేది. అది చూసి భయపడిన యజమాని దాన్ని చాలా దూరం తీసుకెళ్లి పడేశాడు. అయినా అది మళ్లీ ఆ ఇంటికే వచ్చింది. దాంతో ఈ సారి తిరిగి రాకూడదని బొమ్మ కళ్లకు గంతలు కట్టి దూరంగా వదిలేశాడు. ఆ టైంలో అది ‘మలయ్’ భాషలో ఆడ గొంతుతో పెద్దగా అరిచిందట. గంతలు విప్పుకునేందుకు తల అటు ఇటూ తిప్పుతూ ట్రై చేసిందట. దాని కళ్ల గంతలు ఎవరు విప్పితే అది వాళ్లను వెంటాడుతుందట. అయితే.. ఒకసారి ఒకతను వెనకాల నుంచి దానికి కనిపించకుండా గంతలు విప్పాడు. అదే రోజు ఆ వ్యక్తి ఉరేసుకుని చనిపోయాడు. ఆ బొమ్మకు నిజంగానే పారానార్మల్‌‌ పవర్స్ ఉన్నాయా? లేక ఇవన్నీ ఎవరైనా కల్పించి చెప్పిన కథలా? అనేది ఇప్పటికీ తెలియదు. 

పులాలు ఉబిన్‌‌ బార్బీ
కొన్ని కథల ప్రకారం.. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం అప్పుడు బ్రిటిష్ వాళ్లు ఒక జర్మన్ జంటను గూఢచారులనే అనుమానంతో సింగపూర్‌‌లో పట్టుకున్నారు. ఆ టైంలో వాళ్లతోపాటు ఉన్న వాళ్ల చిన్న కూతురు అక్కడినుంచి తప్పించుకుంది. ఆ తర్వాత పులావ్ ఉబిన్‌‌ ప్రాంతంలోని ఒక కొండపై నుంచి పడి చనిపోయింది. ఆమె జ్ఞాపకార్థం ఒక మందిరాన్ని కట్టించారు అక్కడివాళ్లు. ఆ తర్వాత ఆ అమ్మాయి గురించి పెద్దగా పట్టించుకోవడం మానేశారు. చాలా ఏండ్ల తర్వాత 2007లో ఒక తెల్లని అందమైన అమ్మాయి ఒక వ్యక్తి కలలో కనిపించి... తన చేయి పట్టుకుని బొమ్మల దుకాణంలోకి తీసుకెళ్లి ఒక బార్బీ బొమ్మను చూపించింది. ఇదే కల మూడు రాత్రులు వచ్చింది. దాంతో అతడు కలలో చూసిన అడ్రస్‌‌కి వెళ్లాడు. నిజంగానే అక్కడ అతను కలలో చూసిన బార్బీ బొమ్మ ఉంది. అతను దాన్ని కొనుక్కొచ్చి మందిరంలో పెట్టాడు. అప్పటినుంచి అది ఒక టూరిస్ట్ ప్లేస్‌‌లా మారింది. ఆ బొమ్మను చూడ్డానికి చాలామంది వెళ్తున్నారు. వచ్చేవాళ్లు ఆ పాప కోసం ఫర్‌‌‌‌ఫ్యూమ్స్‌‌, లిప్‌‌స్టిక్స్‌‌ లాంటివి తీసుకొస్తుంటారు. 

స్మోకింగ్ దెయ్యం బొమ్మ
మనుషులను వెంటాడి చంపే దెయ్యాలుంటాయి అని వినే ఉంటారు. కానీ.. స్మోక్ చేసే దెయ్యం గురించి ఎవరైనా విన్నారా?  2014లో జురాంగ్ వెస్ట్‌‌ ప్రాంతంలో లోకల్‌‌వాళ్లు ఒక దెయ్యపు బొమ్మను చూశారట. అది అప్పుడు సిగరెట్‌‌ తాగుతూ కనిపించింది. వాళ్లు చూసినట్టు రుజువు చేయడానికి పెద్దగా ఆధారాల్లేవు. కానీ.. అప్పట్లో ఒక ఫొటో మాత్రం బాగా వైరల్ అయింది. ఫొటోలోని బొమ్మకు రెండు కొమ్ములు ఉన్నాయి. నల్ల రంగులో ఉంది. పెద్ద వెంట్రుకలున్నాయి.  విచిత్రమైన పోజులో కూర్చుని ఉంది. దీన్ని ఒకేసారి చూసినట్టు లోకల్‌‌ వాళ్లు చెప్పారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ కనిపించలేదట. 

ధోబీ ఘాట్ బొమ్మ
ధోబీ ఘాట్ స్టేషన్‌‌లోని ఎంఆర్‌‌‌‌టీ ట్రాక్‌‌ టన్నెల్‌‌ వాల్‌‌పై నలిగిన బట్టలతో ఉన్న బొమ్మను చూసినట్టు జనవరి 2017లో అశ్లేషు అనే మహిళ చెప్పింది. ఆ బొమ్మకి పెద్ద కళ్ళు ఉన్నాయి. వింతగా నవ్వుతున్నట్టు అనిపిస్తుంది. అంతేకాదు అది దర్జాగా గోడకు చెయ్యి పెట్టి కూర్చుంది. ఏ ఆధారం లేకుండా గోడకు చెయ్యి పెట్టడంతో చాలామంది భయపడ్డారు. దాన్ని అక్కడి నుంచి తీసే ధైర్యం ఎవరూ చేయలేదు. ఆ తర్వాత ఆ బొమ్మను అక్కడ ఎవరు పెట్టారని అధికారులు ఎంక్వైరీ చేశారు. చివరగా ఒక ప్రయాణికుడు స్టేషన్‌‌లో వదిలి పెట్టాడన్నారు. తర్వాత ఒక కార్మికుడు దాన్ని అక్కడ పెట్టినట్టు అధికారులు చెప్పారు. అయినా.. ఆ బొమ్మ చుట్టూ అనబెల్‌‌ లాంటి కథలు వినిపిస్తూనే ఉన్నాయి. 

హవ్ పర్ విల్లా విగ్రహాలు
ఈ విగ్రహాలు రక్తంతో కనిపిస్తున్నప్పటికీ భయపెట్టేలా లేవు. కానీ.. వాటి వెనుక దాగిన పారానార్మల్‌‌ యాక్టివిటీస్‌‌ గురించి తెలిస్తే మాత్రం భయం వేయక మానదు. ‘హవ్ పర్ విల్లా’ అంటే ‘నరక ద్వారం’ అని అర్థం. వీటిని సింగపూర్‌‌‌‌లో ఏర్పాటు చేశారు. అయితే.. లోకల్‌‌ వాళ్లు, వీటి దగ్గర ఉండే సెక్యూరిటీ గార్డ్స్‌‌ చాలా హాంటింగ్ కథలు చెబుతున్నారు. సెక్యూరిటీ గార్డులు పారానార్మల్ యాక్టివిటీస్‌‌ కళ్ళారా చూశామంటున్నారు. ఆ విగ్రహాలు ఎవరూ లేనప్పుడు పెద్దగా అరుస్తున్నాయని కొందరు చెబుతున్నారు. ఆ విగ్రహాల్లో ఆత్మలు ఉన్నాయని వాటి అరుపులే అవి అని చాలామంది భయపడుతున్నారు.