- స్థానికుల సాయంతో బయటికి..
- పని ఇప్పిస్తానని నమ్మించి దారుణం
- కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్‌లో ఘటన
తిమ్మాపూర్, వెలుగు: పని ఇప్పిస్తానని నమ్మించి తీసుకెళ్లిన ఓ వ్యక్తి.. మహిళ మెడలోని బంగారం లాక్కొని బావిలోకి తోసేశాడు. 24 గంటల పాటు ఆ మహిళ బావిలోనే బిక్కుబిక్కుమంటూ గడిపింది. కరీంనగర్ కిసాన్‌నగర్‌కు చెందిన గంగాధర లక్ష్మి (55) కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. బుధవారం ఉదయం పనికోసం అడ్డ వద్దకు వెళ్లగా, ఓ గుర్తుతెలియని వ్యక్తి పని ఉందని చెప్పి నుస్తులాపూర్‌కు తీసుకెళ్లాడు.
హైవేకు కొంత దూరంలో ఉన్న వ్యవసాయ భూమి వద్దకు తీసుకెళ్లి, లక్ష్మి మెడలోని బంగారు గొలుసు, ఒక చెవికమ్మ లాక్కొని పక్కనే ఉన్న బావిలోకి తోసేశాడు. బావిలో పడిపోయిన లక్ష్మి ప్రాణాలు కాపాడుకోవడానికి మోటార్ పైపును పట్టుకుని నిలబడి ఉంది. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో దాదాపు 24 గంటలపాటు బావిలోనే చిక్కుకుపోయింది.
గురువారం ఉదయం పొలం యజమాని అక్కడికి రాగా, బావిలో నుంచి శబ్దాలు వినిపించాయి. లోపలికి చూసి మహిళను గుర్తించి, స్థానికుల సాయంతో తాడు కట్టి మంచం దించి ఆమెను సురక్షితంగా బయటికి తీశారు. లక్ష్మిపై అప్పటికే కరీంనగర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
