పరిచయస్తుడే దొంగ.. నిందితుడి అరెస్ట్, రూ.10 లక్షల విలువైన బంగారం స్వాధీనం

పరిచయస్తుడే దొంగ.. నిందితుడి అరెస్ట్, రూ.10 లక్షల విలువైన బంగారం స్వాధీనం

మెహిదీపట్నం, వెలుగు: ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడిని అరెస్ట్​ చేసి రూ.10 లక్షల విలువైన 157.8 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్​ ఆసిఫ్ నగర్  ఏసీపీ కె శ్రీనివాస్  కేసు వివరాలు వెల్లడించారు.

మసాబ్‌‌‌‌ ట్యాంక్‌‌‌‌లోని సిరిప్రియ రెసిడెన్సీలో ఉంటున్న రజిత శ్రీనివాస్ ఇంట్లో గత నెల 30న బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. బాధితురాలి ఫిర్యాదుతో మెహిదీపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఊబర్​బైక్​ డ్రైవర్​ బియ్య శశిధర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు బాధితురాలి మేనకోడలికి స్నేహితుడు కావడంతో తరచూ వారి ఇంటికి వెళ్లేవాడు. ఈక్రమంలో ఇంట్లో బంగారు ఆభరణాలు ఎక్కడ ఉంచారనే విషయాన్ని గమనించాడు.

అవకాశం చూసుకొని అల్మారాలోని బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. కేసును ఛేదించిన మెహిదీపట్నం ఇన్స్​పెక్టర్​ ఎస్.మల్లేశ్, డీఐ ఎన్.రాంబాబును గోల్కొండ జోన్  డీసీపీ అభినందించారు.