భూములు, ఇండ్లు తీసుకున్రు.. ఉద్యోగాలిస్తలేరు : భట్టి విక్రమార్క

భూములు, ఇండ్లు తీసుకున్రు.. ఉద్యోగాలిస్తలేరు : భట్టి విక్రమార్క

జైపూర్/కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి ఓపెన్​కాస్ట్​ మైన్ల ఏర్పాటుకు  భూములు, ఇండ్లను తీసుకుంటున్న సర్కార్ ముంపు, నిర్వాసిత  గ్రామాల్లోని యువతకు ఉపాధి కల్పిస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆదివారం మంచిర్యాల జిల్లా జైపూర్​ మండలం ఎస్సార్పీ సింగరేణి ఓసీపీ ప్రభావిత గ్రామాలైన దుబ్బపల్లి, రామారావుపేట గ్రామాల్లో భట్టి విక్రమార్క  పాదయాత్ర  కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన స్థానిక కాంగ్రెస్​ లీడర్లతో కలిసి శ్రీరాంపూర్​ సింగరేణి ఓపెన్​కాస్ట్​ మైన్​ను పరిశీలించారు. 

ఓసీపీ ముంపు, నిర్వాసిత గ్రామాలైన సింగాపూర్, తాళ్లపల్లి, గుత్తేదారిపల్లి గ్రామస్తులు రుక్మ మల్లేశ్, తోట కిష్టయ్య, శ్రీనివాస్, స్వామి తదితరులు భట్టిని కలిసి వారి సమస్యలను చెప్పుకున్నారు. తమ గ్రామాల్లోని భూములు, ఇండ్లు అన్నింటిని ఓసీపీ కోసం సర్కార్​ తీసుకుందని, గ్రామాల్లోని యువకులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పుడు స్థానికులకు కాకుండా బయటివాళ్లకు ఉద్యోగాలు ఇస్తున్నారని ఆరోపించారు. మూడు గ్రామాల్లో సుమారు వెయ్యి మంది యువకులు ఉద్యోగం, ఉపాధి లేక అవస్థలు పడుతున్నారన్నారు. 

ఓపెన్​కాస్ట్​కాకుండా అండర్​గ్రౌండ్​మైన్ ​ఏర్పాటు చేస్తే తమ భూములు, ఇండ్లను కోల్పోయేవారం కాదని, ఉపాధి, ఉద్యోగాలు కూడా వచ్చేవని అన్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్​ ప్రభుత్వమేనని, ఓపెన్​కాస్ట్​  ముంపు, నిర్వాసిత గ్రామాల ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్రలో డీసీసీ ప్రెసిడెంట్​ కొక్కిరాల సురేఖ, పీసీసీ జనరల్​ సెక్రటరీ రఘునాథ్​రెడ్డి, నియోజకవర్గ లీడర్​నూకల రమేశ్, పుల్లూరి లక్ష్మన్,  ఫయాజ్​తదితరులు పాల్గొన్నారు.