ఈ ఆఫీసర్​ రైతు ఫ్రెండ్లీ  

ఈ ఆఫీసర్​ రైతు ఫ్రెండ్లీ  

రైతు పడే కష్టం తెలుసు. పంట పండించేందుకు ఆరుగాలం ఎలా కష్టపడతాడో చూసింది. రసాయన ఎరువులు వాడితే ఎలాంటి అనర్థాలు వస్తాయో, వాటికి ఎంత ఖర్చు అవుతుందో అవగాహన ఉంది. అందుకే,  రైతన్నకు సాయంగా ఉండాలనుకుంది విజృంభణ. బాగా చదివి అగ్రికల్చర్​ ఎక్స్​టెన్షన్​ ఆఫీసర్​ (ఏఈఓ)గా ఉద్యోగం తెచ్చుకుంది. ఆమె పనిచేసే దగ్గర రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తూ, రైతులకు సాయం చేస్తోంది.

మెదక్‌‌ జిల్లా చిలప్‌‌​చేడ్‌‌కు చెందిన  విజృంభణ రైతు కుటుంబంలో పుట్టింది. ఆమెకు రైతులు పడుతున్న కష్టాలు తెలుసు. రసాయనిక ఎరువులు వల్ల జరుగుతున్న నష్టాలపై ఆమెకు అవగాహన ఉంది. అందుకే, అగ్రికల్చర్​ ఎక్స్​టెన్షన్​ ఆఫీసర్‌‌‌‌గా బాధ్యతలు తీసుకున్న వెంటనే రైతులకు సాయం చేసేందుకు నడుం బిగించింది. రైతులని సేంద్రియ సాగువైపు అడుగులు వేయిస్తోంది. ఎరువులు తయారీ, వాటి వాడకంపై స్వయంగా తనే పొలాలకు వెళ్లి రైతులకు శిక్షణ ఇస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ ప్రవేశపెట్టిన 'పరంపరాగత కృషి వికాస్‌‌‌‌ యోజన'  స్కీమ్​ను ఎలా వాడుకోవాలో రైతులకు చెప్తోంది ఈ ఆఫీసర్‌‌‌‌. 
ఆవులను దత్తత తీసుకుని..
విజృంభణ సేంద్రియ వ్యవసాయం గురించి చెప్పినప్పుడు మొదట్లో రైతులు ఆసక్తి చూపలేదు.  సాకులు చెప్పేవారు. కానీ, ఆమె ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా రైతులకు కావాల్సినవన్నీ సమకూర్చింది. దాంట్లో భాగంగానే ఆవులు లేవని చెప్పినవారికి.. ఐదు ఆవులను ఇచ్చింది. ఆ తర్వాత  వాటికి పుట్టిన దూడలను వేరే  రైతులకు ఇచ్చి వారు కూడా గో ఆధారిత సేంద్రియ వ్యవసాయం చేసేలా చేసింది. కోడిగుడ్లు, నిమ్మకాయలు, బెల్లం, నీళ్లను ఉపయోగించి ఎరువులు ఎలా తయారు చేసుకోవచ్చో వర్క్‌‌షాప్స్‌‌ నిర్వహిస్తోంది. అలా ఆమె పనిచేసిన నార్సింగి మండలంలో దాదాపు ఇప్పటివరకు 52 మంది రైతులతో 129 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేయిస్తోంది. వరిలో దేశీయ రకాలు, వివిధ రకాల కూరగాయలు, పుదీనా, బొప్పాయి, జామ, అరటి, డ్రాగన్​ ఫ్రూట్​ పంటల్ని సాగు చేస్తున్నారు రైతులు.                                                                                         ::: శ్రీధర్​, మెదక్​, వెలుగు
రసాయనాలతో నష్టాలు తెలుసు

కొత్త వ్యవసాయ పద్ధతుల వల్ల రైతులు అప్పుల పాలవుతున్నారు. ఈ ఎరువుల వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయం అన్ని విధాల మేలైనది. అందుకే  సాధ్యమైనంత మంది రైతులకు ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ సాగు పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నా. నేరుగా రైతుల పంట పొలాలకు వెళ్లి సేంద్రియ ఎరువుల తయారీ, పురుగుల, తెగుళ్ళకు కషాయాలు తయారు చేసి వాడడం నేర్పిస్తున్నా. 
                                                                                                                                                          - విజృంభణ, ఏఈఓ, హవేలి ఘనపూర్
పెట్టుబడి ఖర్చు తగ్గింది
కెమికల్​ మందుల వల్ల ఖర్చుపెరిగి లాభం వచ్చేది కాదు. అంతేగాక భూమిలో సారం తగ్గేది. కానీ, ఇప్పుడు భూసారం పెంచేందుకు జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట ఎరువులు వేస్తున్నాం. జీవామృతం, కషాయాలు వాడుతున్నాం. దీంతో పెట్టుబడి ఖర్చు తగ్గింది. 
                                                                                                                                                                                  - పి.యాదగిరి, ఫరీద్​పూర్‌‌‌‌
యూరియా వాడుతలేను
ఇంతకుముందు  పంటలకు యూరియా, పాస్ఫెట్​ ఎరువులు వాడేవాడిని. ఏఈఓ మేడం ఎరువుల వాడకం వల్ల కలిగే నష్టాల గురించి అర్థం అయ్యేటట్టు చెప్పింది. దాంతో జీవామృతం, కషాయాలు నేనే సొంతంగా తయారు చేసి పంటలకు వేస్తున్నా.  దిగుబడి కూడా బాగా వస్తోంది.
                                                                                                                                                                - ఎం.యాదగిరి, బోగడ భూపతిపూర్​