ఈ యాక్టర్ జర్నీ సీతాకోక చిలుకనే గుర్తుకు తెస్తుంది

ఈ యాక్టర్ జర్నీ సీతాకోక చిలుకనే గుర్తుకు తెస్తుంది

గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారటానికి  ఎన్నో కష్టాలు పడుతుంది. ఎన్నెన్నో కష్టాలు దాటుతుంది. ఈ యాక్టర్ జర్నీ కూడా అచ్చంగా సీతాకోక చిలుకనే గుర్తుకు తెస్తుంది. పద్నాలుగేండ్ల కింద సినిమా కలలు కంటూ ముంబైలో అడుగుపెట్టాడు విజయ్ వర్మ. నటనే శ్వాసగా ఒక్కో దశ దాటుకుంటూ ఈ మోడర్న్​ టైమ్స్​లో ఒకానొక ఫినామినల్ యాక్టర్​గా ఎదిగిన  విజయ్ జర్నీ ఇది.

‘‘ఈ మధ్య నేను చేసిన ‘డార్లింగ్స్’ మూవీ నెట్ ఫ్లిక్స్​లో విడుదలైంది. ఇందులో వేధించే భర్తగా ‘హంజా’ అనే టాక్సిక్ రోల్ చేశా. ఈ సినిమా పోస్టర్స్​లో నా ఫొటో పెట్టలేదు. కానీ, ఈ మూవీ చూసినవాళ్లెవరైనా సరే నన్ను మర్చిపోలేరు. ఈ సినిమా విడుదలయ్యాక నా పాత్రకు అన్ని రకాల రియాక్షన్స్ వస్తున్నాయి. కొందరు హంజాను ద్వేషిస్తున్నారు. కొందరు నా యాక్టింగ్ స్కిల్స్​ని మెచ్చుకుంటున్నారు. అన్నింటికంటే ఫన్నీ ఏంటంటే... మా అమ్మ ఈ మూవీ చూసి, చాలా భయపడింది. ఇక, నా కొడుకును ఎవరూ పెళ్లి చేసుకోరని బాధపడటం మొదలుపెట్టింది. అమ్మ రియాక్షన్ విన్న తర్వాత నేను చాలా నవ్వుకున్నా. అయితే, నేను కూడా ‘డార్లింగ్స్’ మూవీ నా జీవితంలో మళ్లీ చూడను. ఎందుకంటే, మనల్ని మనం ద్వేషించుకోవడాన్ని మళ్లీ మళ్లీ చూడలేం కదా!

తిండి మానేసి

హంజా పాత్రకు భార్యగా నటించిన అలియాభట్, హంజాను కిడ్నాప్ చేసి రివెంజ్ తీర్చుకుంటుంది. ఈ సినిమా చేస్తున్నప్పుడు మా అమ్మ వీడియో కాల్ చేసి ‘బక్కగా అవుతున్నావ’ని అనేది. నేను బాగానే తింటున్నా అని చెప్పేవాడిని. కానీ, హంజా కిడ్నాప్ అయినప్పుడు, తిండి లేకుండా ఎలా ఉంటాడో, అలాగే ఉండటం కోసం తిండి మానేసి బరువు తగ్గాననే విషయం అమ్మకు అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు కరీనా కపూర్​తో ‘డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్’, ‘సోనాక్షి సిన్హా’తో దహద్, ‘మీర్జాపూర్ 3’ తో పాటు సుమిత్ సక్సేనా ప్రాజెక్టులో చేస్తున్నా.

హైదరాబాదీనే...

మాది హైదరాబాద్​లో సెటిల్ అయిన మార్వాడీ ఫ్యామిలీ.1986లో పుట్టా. హైదరాబాద్​లోనే థియేటర్ కోర్స్​ నేర్చుకున్నా. యాక్టింగ్​ చేస్తాన‌‌ని చెప్పినప్పుడు, మా ఫ్యామిలీ నన్ను అటువైపు వెళ్లనివ్వకుండా చేసేందుకు చాలా ప్రయ ‌‌త్నాలు చేసింది. అయినా సరే మొండిపట్టు పట్టా. జీవితంలో ఎన్నో రిస్క్​లు తీసుకున్నా. యాక్టింగ్ కోసం ఫ్యామిలీని విడిచిపెట్టి, ఇంటి నుంచి పారిపోయా. హైదరాబాద్​లో రెండేండ్లు నాటకాల్లో నటించాక...  నా ఫ్రెండ్స్ ద‌‌గ్గర ఫీజు కోసం అప్పు చేసి, పుణే ఎఫ్టీఐఐలో రెండేళ్ల యాక్టింగ్ కోర్సు పూర్తి చేశా.

ముంబైలో అడుగుపెట్టా...

యాక్టింగ్ కోర్సు 2008లో పూర్తి చేశాక పుణే నుంచి సినిమాల్లో అవ ‌‌కాశాలు వెతుక్కుంటూ ముంబై వెళ్లిపోయా. ముంబైలో బ‌‌త‌‌క‌‌డం కూడా చాలా క‌‌ష్టమైంది. ముంబైలో సంవ‌‌త్సరంన్నర పాటు టామ్ ఆల్టర్​తో క‌‌లిసి నాటకాల్లో నటించా. నా థియేట‌‌ర్ పర్ఫార్మెన్స్ చూశాక నా దగ్గరికి కొంతమంది డైరెక్టర్లు రావ‌‌డం మొద‌‌లైంది. మ‌‌ధ్యమ‌‌ధ్యలో వెళ్లి ఆడిషన్స్ ఇచ్చేవాడిని. ఆడిష‌‌న్స్​లో కూడా నాకు నచ్చిన వాటినే ఇస్తుండేవాడిని. అలా 2010లో నాకు ‘చిట్టగ్యాంగ్’ మూవీలో నటించే అవకాశం వచ్చింది. 2012లో విడుదలయిన ఆ సినిమా నాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత 2013లో ‘మాన్​సూన్ షూటౌట్’లో నటించా. అది ఆ సంవత్సరం కాన్స్ ఫెస్టివల్​తో పాటు అనేక ఇంటర్నేషనల్ ఫిల్మ్​ ఫెస్టివల్స్​కి వెళ్లింది. అయినా అంతగా అవకాశాలు రాలేదు. 2013లో ‘రంగ్రీజ్’, 2014లో ‘గ్యాంగ్స్ ఆఫ్ ఘోస్ట్స్’ వంటి స్పెష ‌‌ల్ మూవీస్ చేశా. అయినా దురదృష్టవశాత్తు అవి కూడా నా కెరీర్​లో మార్పు తేలేకపోయాయి. ఒక మూవీలో నటించడం వరకే మన చేతుల్లో ఉంటుంది, ఫలితం మన చేతుల్లో ఉండదని అప్పుడే రియలైజ్ అయ్యా.

వాటికి ‘నో’ చెప్పేశా

మంచి మూవీ చేస్తున్నా... నాకు ఈ మూవీతో బ్రేక్ వస్తుందని అనుకునేవాడిని. కానీ, నెలలు, సంవత్సరాలు గడిచినా... బ్రేక్ రాలేదు. నా ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది. చివరికి 2016లో అమితాబ్​ బచ్చన్ తో కలిసి ‘పింక్’ మూవీలో నటించే అవకాశం వచ్చింది. అది చాలా చిన్న రోల్. నెగెటివ్ రోల్. కానీ, డైరెక్టర్ సుజీత్ సిర్కర్ తో కలిసి పని చేయాలనే ఉద్దేశంతో ఆ సినిమా ఆఫర్ ఒప్పుకున్నా. ‘పింక్’ సూపర్ హిట్ అయ్యింది. కానీ, అప్పటి నుంచి గర్ల్ ఫ్రెండ్ లేదా వైఫ్​ని కొట్టే రోల్స్, రౌడీ రోల్స్​కే  ఆఫ ‌‌ర్లు రావడం మొదలైంది. ఆ ఇమేజ్​ బ్రేక్ చేయడానికి, అలాంటి ఆఫర్స్ అన్నింటికీ ‘నో’ చెప్పేశా. దానికోసం ముందుగా యూట్యూబ్ కామెడీ షో ‘చీర్స్’కి ఓకే చెప్పా. ఆ తర్వాత 2017లో  తెలుగులో  ‘మిడిల్ క్లాస్ అబ్బాయి(ఎంసీఏ)’ మూవీలో నెగెటివ్​ లీడ్ రోల్ చేశా. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు వస్తాయనుకున్నా. కానీ, మళ్లీ నిరాశే ఎదురైంది.

ఆ అవకాశం ఉండేది కాదు

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు నచ్చిన రోల్ ఎంచుకునే అవకాశం ఉండేది కాదు. అయినా సరే, నేర్చుకోవాలనే ఉద్దేశంతో వచ్చిన వాటిలో బెస్ట్ ప్రాజెక్ట్స్​ ఎంచుకున్నా. ‘నువ్వేం షారుక్​ ఖాన్ వి కాదు’ అనే మాటల్ని ఎన్నోసార్లు ఫేస్ చేశా. అలాంటప్పుడు ఒకవేళ నా మోటివేషన్ కోల్పోయి ఉంటే, ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. మాటలేవీ పట్టించుకోకుండా నా బెస్ట్ ఇస్తూ ఇక్కడే నిలబడ్డా. ఈ రోజు ఏకంగా షారుక్​ ఖాన్ నిర్మించిన ‘డార్లింగ్స్​’ మూవీలో నటించే అవకాశం వచ్చింది.

నా కెరీర్​కి మలుపు

జోయా అక్తర్ డైరెక్షన్​లో 2018లో  వచ్చిన ‘గల్లీ బాయ్’ నా కెరీర్​ని మ‌‌లుపు తిప్పింది. అందులో చేసిన డ్రగ్ పెడ్లర్  మొయిన్ భాయ్ పాత్రను ప్రతి ఒక్కరూ ప్రేమించారు. ఆ రోల్ నేను ఊహించనంత పేరు తీసుకొచ్చింది. ఇందులో నా పర్ఫార్మెన్స్​ని మెచ్చుకుంటూ అమితాబ్​ బచ్చన్ స్వయంగా లెటర్​ రాసి పంపించారు. ‘ఇక ‌‌, నీ గురించి నీ పర్ఫార్మెన్సే మాట్లాడుతుంది. నువ్వు బయటకు వెళ్లి ప్రూవ్ చేసుకోనవసరంలేదనే’ది ఆ లెటర్​ సారాంశం. అది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మూమెంట్. ఆయన అన్నట్టుగానే, గల్లీ బాయ్ విడుదలయ్యాక నేను ‘నో’ చెప్పలేని రోల్స్ వచ్చాయి. ఆ తర్వాత ‘మీర్జాపూర్’ కథ వినడానికి వాళ్ల ఆఫీసుకి వెళ్లాను. డైరెక్టర్ అన్షూమన్ మీర్జాపూర్​లో డబుల్ రోల్ ఆఫర్​ చేశారు. మీర్జాపూర్ వల్ల పాన్ ఇండియా మొత్తం తెలిసిపోయా. 2019లో హృతిక్ రోషన్​తో చేసిన ‘సూప ‌‌ర్-30’, ‘ఘోస్ట్ స్టోరీస్’, ‘భాగీ-3’ నాకు మంచి పేరు తెచ్చాయి. 2020లో నెట్​ఫ్లిక్స్​లో విడుద ‌‌లైన ‘ఏ సూటబుల్ బాయ్’ సిరీస్​లో, ‘యారా’ మూవీలో నటించా. 2021లో రాధికా ఆప్టేతో కలిసి లీడ్ రోల్​లో చేసిన కామెడీ సిరీస్ ‘ఓకే కంప్యూటర్’ డిస్నీలో విడుదలై, సూపర్ హిట్ అయ్యింది.

భాష, యాస వస్తే చాలు

2020లో నెట్​ఫ్లిక్స్​లో విడుదలైన ‘షీ’ వెబ్ సిరీస్​లో హైదరాబాదీ డ్రగ్ మాఫియా డాన్ రోల్ చేశా. ఇందులో చేసిన ‘సస్య’ పాత్ర నాలోని అసలు సిసలు హైదరాబాదీని బయటకు తెచ్చింది. ఒక నటుడికి తన పాత్రకు సంబంధించిన భాష ‌‌, యాస వస్తే ఆ యుద్ధంలో సగం గెలిచిన ‌‌ట్టే! ‘షీ’ సిరీస్ కోసం ముంబై యాస ‌వదిలించుకోవడానికి మళ్లీ హైదరాబాద్​లో నా ఫ్రెండ్స్​ని కలిశా. వాళ్లతో చాలా రోజులు గడిపి, హైదరాబాదీ యాసను పర్ఫెక్ట్​గా ప్రిపేర్ అయ్యాకే సెట్​లో అడుగుపెట్టా. ఆ పాత్రకు దక్కిన ప్రశంసల్ని ఎప్పటికీ మర్చిపోను.

క్లారిటీ ఉంది

కెరీర్​లో ఏం చేయాలనుకుంటున్నానో దానిపై నాకొక క్లారిటీ ఉంది. నేను న్యాయం చేయలేను అనుకున్న రోల్స్ చేయడానికి ఇప్పటివరకు ఒప్పుకోలేదు. నా జర్నీ స్క్రాచ్ నుంచి మొదలుపెట్టా. ‘గల్లీ బాయ్’లో మెయిన్ రోల్​ చేశాక నాకు బలం పెరిగింది. ఆ తర్వాత నుంచి మంచి స్క్రిప్ట్​లు, మంచి రోల్స్ ఎంచుకునే అవకాశం వచ్చింది. అంతకుముందు నాది చాలా చిన్న జర్నీ. రోల్, స్క్రిప్ట్ ఎంచుకునే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఎలాంటి మూవీస్, ఎలాంటి రోల్స్ చేయాలో నేనే ఎంచుకునే పొజిషన్​కి వచ్చేశా. ఇప్పటివరకు చేసిన రోల్స్ రిపీట్ చేయాలనుకోవడం లేదు. స్క్రిప్ట్ చదివేటప్పుడు నా మొదటి కండిషన్ అదే. తర్వాత నేను ఈ సినిమాలో ఏం చేస్తున్నా? ఈ సినిమా ఏం చెప్పబోతుంది? ఎలా చెప్పబోతుంది? అని చూస్తా. ఈ మూడింటి ఆధారంగానే ఇప్పుడు నా సినిమాల్ని ఎంచుకుంటున్నా.

బిజీగా ఉండటం ఇష్టం

బాలీవుడ్​కి బయటి నుంచి వచ్చా కాబట్టి, తప్పులు చేయడానికి, ఆ తప్పుల నుంచి నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఫేమ్, ఇమేజ్ అనే బరువు మీద ఉండదు. కాబట్టే, అమితాబ్ బచ్చన్​తో చేసిన ‘పింక్’ మూవీలో ఆయన్ని తిట్టే యువకుడిగా చేయగలిగా. ‘ఘోస్ట్ స్టోరీస్’లో ఘోస్ట్ గా, ‘ఓకే కంప్యూటర్’లో మంచి పోలీస్ రోల్ చేయగలిగా. వెరైటీ అనేది యాక్టర్ జీవితానికి మసాలా లాంటిదని నమ్ముతా. తప్పులు చేశాక‌‌, అవి ఎలా పని చేశాయో తెలుసుకోవడానికి మూవీ విడుదలయ్యే వరకూ ఎదురు చూస్తా. ఒక నటుడిగా ఇలాగే ట్రైన్​ అవ్వాలని ఫిల్మ్ స్కూల్లోనే నేర్చుకున్నా. నటుడిగా నాకు అది ప్రొఫెషనల్ టచ్ ఇచ్చింది. కానీ, యాక్టింగ్​ మొదలుపెట్టిన రోజుల్లో సినిమాలు ఆలస్యంగా విడుదల కావడం వల్ల చాలా అవకాశాలు కోల్పోయా. అది చాలా బాధ ‌‌పెట్టింది. ఏ యాక్టర్ అయినా బిజీగా ఉండాలనే కోరుకుంటాడు. నా కెరీర్​లో గత మూడేండ్ల నుంచి అది నిజమవుతోంది.

వాళ్లే తీయగలరు

నేను నెగెటివ్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు విమెన్ డైరెక్టర్ నన్ను డైరెక్ట్ చేయడం నాకు చాలా ఇష్టం. ‘డార్లింగ్స్’లో చేసిన నెగెటివ్ రోల్​ని ఒక విమెన్ డైరెక్టర్ మాత్రమే బయటకు తీసుకురాగలదు. ‘డార్లింగ్స్’ లాంటి కథను విమెన్ డైరెక్టర్ మాత్రమే బాగా చెప్పగలరు. జస్మీత్ ఈ మూవీ చాలా అద్భుతంగా తీశారు.

::: గుణ