వాళ్లు బిగ్‌బాస్ గత సీజన్‌ ను గుర్తుచేస్తున్నారు

వాళ్లు బిగ్‌బాస్ గత సీజన్‌ ను గుర్తుచేస్తున్నారు

కెప్టెన్సీ పోటీ మొదలైంది. గీతూ మొదట్లోనే వెనుదిరిగింది. ఆ తర్వాత ఫైమా డిస్‌క్వాలిఫై అయ్యింది. ఇక మిగిలింది ముగ్గురు.. శ్రీసత్య, ఆదిరెడ్డి, శ్రీహాన్. మరి ఈ ముగ్గురిలో గెలిచింది ఎవరు? కెప్టెన్‌ అయ్యిందెవరు? 

ముగ్గురిలో మొనగాడు

మొదటి రౌండ్‌లో బ్రిక్స్ గేమ్ పెట్టిన బిగ్‌బాస్.. రెండో రౌండ్‌లో ఇసుకతో గేమ్ ప్లాన్ చేశాడు. మూడు తొట్టెలు పెట్టాడు. డబ్బాలతో ఇసుకను తీసుకెళ్లి ఆ డబ్బాల్ని నింపాలి. ముందుగా ఎవరి తొట్టె నిండితే వాళ్లే కెప్టెన్. ఇది ఆదిరెడ్డికి చాలా బాగా కలిసొచ్చింది. అతని పర్సనాలిటీకి ఆ డిస్టెన్స్ పెద్ద ప్రాబ్లెమ్ కాలేదు. టకాటకా ఇసుక తెచ్చి తొట్టెను నింపేశాడు. అలా అని శ్రీహాన్ కూడా తక్కువేమీ తినలేదు. మెరుపు వేగంతో కదిలి గట్టి పోటీని ఇచ్చాడు. ఇద్దరి మధ్య హోరాహోరీగా జరిగిన పోటీలో కొన్ని సెకన్ల తేడాతో ఆదిరెడ్డి గెలిచాడు. కెప్టెన్సీని పట్టాడు. పాపం ఇద్దరు మగాళ్ల మధ్యలో శ్రీసత్య నిలబడలేకపోయింది. ఫిజికల్ టాస్క్ కావడంతో సున్నితంగా ఉండే ఆ అమ్మాయి త్వరగా అలసిపోయింది. అసలే ఆదిరెడ్డి రైతుబిడ్డ. శ్రీహాన్‌ కూడా హెల్దీ యంగ్‌మేన్. అలాంటప్పుడు కాస్త అమ్మాయిలకి కూడా అనుకూలంగా ఉండే టాస్క్ పెడితే బాగుండేదేమో. ఆట ఆటే, ఆడయినా మగయినా సమానంగా ఆడాల్సిందే అంటారు కాబట్టి అలా ఆలోచించలేదు. అందుకే శ్రీసత్య గెలవలేదు. 

రెడ్డిగారి ఎమోషన్‌

ప్రతి కంటెస్టెంట్‌కీ కెప్టెన్ అవ్వాలని ఉంటుంది. అయ్యాక ఆనందంగానూ ఉంటుంది. అయితే ఆదిరెడ్డి సంతోషం మాత్రం కోటలు దాటింది. ఎమోషన్ పీక్స్ కి వెళ్లింది. కెప్టెన్ అయ్యీ అవ్వగానే తన భార్యను తలచుకుని హ్యాపీ అయిపోయాడు ఆదిరెడ్డి. ‘నన్ను అర్థం చేసుకుని బిగ్‌బాస్‌కి పంపించావ్. ముందు ముందు ఇంకా చాలా ఉంది. లవ్యూ కవితా. నువ్వు హ్యాపీయేనా’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. బిగ్‌బాస్ ఫార్మాట్ బాగా తెలిసిన వ్యక్తి ఆదిరెడ్డి. అందుకే ఆచి తూచి ఆడుతున్నాడు. బ్రెయిన్ వాడుతున్నాడు. ఫిజికల్‌గానూ గట్టి పోటీ ఇస్తున్నాడు. అయితే అతనిలో ఉన్న లోపం ఒక్కటే. అందరినీ జడ్జ్ చేయడం. ఓ రకంగా గీతూతో క్లోజ్‌గా ఉండటం కూడా ఇందుకు దారి తీస్తోంది. తాను పాటించకపోయినా అందరికీ సలహాలిస్తూ తిరుగుతుంది గీతూ. పైగా ప్రతి ఒక్కరి గురించీ ఆదిరెడ్డి దగ్గర కూర్చుని డిస్కషన్ పెడుతుంది. నాగార్జున చెప్పినా ఆమె మారదు, ఆదిని మారనివ్వదు. ఇదొక్కటి కనుక అతను మార్చుకుంటే చివరి వరకు నిలబడే ఆటగాళ్లలో ఆదిరెడ్డి కచ్చితంగా ఉంటాడు. 

వసంతి కవర్ డ్రైవ్

ఎందుకోగానీ వసంతికి తాను డేంజర్‌‌ జోన్‌లో ఉన్నానేమో, ఎలిమినేట్ అవుతానేమో అనే అనుమానం, భయం మొదలయ్యాయి. అది ఆమె మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇనయాతో ఈ విషయం గురించి చాలాసేపు మాట్లాడింది. నువ్వు, నేను, ఆరోహి కూడా కష్టాల్లో పడ్డామంటోంది. ఆ తర్వాత అర్జున్‌ దగ్గరికి మకాం మార్చింది. గీతూకి అందరూ సపోర్ట్ చేయడాన్ని తప్పుబట్టింది. ఆమెను తెగ మెచ్చుకుంటున్నారు కానీ మంచిదా, చెడ్డదా అని ఎవరూ ఆలోచించట్లేదంది. ఫుటేజ్ సంపాదించడానికే ఆమె అందరితోనూ కావాలని గొడవ పడుతోందని చెప్పింది. పడుకునేటప్పుడు కూడా ఇదే గొడవ. చివరి వరకు ఉన్నామా, మధ్యలో వచ్చేశామా అని కాదు.. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్క వారం ఉండి స్టేజ్‌ మీదికి వెళ్లిపోయినా అదృష్టమే అంటోంది. పిచ్చిదానిలా నాలో నేనే మాట్లాడుకుంటే కంటెంట్ ఏమి వస్తుంది, నాకు సపోర్ట్ చేస్తే కంటెంట్ ఇస్తానంటోంది. తనకి ఎవరూ సపోర్ట్ చేయట్లేదని వాపోతోంది. మొత్తానికి వెళ్లిపోతానేమో అనే డౌట్‌తో ఏదేదో మాట్లాడేస్తోంది వసంతి. అంతకంటే ఈ వారమైనా కాస్త ఎఫర్ట్ పెట్టి ఆడివుంటే జనాలు జాలిపడైనా కొన్ని ఎక్స్ట్రా ఓట్లు వేసి ఉండేవారేమో. 

వాళ్లని గుర్తు చేస్తున్నారు

బిగ్‌బాస్ గత సీజన్‌ చూసినవాళ్లెవరైనా ఈసారి బిగ్‌బాస్ కూడా చూస్తుంటే ఒక విషయం కనిపెడతారు. అదేంటంటే.. రాను రాను సూర్య, ఆరోహి.. అప్పటి సిరి, షణ్ముఖ్ మాదిరిగా అనిపిస్తున్నారు. వాళ్లు కూడా మొదట్లో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనేవారు. తర్వాత స్నేహం ముదిరి పాకాన పడింది. ఆట రిస్కులో పడింది. ప్రేక్షకుల విసుగు పీక్స్కి వెళ్లింది. ఇప్పుడు సూర్య, ఆరోహి కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు అనిపిస్తోంది. స్నేహితులమంటూ సాన్నిహిత్యం చూపించారు మొదట. ఉండేకొద్దీ వాళ్ల క్లోజ్‌నెస్ పెరుగుతోంది. కూర్చునే విధానం, మాట్లాడుకునే తీరు, ఆరోహి గారాలు, సూర్య ముద్దు చేయడాలు చూస్తుంటే ఇదేదో తేడా కొట్టేలానే అనిపిస్తోంది. పైగా ఆరోహి ఆట తీరు కూడా అంత మెప్పించడం లేదు. ఓవర్ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తోంది. అన్నిటికీ ముందుకెళ్తుంది. అనవసరమైన గొడవ చేస్తుంది. పర్‌‌ఫార్మెన్స్ మాత్రం వీక్ అనే చెప్పాలి. అందుకే ఈవారం వరస్ట్ పర్‌‌ఫార్మర్స్‌ లిస్టులో ఆమె పేరు చేరింది. అయితే చివరికి అర్జున్ జైలుకు వెళ్లడంలో ఈమె లక్కీగా తప్పించుకుంది. ఆరోహి, కీర్తి, అర్జున్ ఈ ముగ్గురి పేర్లూ చెప్పారు హౌస్‌మేట్స్. కానీ అర్జున్ తనంత తానే జైలుకు వెళ్లడానికి రెడీ అయ్యాడు. దాంతో మిగతా ఇద్దరూ సేవ్ అయ్యారు. అయితే తనని వరస్ట్ పర్‌‌ఫార్మర్ అనడం కీర్తి తట్టుకోలేకపోయింది. నీళ్లకుండ నెత్తిమీదే ఉంటుంది కదా.. భోరుమని ఏడ్చేసింది. 

పాజిటివో నెగిటివో.. కంటెంట్ అయితే ఇవ్వడానికి తెగ కష్టాలు పడుతున్నారు కంటెస్టెంట్లు. అయితే కొందరి ఆటతీరు మరీ బోరింగ్‌గా ఉంటోంది. కొందరి పర్‌‌ఫార్మెన్స్ బెస్ట్ అనిపిస్తోంది. కొందరు విసుగు తెప్పిస్తున్నారు. కొందరు అంతకంతకీ అభిమానాన్ని సంపాదించుకుంటున్నారు. కానీ ఎవరు చివరి వరకు నిలబడతారు అనేది జనాల ఓట్లు తేలుస్తాయి. ఎవరు ఏంటనేది వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున చెప్పే మాటలు ప్రూవ్ చేస్తాయి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో నాగ్ వస్తాడు. మళ్లీ తప్పుల చిట్టా తెరుస్తాడు. మరి ఎవరు బెస్ట్ అంటాడో ఎవరిని వరస్ట్ అంటాడో.. వేచి చూడాల్సిందే.