ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడో విడత ఎన్నికల ప్రచారానికి తెర

ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడో విడత ఎన్నికల ప్రచారానికి తెర
  • పోలింగ్​కు ఏర్పాట్లు పూర్తి
  • ప్రలోభాలు షురూ చేసిన అభ్యర్థులు
  • సిబ్బందికి పోలింగ్​ కేంద్రాల కేటాయింపు

మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు:  ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ నెల 17న జరిగే మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో మొత్తం 62 సర్పంచ్​ పదవులు ఏకగ్రీవమయ్యాయి. అవిపోను మిగతా స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం ప్రచారం గడువు ముగియడంతో ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు అభ్యర్థులు నగదు, మద్యం, గిఫ్ట్​ల పంపిణీ మొదలుపెట్టారు.  

మెదక్ జిల్లాలో..

మూడో విడతలో జిల్లాలో 7 మండలాల్లోని 184 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 22 ఏకగ్రీవమయ్యాయి. అవిపోను 162 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 512 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,528  వార్డులు ఉండగా అందులో 307 ఏకగ్రీవమయ్యాయి.  ఒక వార్డుకు నామినేషన్లు రాలేదు. అవిపోను 1,220 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 

3,202 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 7 మండలాల్లో ఓటర్లు పురుషులు 83,531, మహిళలు 89,269, ఇతరులు 4 కలిపి మొత్తం 1,72,804 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు ఆర్ వో లు 164 మంది,  పీవోలు 1,386,  ఓపీవోలు 1,506 మందిని నియమించారు. 

సిద్దిపేట జిల్లాలో..

జిల్లాలో మూడో విడతలో అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, ధూల్మిట్ట, కొండపాక, కుకునూరుపల్లి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 163 పంచాయతీలు 1,432 వార్డులకు 13  పంచాయతీలు, 249 వార్డులు ఏకగ్రీవంకాగా 587 మంది సర్పంచ్,  3,308 మంది వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 

9 మండలాల పరిధిలో మొత్తం 2,13,327 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల విధులకు  సంబంధించి ప్రిసెండింగ్ అధికారులు 1,718, అదనపు ప్రిసెండింగ్ అధికారులు 2,123 తో మొత్తం 3,841 అధికారులు పోలింగ్ విధుల్లో పాల్గొంటారు.

సంగారెడ్డి జిల్లాలో.. 

జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 17న నారాయణఖేడ్, జహీరాబాద్ డివిజన్ల పరిధిలో 8 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 234 పంచాయతీలు, 1,960 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 27 పంచాయతీలు, 422 వార్డులు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 207  పంచాయతీలకు 576 మంది అభ్యర్థులు, 1,536 వార్డు స్థానాలకు 3,519 మంది క్యాండిడేట్లు బరిలో నిలిచారు. 

కల్హేర్, కంగ్టి, మనూర్, నాగల్ గిద్ద, నారాయణఖేడ్, నిజాంపేట్, సిర్గాపూర్, న్యాల్కల్ మండలంలో జరగనున్న ఎన్నికల్లో మొత్తం 2,38,377 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలు నిర్వహించే పంచాయతీలకు మండలాల వారీగా పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీవోలను ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు కేటాయించారు.