- సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపిన వీడియో
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను తాను ఏసుక్రీస్తుతో పోల్చుకోవడం వివాదాస్పదంగా మారింది. పామ్ సండే రోజున ఏసుక్రీస్తును ప్రజలు ఎలాగైతే ‘రాజు’గా పిలిచి, గౌరవించారో.. అలాగే ఇప్పుడు తనను కూడా అందరూ కింగ్ అని పిలుస్తున్నారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బుధవారం ఆయన వైట్ హౌస్‌లో నిర్వహించిన ఈస్టర్ విందులో మాట్లాడారు. ‘పామ్ సండే రోజున ప్రజలు కింగ్ అని కీర్తిస్తూ ఏసుక్రీస్తుకు ఘనస్వాగతం పలికారు. రాజుగా గౌరవించారు. మీరు నమ్ముతారా? ఇప్పుడు నన్ను కూడా ప్రజలు కింగ్ అని పిలుస్తున్నారు" అని ట్రంప్ పేర్కొన్నారు.
ఆయన కామెంట్లకు వైట్ హౌస్ స్పిరిచ్యువల్ అడ్వైజర్ పౌలా వైట్-కెయిన్ కూడా మద్దతిచ్చారు. ‘మిస్టర్ ప్రెసిడెంట్..జీవితంలో మీరు పడినంత కష్టం, ఎదుర్కొన్నన్ని నిందలు, మీరు చేసినంత త్యాగం మరెవరూ చేయలేదు. చివరకు మీ ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. మన దేవుడైన ఏసుక్రీస్తు విషయంలోనూ ఇదే జరిగింది.
కానీ మూడవ రోజున ఆయన ఎలాగైతే మృత్యువు నుంచి విజేతగా నిలిచారో.. మీరు కూడా అలాగే విజయం సాధిస్తారు" అని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను వైట్ హౌస్ తన అధికారిక వెబ్‌సైట్ లో పోస్ట్ చేసింది. అయితే, వీడియోపై వివాదం రేగడంతో వైట్ హౌస్ దానిని తొలగించింది. కానీ, అప్పటికే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మత పెద్దల మండిపాటు
ట్రంప్ తనను తాను ఏసుక్రీస్తుతో పోల్చుకోవడాన్ని క్రైస్తవ మత పెద్దలు, రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికీ ‘దైవదూషణ’ అని తెలిపారు. క్రైస్తవ మత పెద్ద రెవరెండ్ బెన్ కేమర్ స్పందిస్తూ.. రాజకీయ స్వార్థం కోసం దేవుడి పేరును వాడుకోవడం, ఒక సామాన్య మానవుడిని క్రీస్తుతో పోల్చడం అపచారమన్నారు.
మాల్కం కెన్యాటా బైబిల్ వాక్యాలను ఉటంకిస్తూ.. ‘‘నీ దేవుడైన యెహోవా తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు’’ అనే నియమాన్ని గుర్తు చేశారు. ట్రంప్ కామెంట్లు క్రైస్తవ విశ్వాసాలకే విరుద్ధమని స్పష్టం చేశారు. పోప్ లియో స్పందిస్తూ.. ‘‘యేసు శాంతికి రాజు.. యుద్ధాన్ని సమర్థించడానికి ఎవరూ ఆయనను వాడుకోలేరు. రక్తం అంటిన చేతులతో చేసే ప్రార్థనలను దేవుడు ఆలకించడు’’ అని చురకలు అంటించారు.
