కమీషన్లు రావని ఈ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదు

కమీషన్లు రావని ఈ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదు

కల్వకుర్తి, వెలుగు: సీఎం కేసీఆర్‌‌‌‌కు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న ప్రేమ, పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టు మీద లేదని వైఎస్సార్‌‌‌‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. మంగళవారం ప్రజాప్రస్థానం పాదయాత్ర కల్వకుర్తి మండలం తర్నికల్, తుర్కలపల్లి, గుండూరు, సుద్దకల్ గ్రామాల మీదుగా కొనసాగింది. మార్గమధ్యలో మహిళా రైతులతో మాట్లాడి, వారితో కలిసి భోజనం చేశారు. రాష్ట్రం వచ్చిన తర్వాత దక్షిణ తెలంగాణలో మొట్ట మొదటిసారిగా ప్రారంభించిన అతిపెద్ద ప్రాజెక్ట్ పాలమూరు–-రంగారెడ్డి అని, అయినా ఇప్పటికీ అది పూర్తి కాలేదని విమర్శించారు. కాళేశ్వరం మాత్రం ఆగమేఘాల మీద కంప్లీట్ చేస్తున్నారన్నారు. కాళేశ్వరంలో వేల కోట్లు కమీషన్లు దోచుకోవచ్చనే ప్రాజెక్ట్‌‌ పూర్తి చేస్తున్నారని ఆరోపించారు. పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టులో కమీషన్లు రావని అనుకున్నారో లేక పేరు రాదని అనుకున్నారో కానీ ఇంకా పూర్తి చేయడం లేదన్నారు. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని డిమాండ్‌‌ చేస్తూ మహబూబ్‌‌నగర్‌‌‌‌లో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. టీఆర్ఎస్​ అధికారంలోకి వచ్చిన ఈ 8 ఏండ్లలో ఇంటి పన్నులు, ఆర్టీసీ చార్జీలు పెంచారే గాని, పేదలకు ఇండ్లు పంచలేదని గుర్తుచేశారు. కేసీఆర్‌‌‌‌ అవినీతిని ప్రశ్నించడంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విఫలమయ్యాయని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌‌ వేల కోట్ల రూపాయలు పంచి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిండు

తాడూరు మండలం మేడిపూర్‌‌‌‌ గ్రామంలోకి ప్రవేశించిన షర్మిల.. అక్కడ మాటముచ్చట నిర్వహించారు. రాష్ట్రంలో సర్కార్ హాస్టళ్ల పరిస్థితి ఘోరంగా తయారైందని, స్టూడెంట్లు తినే భోజనంలో బల్లులు, పురుగులు, కప్పలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కేసీఆర్‌‌‌‌ భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. చదువుకోవడమే వేస్ట్ అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. డిగ్రీలు, పీజీలు చదివిన వారు కూలికి పోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఆసరా పెన్షన్ అనర్హులకు ఇస్తున్నారని ఆరోపించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు అని చెప్పి, ఉన్న ఇండ్లు కూడా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. నాగర్‌‌‌‌కర్నూల్ జిల్లాలో మెడికల్ కాలేజీ పేరు చెప్పి దళితులు, పేదల భూముల్ని గుంజుకోవడం బాధాకరమన్నారు. షర్మిలతో పాటు పార్టీ పరిశీలకుడు శ్రీనివాస రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గౌని నరసింహ గౌడ్, కల్వకుర్తి కో ఆర్డినేటర్ చీమర్ల అర్జున్‌‌ రెడ్డి తదితరులు ఉన్నారు.