ఎల్బీనగర్, వెలుగు: బైకులపై స్టంట్స్ వేయొద్దు.. ఎవరికైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పినందుకు ఇద్దరు వ్యక్తులను ఆకతాయిలు చితకబాదారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తట్టిఅన్నారంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన పోవనం నాగభూషణ్ జీవీఆర్ కాలనీలో తన బావమరిది కొడుకు బర్త్ డే ఉండగా బుధవారం రాత్రి వెళ్లాడు. వేడుకలు ముగిసిన కొద్దిసేపటికి అల్లుడిని తీసుకొని సమీప కిరాణా షాప్‌కు వెళ్లాడు.
తిరిగి వస్తుండగా.. రోడ్డుపై కొందరు ఆకతాయిలు బైకులపై స్టంట్స్ వేస్తున్నారు. ఇదేం పద్ధతి, ప్రమాదం జరుగుతుంది.. ఇలా చేయొద్దని వారికి చెప్పి అక్కడినుంచి పంపించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ యువకులు నీకు అనవసరం, ఇక్కడి నుంచి వెళ్లిపో అని నాగభూషణ్‌ను దూషించారు. మాటామాట పెరగడంతో వారు అతనిపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు.
నాగభూషణ్బావమరిది ప్రభాకర్ వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయగా అతన్ని కూడా కొట్టారు. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. నాగభూషణ్నాగోల్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
