రైతు కష్టం చూడలేక.. కదిలిన గవర్నమెంట్​ టీచర్

రైతు కష్టం చూడలేక.. కదిలిన గవర్నమెంట్​ టీచర్

మేడలు కట్టాలన్న కోరికలుండవు రైతులకి. మూడు పూటలా పెళ్లాం, బిడ్డలకి కడుపునిండా తిండి పెడితే చాలనుకుంటారు.  అప్పు చెయ్యకుండా పిల్లలకి అక్షరాలు నేర్పిస్తే  అదే గౌరవం వాళ్లకి. కానీ, వానలు, వరదలు, ఎండలు, చీడపీడలు వాళ్ల కలలన్నింటినీ కన్నీళ్లుగా మార్చేస్తుంటాయి​. చేతి కొచ్చిన పంట నోటిదాక  రాకుండా అడ్డుపడి వాళ్ల ప్రాణాల్ని మింగేస్తున్నాయి. దాంతో  చాలా రైతు కుటుంబాలు ఒంటరవుతున్నాయి. ఇలాంటివి మన చుట్టు పక్కల తరచూ చూస్తుంటాం. వింటుంటాం. అలాంటివాళ్లని చూసి అందరిలా ‘అయ్యో పాపం’ అని ఊరుకోకుండా తన వంతు సాయం చేస్తున్నాడు పులిరాజు టీచర్​. రైతుల ఆత్మహత్యతో దిక్కులేనివాళ్లైన కుటుంబాల్ని చేరదీస్తున్నాడు. 21 ఏళ్లుగా అదే ఆశయంగా బతుకుతున్న సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తునికి ఖల్సాలోని ఈ గవర్నమెంట్​ టీచర్​ ఎందరికో ఆదర్శం.

పులిరాజు.. టీచర్.​ రైతు కుటుంబాల్లో  కన్నీళ్లని  చూడలేడు. పేపర్లో, టీవీల్లో రైతుల ఆత్మహత్యల వార్తలు వచ్చిన ప్రతిసారీ కుంగిపోతాడు. ఒంటరైన ఆ కుటుంబం గురించి  ఆలోచనలో పడతాడు. వాళ్లని వెతుక్కుంటూ వెళ్లి మరీ ధైర్యం చెప్తాడు.  ఆత్మహత్య వెనకున్న కారణాల్ని తెలుసుకుని, సాయం చేస్తాడు. ఇదేదో నిన్న మొన్న మొదలు పెట్టలేదు. ఇరవై ఒక్క ఏళ్ల కిందటే ఈ మంచి పని కోసం అడుగేశాడాయన​. ఆ తర్వాత గవర్నమెంట్​ బడిలో టీచర్​గా ఉద్యోగమొచ్చినా  రైతు కుటుంబాల గురించి ఆలోచించడం ఆపలేదు.  ఆత్మహత్యకి బలైన రైతు కుటుంబాల్ని  సెలవుల్లో కలుస్తున్నాడు. దాతల సాయంతో వాళ్ల పిల్లల చదువు బాధ్యత తీసుకుంటున్నాడు.  అప్పులు తీర్చడానికి డబ్బు సాయం చేస్తున్నాడు.

అవార్డులొచ్చాయి

రైతు కుటుంబాల కోసం పులి రాజు చేస్తున్న  పనికి  2015 లో  సివిల్​ సొసైటీ  సంస్థ అవార్డు ఇచ్చింది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ తమిళసై చేతుల మీదుగా  రైతు నేస్తం అవార్డు కూడా అందుకున్నాడు పులిరాజు.  మంజీర రైతు సంఘాల సమాఖ్య నుంచి  రెండు సార్లు రైతు బాంధవుడు అవార్డు, 2019 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్​ టీచర్​  అవార్డు అందుకున్నాడు.

అందరూ అండగా..

పీజీ చదువుతున్నప్పుడు రైతుల ఆత్మహత్యల గురించి పేపర్​లో చదివా. ఆ వార్త నుంచి బయటికి రాలేకపోయా. రోడ్డునపడ్డ వాళ్ల కుటుంబాలే  గుర్తుకొచ్చాయి. వాళ్లకి సాయం చేయాలని 2000 సంవత్సరం నుంచి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్ని వెతుక్కుంటూ వెళ్తున్నా. కానీ, నేనొక్కడినే అందరికీ సాయం చేయలేను.  సొసైటీలోని ప్రతి ఒక్కరూ అన్నం పెట్టే  రైతు కుటుంబాలకి అండగా ఉండాలి.                                                                                                                                           - పులి రాజు, టీచర్
 

 

::: సిద్దిపేట, వెలుగు