
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో కెకె రాధామోహన్ నిర్మించారు. మే 30న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే పవర్‌ఫుల్ పోస్టర్లు, యాక్షన్‌తో నిండిన టీజర్, రెండు పాటలతో అంచనాలు పెంచిన మేకర్స్.. ఆదివారం మూడో పాటను విడుదల చేశారు. ‘డమ్ డమారే’ అంటూ సాగిన ఈ ఫ్రెండ్‌షిప్ సాంగ్‌ను శ్రీచరణ్ పాకాల కంపోజ్ చేయగా, భాస్కరభట్ల రాసిన లిరిక్స్, రేవంత్, సాహితి చాగంటి, సౌజన్య కలిసి పాడిన తీరు ఆకట్టుకుంది.
‘భోగి మంటల్లో తోసేద్దామా బాధలు.. కష్టాలు, కన్నీళ్లు మోస్తూ ఇంకా ఏన్నాళ్లూ.. చుక్కలు కలిపితే ముంగిట్లోన ముగ్గులు.. చేతుల్నే కలిపితే బలపడిపోవా బంధాలు.. అరెరె.. ఇట్టాగ చెలిమి కొరకు.. ఎవరూ అనలేదు ఇదివరకు.. అరెరె.. ఎంత అన్నదమ్ములైనా.. మనలాగా ఉంటారా జల్లెడేసి వెతుకు..’ అంటూ సాగిన పాటలో ముగ్గురు హీరోలు కలర్‌ఫుల్ ఫెస్టివల్ వైబ్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. సీనియర్ నటి జయసుధతో పాటు హీరోయిన్స్‌గా నటించిన ఆదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై ట్రెడిషినల్ లుక్‌లో ఇంప్రెస్ చేస్తున్నారు. ఫ్రెండ్‌షిప్‌ని సెలబ్రేట్ చేసుకునేలా ఈ పాటను డిజైన్ చేసిన తీరు సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది.