- 68 ఫ్లైట్లు రద్దు, 60 రైళ్లు ఆలస్యం
- ఆలస్యంగా నడిచిన మెస్సీ ఫ్లైట్
న్యూఢిల్లీ: ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. సోమవారం ఉదయం విజిబిలిటీ దాదాపు జీరోకు పడిపోయింది. వెనక వస్తున్నోళ్లకు ముందు వెళ్తున్న వాహనం కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనాలు మెల్లగా వెళ్లడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఏర్పడింది. సిటీలో గాలి నాణ్యత(ఏక్యూఐ) దారుణంగా పడిపోవడంతో విపరీతమైన పొగమంచు కురుస్తున్నది. చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ సివియర్ ప్లస్ కేటగిరీలోకి పడిపోయింది. అశోక్ విహార్‌లో 500, ఆనంద్ విహార్, అక్షర్‌ధామ్‌లో 493, ద్వారకాలో 469, నోయిడాలో 454 ఏక్యూఐ నమోదైంది. సోమవారం ఉదయం ఢిల్లీలో ఉష్ణోగ్రత 12 డిగ్రీలకు పడిపోయింది. విపరీతమైన పొగమంచు కారణంగా ఫ్లైట్, ట్రైన్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి 68 విమానాలను రద్దు చేశారు. మరికొన్నింటిని ఆలస్యంగా నడిపారు. ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ముంబై నుంచి ఢిల్లీకి రావాల్సిన విమానం కూడా ఆలస్యమైంది. పూర్ విజిబిలిటీ కారణంగా తమ విమాన సర్వీసులను రద్దు/ఆలస్యం చేసినట్టు ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ కంపెనీలు ప్రకటనలు విడుదల చేశాయి. ఢిల్లీలో ట్రైన్ సర్వీసులకూ అంతరాయం ఏర్పడింది. దాదాపు 60 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కాగా, పొగమంచు నేపథ్యంలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కలుషితమైన గాలితో ఏర్పడిన పొగమంచు అనారోగ్యాలకు కారణమవుతుందిని, ఉదయం వేళల్లో జనం బయటకు రావొద్దని హెల్త్ నిపుణులు సూచించారు.
ఎక్స్‌ప్రెస్ వేపై ఢీకొన్న వెహికల్స్.. నలుగురు మృతి
చండీగఢ్: పొగమంచు కారణంగా ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర ప్రమాదం జరిగింది. దాదాపు 20 వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు చనిపోగా, మరో 20 మంది వరకు గాయపడ్డారు. హర్యానాలోని నూహ్ వద్ద ఢిల్లీ--–ముంబై ఎక్స్‌ప్రెస్ వేపై మొదట రెండు ఓవర్ లోడ్ ట్రక్కులు ఢీకొన్నాయి. ఆ తర్వాత వెనక నుంచి వచ్చిన జామకాయల లోడ్ ట్రక్కు వాటిని ఢీకొట్టింది. దీంతో జామకాయలన్నీ రోడ్డుపై పడ్డాయి. ఓవైపు పొగమంచు, మరోవైపు రోడ్డుపై పడిపోయిన జామకాయల కారణంగా వెనక వచ్చిన వెహికల్స్ కంట్రోల్ కాలేకపోయాయి.
