
ఒంటెలు సాధారణంగా రాజస్థాన్ ఎడారిలో కనిపిస్తుంటాయి. కానీ ఇప్పుడు ఢిల్లీ చుట్టుపక్కల ప్రదేశాలలో కనిపిస్తున్నాయి. ఇవేవో వలసదారులు తీసుకొస్తున్నవి కాదు... పోలీసులు అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటుండటంతో ఈ ఎడారి జంతువుల భాగోతం బయటికొచ్చింది. పోలీసుల ప్రకారం, అటవీ మార్గాల ద్వారా ఢిల్లీలోకి అక్రమ మద్యం రవాణా చేయడానికి ఓ గ్యాంగ్ ఈ ఒంటెలను ఉపయోగిస్తుంది.
శుక్రవారం విలేకరుల సమావేశంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) అంకిత్ చౌహాన్ మాట్లాడుతూ ఒంటెలు నాలుగు చక్రాల వాహనం లేదా ద్విచక్ర వాహనంలాగా సౌండ్ చేయవు, నడవడానికి సరైన రోడ్లు అవసరం లేదు కాబట్టి వాటిని ఈ గ్యాంగ్ ఉపయోగించిందని అన్నారు.
వాహనాలను త్వరగా గుర్తించి ఆపొచ్చు, కానీ నెమ్మదిగా కదిలే జంతువులు అనుమానం రాకుండా నిశ్శబ్దంగా అటవీ ప్రాంతాల నుండి వెళ్ళగలవు. అందుకే ఈ ముఠా ఒంటెలను ఎంచుకుంది. ఇలా ఢిల్లీలో అక్రమ మద్యాన్ని గుర్తించకుండా రవాణా చేయాలని నిందితులు అనుకున్నట్లు చౌహాన్ చెప్పారు.
ఐదుగురి అరెస్టు: ఈ ముఠా గురించి పక్క సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు గురువారం రాత్రి దక్షిణ జిల్లాకు చెందిన యాంటీ ఆటో థెఫ్ట్ స్క్వాడ్ (AATS) స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ దాడుల్లో వినోద్ భదాన (48), సునీల్ భదన (38), రాహుల్ (22), అజయ్ (25), సౌరభ్ (26)గా గుర్తించి అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వినోద్, సునీల్ ఒంటెల యజమానులు. వీరితో పాటు పోలీసులు 42 కార్టన్లలో 1,990 క్వార్టర్ బాటిళ్లు అక్రమ మద్యం, 24 బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
పట్టుకున్న మూడు ఒంటెలను జంతు సంక్షేమ సంస్థలకు అప్పగిస్తామని, ఢిల్లీ అంతర్రాష్ట్ర సరిహద్దుల వెంట పోలీసులు నిఘా పెంచడంతో కార్లు, బైకులు లేదా ఆటో-రిక్షాల ద్వారా మద్యం అక్రమంగా రవాణా చేయడం కష్టంగా మారడంతో ఈ ముఠా ఒంటెలను ఉపయోగిస్తున్నట్లు చౌహాన్ అన్నారు.