ఫ్రీ వాటర్ అని చెప్పి బిల్లులు వసూలు చేసుడేంది? : సామ రంగారెడ్డి

ఫ్రీ వాటర్ అని చెప్పి బిల్లులు వసూలు చేసుడేంది? : సామ రంగారెడ్డి

ఎల్​బీనగర్, వెలుగు: గ్రేటర్ ఎన్నికల ముందు నెలకు ఇంటికి 20వేల లీటర్ల మంచి నీటిని ఉచితంగా ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పి ఇప్పుడు అధిక బిల్లులు వసూలు చేస్తోందని బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి మండిపడ్డారు. తాగునీటిపై వాటర్ బోర్డు విధిస్తున్న అధిక వసూళ్లకు నిరసనగా సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో కాలనీల వాసులు ఎల్ బీనగర్​లోని  వాటర్ బోర్డు సర్కిల్ ఆఫీసు ముందు ధర్నాకు దిగారు. బీజేపీ కార్యకర్తలు వారికి మద్దతుగా నిలిచారు. అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. 

ఈ సందర్భంగా సామ రంగారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఓట్ల కోసమే అబద్ధపు హామీలు ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి వెంటనే 20వేల లీటర్ల మంచినీరు అందించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ రెడ్డి, ఎల్బీ నగర్ కన్వీనర్ కొత్త రవీందర్, బీజేపీ కార్పొరేటర్లు కొప్పుల నర్సింహా రెడ్డి, ప్రేమ్ మహేశ్వర్, నవజీవన్ రెడ్డి, మహిళా నేతలు పాల్గొన్నారు.