దళిత బంధు ఇచ్చి రూ. 2 లక్షలు వసూలు చేస్తున్నరు

దళిత బంధు ఇచ్చి రూ. 2 లక్షలు వసూలు చేస్తున్నరు

దళిత బంధు కాదు.. అది టీఆర్ఎస్ బంధు.. రూ. 10 లక్షలు ఇచ్చి ఇచ్చి రూ. 2 లక్షలు లబ్దిదారుల నుంచి వసూలు చేస్తున్నారని మాజీ ఎంపీ మల్లు రవి ఆరోపించారు. దళిత బంధు ద్వారా దళితులు బాగుపడాలి.. కానీ దీని ద్వారా టీఆర్ఎస్ బాగుపడుతోందన్నారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల బంధువులకే దళిత బంధు వస్తోందని.. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదన్నారు. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ కు ఓట్లు వేస్తేనే దళిత బంధు ఇస్తామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి బహిరంగంగా చెబుతున్నాడని గుర్తు చేశారు. భారతదేశంలో అన్ని కులాల, మతాల వారు కలిసి మెలసి ఉంటున్నారు అంటే కారణం కాంగ్రెస్ పార్టీనే అన్నారు. 

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి క్షమాపణలు చెప్పాలి...
ఇదే ప్రెస్ మీట్ లో ఎస్పీ సెల్ అధ్యక్షులు ప్రీతం మాట్లాడారు. టీఆర్ఎస్ కు ఓట్లు వేసే వాళ్ళకే దళిత బంధు ఇస్తామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వ్యాఖ్యానిస్తున్నారని... ఆయనకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. దళితులను కించ పరిచే మాటలు మాట్లాడిన ముత్తిరెడ్డి మీద చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆయన కోరారు. ఈ విషయంలో ఎమ్మెల్యే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ లో దళితుల భూమి కబ్జా చేశారని ఈటలను బర్తరఫ్ చేశారని, ముత్తిరెడ్డి భూకబ్జాలు చేశారు..తాను నిరూపిస్తానని స్పష్టం చేశారు. రూ. 10 లక్షలు కాదు ఆత్మ గౌరవం కావాలి.. టీఆర్ఎస్ కరీంనగర్ మున్సిపల్ ఛైర్మన్ వాళ్ల బంధువులకు దళిత బంధు ఇప్పించుకున్నారని విమర్శించారు.