రేవంత్రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం ముహూర్తం ఇదే

రేవంత్రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం ముహూర్తం ఇదే
  • ఎల్బీ స్టేడియంలో చురుగ్గా ఏర్పాట్లు
  • పర్యవేక్షిస్తున్న సీఎస్ శాంతి కుమారి
  • మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం 
  • హాజరు కానున్న సోనియా, రాహుల్, ఖర్గే

హైదరాబాద్‌: తెలంగాణమూడో ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్​ రేవంత్రెడ్డి రేపు మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  ముందుగా ప్రకటించిన ప్రకారం రేపు ఉదయం 10.28 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయాల్సి ఉండగా వాయిదా పడింది. ప్రమాణస్వీకార వేదికలో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ఎల్బీ స్టేడియంలోనే ఆయన ప్రమాణస్వీకారం కార్యక్రమం జరుగనుంది.

రేవంత్ ప్రమాణస్వీకారానికి అక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికారులు దగ్గరుండి వాటిని పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర చీఫ్‌ సెక్రెటరీ శాంతికుమారి, డీజేపీ, పోలీస్ కమిషనర్‌, ఇతర ఉన్నతాధికారులు ఎల్బీ స్టేడియానికి చేరుకొని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇదిలావుంటే కాబోయే సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే, ప్రియాంకాగాంధీ తదితర అగ్ర నేతలందరినీ విడివిడిగా కలిసి తన ప్రమాణస్వీకర కార్యక్రమానికి ఆహ్వానించారు. రాష్ట్రంలో మంత్రివర్గ కూర్పుపై కూడా వారితో చర్చించారు. 

వీరికి ఆహ్వానం

రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సిందిగా.. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్  కు ఆహ్వానం పంపారు.  కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కర్ణాటక మంత్రులకు ఆహ్వానం పంపారు. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లట్, ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేష్ భగేల్, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహన్ కు సైతం ఆహ్వానం అందనుంది. తమిళనాడు, ఏపీ సీఎంలు స్టాలిన్, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆహ్వానం పంపనున్నారు.

మాజీ సీఎంలు కేసీఆర్‌, చంద్రబాబు, సినీ నటులకు ఆహ్వానం పంపుతున్నారు. వీరితో పాటు దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, కుంతియా, వాయిలార్ రవి, మాణిక్కం ఠాగూర్, మరికొందరు ముఖ్యులకు ఆహ్వానం అందనుంది. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన చిదంబరం, మీరాకుమారి, సుశీల్ కుమార్ షిండే, కురియన్ కు ఆహ్వానం పంపనున్నారు.

తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు, ఉద్యమ కారులకు, హైకోర్టు చీఫ్ జస్టిస్‌తోపాటు వివిధ కులసంఘాల నేతలకు, మేధావులకు ఆహ్వానం అందనుంది.