- అజెండా అంశాలను పంపాలని తెలుగు రాష్ట్రాలకు సీడబ్ల్యూసీ లేఖ
హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి ఏర్పాటైన కమిటీ మూడో సమావేశం త్వరలో జరగనుంది. దీనికి సంబంధించిన అజెండా అంశాలను పంపించాల్సిందిగా తెలంగాణ, ఏపీలకు తాజాగా సీడబ్ల్యూసీ లేఖ రాసింది. సెప్టెంబర్ 7న జరిగిన కమిటీ రెండో సమావేశంలో నిర్ణయించిన ఎజెండా అంశాలపై రెండు రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది.
గోదావరి– కావేరి (జీ-సీ) లింక్ అమలు కోసం త్వరితగతిన ఏకాభిప్రాయం సాధించడం ద్వారా దీర్ఘకాలికంగా ఉన్న అనేక వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేసింది. కాగా, ఇచ్చంపల్లి నుంచి 148 టీఎంసీల నీటిని మళ్లించేలా ఎన్‌డబ్ల్యూడీఏ ఇప్పటికే జీసీ లింక్ డీపీఆర్ ను సిద్ధం చేసిందని తెలిపింది. అలాగే, పోలవరం నుంచి నీటిని పాక్షికంగా లేదా పూర్తిస్థాయిలో మళ్లించడంపైనా ఇటీవల సమావేశాల్లో చర్చలు జరిగాయని పేర్కొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపాదిత జీసీ లింక్ ప్రాజెక్టుపై ఏకాభిప్రాయంపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై ఒక నోట్ సమర్పించాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను సీడబ్ల్యూసీ కోరింది.
ఇంకా అందని అజెండా అంశాలు, స్టడీ రిపోర్టులు..
రెండో కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తమ అజెండా అంశాలను సమగ్ర డేటా, ఆధార పత్రాలు (సపోర్టింగ్ డాక్యుమెంట్లు), రిఫరెన్సులు, అధ్యయన నివేదికలు (స్టడీ రిపోర్టులు), సమర్థనలతో (జస్టిఫికేషన్స్) సహా ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరులోగా సమర్పించాల్సి ఉంది.
అయితే, నవంబర్ నెల సగం గడుస్తున్నా అజెండా అంశాలు ఇంకా అందలేదని సీడబ్ల్యూసీ తన లేఖలో పేర్కొంది. అందువల్ల, త్వరలో జరగబోయే కమిటీ మూడో సమావేశాన్ని దృష్టిలో ఉంచుకుని, సంబంధిత డాక్యుమెంట్లు, రిఫరెన్సులు, స్టడీ రిపోర్టులు, జస్టిఫికేషన్లతో కూడిన అజెండా అంశాలను, జీ-సీ లింక్‌పై నోట్‌ను త్వరగా పంపాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సీడబ్ల్యూసీ విజ్ఞప్తి చేసింది.
