ఎమ్మెల్యే టికెట్ పై తప్పుడు ప్రచారం చేస్తున్రు : పాల్వాయి స్రవంతి రెడ్డి

 ఎమ్మెల్యే టికెట్ పై తప్పుడు ప్రచారం చేస్తున్రు : పాల్వాయి స్రవంతి రెడ్డి

సీనియర్ నాయకులపై అనవసరమైన వ్యాఖ్యలు చేసి మనోభావాలు దెబ్బ తీయొద్దని మునుగోడు కాంగ్రెస్ ఇంచార్జి పాల్వాయి స్రవంతి రెడ్డి పిలుపునిచ్చారు. ఏదైనా ఉంటే అధిష్టానం దృష్టి కి తీసుకెళ్లాలన్న ఆమె. కాంగ్రెస్ పార్టీలో కోవర్టుల రాజకీయం నడుస్తోందని చలమల కృష్ణారెడ్డి మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం రెండు, మూడు దశబ్దాలుగా పని చేస్తున్నామని పాల్వాయి స్రవంతి చెప్పారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు అధిష్టానం ప్రమేయం లేకుండా ఎమ్మెల్యే టికెట్ తనకేనని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దీని వల్ల కొంత మంది కాంగ్రెస్ కార్యకర్తలు  ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలిపారు. కార్యకర్తలు ఆ ఇబ్బందులను తన దృష్టికి  తీసుకొచ్చారని, ఈ విషయం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళామని ఆమె చెప్పారు.

 మునుగోడు ఉప ఎన్నికల్లో  బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలను ప్రలోభ పెట్టి పార్టీలో జాయిన్ చేసుకున్నారని పాల్వాయి స్రవంతి ఆరోపించారు. ఇరు పార్టీలు డబ్బులతో ప్రలోభ పెట్టినా కలిసి కట్టుగా కష్టపడి 24 వేల ఓట్లు తెచ్చుకున్నామన్నారు. ఇక పార్టీ కమిటీల విషయానికొస్తే.. ఈ నెల 20వ తేదీ వరకు కమిటీలు పంపించమని పార్టీ అధిష్టానం తెలిపినట్టు స్పష్టం చేశారు. 119 నియోజకవర్గాలలో ఎక్కడ కూడా కాంగ్రెస్ కమిటీలు వేయలేదన్న ఆమె.. కేవలం మునుగోడు నియోజకవర్గంలోనే కమిటీలు వేశారని తెలిపారు. అధిష్టానం నుంచి కమిటీలు వేయాలని ఎలాంటి పిలుపు లేదన్నారు. అధిష్టానం నియోజకవర్గ ఇంఛార్జికి సమాచారం చెప్పకుండా  కమిటీలు ఎలా వేస్తుందన్న పాల్వాయి స్రవంతి.. కొంతమంది నాయకులను, కార్యకర్తలను గందరగోళంలో పడేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని పీసీసీ దృష్టికి తీసుకెళ్ళామని, చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. రాబోయో రోజుల్లో కాంగ్రెస్ కమిటీ నిర్ణయం మేరకే ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ఆమె తెలిపారు.