అగ్గువకు చైనా మెషీన్లు తేవడంతోనే ఈ సమస్య

అగ్గువకు చైనా మెషీన్లు తేవడంతోనే ఈ సమస్య
  • రూ.20 వేలకు కొని రూ.60 వేల బిల్లు లేపుకున్నరు..
  • రిపేర్లు చేయిద్దామన్న జీపీ సిబ్బందికి కంపెనీ నంబర్లు ఇస్తలేరు
  • గ్రామాల్లో పెరుగుతున్న సీజనల్ వ్యాధులు

మహబూబ్​నగర్, మిడ్జిల్, వెలుగు: దోమల నివారణకు ఉపయోగించే ఫాగింగ్ మెషీన్లు పని చేయడం లేదు.  కొందరు సర్పంచులు అగ్గువకు చైనా మెషీన్లు తేవడంతోనే ఈ సమస్య వచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  బ్రాండెడ్‌‌‌‌ కంపెనీల కొన్నామని బిల్లులు లేపుకున్న వీళ్లు ఒక్కదానికీ వారంటీ చూపించకపోవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. మరోవైపు సీజనల్‌‌‌‌ ​వ్యాధులు పెరుగుతుండడంతో గ్రామాల్లో ప్రతి రెండు రోజులకు ఒకసారి ఫాగింగ్​ చేయాలని జిల్లా ఆఫీసర్లు పంచాయతీలకు ఆర్డర్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. ఇప్పటికే 60 డెంగీ, ఏడు మలేరియా, తొమ్మిది టైఫాయిడ్​ కేసులు నమోదు కావడంతో నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీంతో కొన్ని జీపీలు కొత్త మెషీన్లు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.

సిండికేట్‌‌‌‌గా ఏర్పడి.. 

రెండు ఏండ్ల కింద జిల్లాలోని కొన్ని జీపీలకు చెందిన సర్పంచులు సిండికేట్‌‌‌‌గా ఏర్పడి హైదరాబాద్​లోని రాణిగంజ్, బేగం బజార్​, గుర్రంగూడలలో చైనా మెషీన్లను కొన్నట్లు తెలిసింది. ఒక్కో మెషీన్‌‌‌‌ రూ.20 వేలకు కొని బ్రాండెడ్‌‌‌‌ కంపెనీల రూ.60 వేలకు కొన్నట్లు బిల్లులు కూడా తీసుకున్నట్లు సమాచారం.  అయితే ఇవి కొన్నాళ్లకే చెడిపోయాయి. ప్రస్తుతం ఫాగింగ్ తప్పనిసరి కావడంతో రిపేర్లు చేయిస్తామని, కంపెనీ సర్వీస్ సెంటర్​ నంబర్లు ఇవ్వాలని జీపీ సిబ్బంది అడుగుతున్నారు. కానీ, మెషీన్లు వారంటీ లేకపోవడంతో సర్పంచులు ఫోన్ నంబర్లు ఇవ్వడం లేదని తెలిసింది. 

ఫర్మ్​ పేరు లేకుండానే చెక్కులు

జీపీలకు ఫాగింగ్ మెషీన్లు కొనాలంటే కంపెనీ కొటేషన్​ తీసుకోవాలి.  మెషీన్‌‌‌‌ కొన్న తర్వాత కంపెనీ పేరు మీద ఫర్మ్​ చెక్కులు ఇవ్వాలి. కానీ, కొందరు సర్పంచులు, కార్యదర్శులు ఒక్కటై అక్రమాలు చేసినట్లు తెలిసింది.  రెండేళ్ల కింద  చైనా ఫాగింగ్​ మెషీన్లు సఫ్లై చేసే కంపెనీలతో కమీషన్ల కోసం డీల్​ చేసుకున్నట్లు సమాచారం.  కంపెనీల పేరు మీద కాకుండా, డైరెక్టుగా సర్పంచుల పేరు మీద కార్యదర్శులు ఫర్మ్​ చెక్కులు ఇచ్చారు. ఇందులో వాటాలు తీసుకుంటూ జీపీ ఫండ్స్​ను పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. 

జిల్లాలో ఇదీ పరిస్థితి..

మిడ్జిల్​ మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉండగా, 23 జీపీల్లో మెషీన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఇవి రిపేర్లకు వచ్చాయి. దేవరకద్ర మండలంలో 31 గ్రామ పంచాయతీలు ఉండగా దేవరకద్ర, జీనుగురాల, రేకులంపల్లి, ఇస్రంపల్లి, కౌకుంట్ల గ్రామాల్లోనే ఫాగింగ్ చేస్తున్నారు. రాజోలి, వెంకటగిరి, పేరూరు, నాగారం, కోయిల్​సాగర్​, హజిలాపూర్​, పెద్దరాజమూరు, చిన్నరాజమూరుతో పాటు మిగతా చోట్ల ఫాగింగ్​ చేయడం లేదు. ఇక్కడ మెషీన్లు రిపేర్లలో ఉన్నాయి. 

నవాబ్​పేట మండలంలో 31 గ్రామ పంచాయతీలు ఉండగా యన్మన్​గండ్ల, కామారం, తీగలపల్లిలో వారానికో సారి, రుద్రారం, కారుకొండ, పోమాల్​లో 15 రోజుల కిందట ఒక సారి ఫాగింగ్​ చేశారు. మల్లారెడ్డిపల్లి, కొండాపూర్​, దయపంతులపల్లి, చౌడూరు మిగిలిన చోట్ల ఫాగింగ్​ చేయడం లేదు. బాలానగర్ మండల కేంద్రంలో మినహా పంచాయతీల్లో వారం, పది రోజులకోసారి ఫాగింగ్​ చేస్తున్నారు. భూత్పూర్, అడ్డాకుల, రాజాపూర్​, మూసాపేట, కోయిల్​కొండ, చిన్నచింతకుంట మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కొన్ని జీపీలలో ‘పల్లె ప్రగతి’ సమయంలో మాత్రమే ఫాగింగ్​ చేసినట్లు ప్రజలు చెబుతున్నారు.

ఫాగింగ్ చేస్తలేరు

మండలంలో చాలా చోట్ల ఫాగింగ్ చేయడం లేదు. దాదాపు అన్ని గ్రామాల్లో ఫాగింగ్ మెషీన్లు పని చేయడం లేదు. ఎక్కడ తెచ్చారో? ఎంతకు తెచ్చారో? ఆ మెషీన్లకు వారంటీ కూడా ఉందో?  లేదో? అనే విషయం నాకు తెల్వదు.  మండలంలో దాదాపు అన్ని గ్రామాల్లో మెషీన్ల సమస్యే ఉండటం వితంగా ఉంది.

- కాంతమ్మ, ఎంపీపీ, మిడ్జిల్​

‘పల్లె ప్రగతి’లో చేసినదే..

మా దగ్గర ఫాగింగ్​ చేయక చాలా రోజులు అవుతోంది. రెండు నెలల కిందట జరిగిన ‘పల్లె ప్రగతి’లో ఒకసారి చేశారు. మళ్లీ ఇంత వరకు చేయలేదు. వర్షాలు పడి, మా ఏరియాలో విపరీతంగా దోమలు పెరిగినయ్​. ప్రజలు రోగాలు బారిన పడుతున్నారు. అయినా, దోమల నివారణకు ఆఫీసర్లు, లీడర్లు చర్యలు తీసుకోవడం లేదు.

-  పల్లె తిరుపతి, మిడ్జిల్​

రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా  ఫాగింగ్​ చేస్తున్నరు

జీపీలకు ఫాగింగ్‌‌‌‌ మెషీన్లను సర్పంచులే కొన్నారు. మెయింటెనెన్స్‌‌‌‌ బాధ్యత కూడా వాళ్లదే. ప్రస్తుతం అన్ని జీపీలలో రెగ్యులర్​గా ఫాగింగ్​ చేస్తున్నారు. చిన్న జీపీలలో ​మెషీన్లు లేకుంటే, పక్క జీపీల నుంచి తెచ్చుకుంటున్నారు. కొన్ని మెషీన్లు పనిచేయకపోతే రిపర్లు చేయించుకొని వాడుతున్నారు. 

- వెంకటేశ్వర్లు, డీపీవో, పాలమూరు