
- ఇందులో వజ్రాల హారం, డైమండ్ డాలర్
- ప్లాటినం గొలుసు, మంగళసూత్రం మాయం
- విలువ రూ. అరకోటికి పైనే.. మారుతాళాలతో తెరిచి.. లాకర్ల ధ్వంసం
హైదరాబాద్ సిటీ, వెలుగు: మధురానగర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. మారుతాళాలతో డోర్లు తెరిచి ఇంట్లోని లాకర్లను ధ్వంసం చేసి అరకిలోకు పైగా బంగారు నగలు, వజ్రాభరణాలు, అరలక్ష నగదును ఎత్తుకెళ్లారు. మధురానగర్ లోని సత్యదేవి విల్లాస్ లోని ఒకటో నంబర్ విల్లాలో రిటైర్డ్ జీఎస్టీ సూపరింటెండెంట్ ఆకుల హరిరావు (60) నివాసం ఉంటున్నారు. ఈనెల 21న తన కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామమైన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు వెళ్లారు. రెండ్రోజుల తర్వాత అర్ధరాత్రి ఇంటికి తిరిగొచ్చారు. ఇంటి మెయిన్ డోర్ తెరిచి లోపలికి వెళ్లి చూడగా బెడ్రూమ్ తలుపు పగులగొట్టి ఉంది. గదిలోని లాకర్ ధ్వంసమై కనిపించింది.
అలాగే మొదటి అంతస్తులోని బెడ్రూమ్ కూడా ధ్వంసమైంది. లోపల ఉన్న లాకర్ పగులగొట్టి ఉంది. లాకర్ లో దాచిన 600 గ్రాముల బరువైన ఉంగరాలు, బ్రాస్ లెట్లు, నెక్లెస్, బంగారు గాజులు, నల్లపూసల గొలుసులు, ఫ్యాన్సీ గొలుసులు, మంగళసూత్రంతో పాటు వజ్రాల హారం, డైమండ్ డాలర్ ప్లాటినం గొలుసు, లాకెట్ చైన్లతో పాటు రూ.50 వేలను మూటగట్టుకుని దొంగలు అపహరించుకెళ్లారు. మొత్తం రూ.60 లక్షలకు పైగా సొత్తు దొంగలపాలైందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కార్పెంటర్ కార్మికులపై అనుమానం
ఇటీవల ఇంట్లో కార్పెంటర్ వర్కర్లచే పనులు చేయించారు. ఇంటి గురించి అవగాహన, సొమ్ములు ఎక్కడ దాచిపెడ్తారో తెల్సినవారే చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇంటి మెయిన్ డోరును మారుతాళాలతో తెరవడం అనుమానాలకు బలం చేకూరుస్తుంది. కార్పెంటరీ వర్కర్లు చోరీకి పాల్పడ్డారా..? లేక ప్రొఫెషనల్ దొంగల పనేనా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీమ్ బృందం నేరస్థలంలో లభించిన ఆధారాల్ని సేకరించింది. చోరీ కేసును చేదిస్తామని, దొంగల్ని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.