సక్సెస్ : ఏలియన్ ఐల్యాండ్ 

సక్సెస్ : ఏలియన్ ఐల్యాండ్ 

హిందూ మహా సముద్ర రహస్యాల మీద అనేక జానపద కథలు చెప్తుంటారు. అలాంటి సముద్రంలో ఒక మిస్టీరియస్​ ఐల్యాండ్​ కూడా ఉంది. అక్కడికెళ్తే.. ఎక్కడో వేరే గ్రహంలో ఉన్నట్టు అనిపిస్తుంటుంది. వింత వింత గ్రహాంతర చెట్లు, జీవవైవిధ్యం కనిపిస్తాయి. ఈ భూమ్మీద మరెక్కడా కనిపించని చెట్లు, సరీసృపాలు అక్కడ ఉన్నాయి! 

రిపబ్లిక్​ ఆఫ్​ యెమెన్​లో భాగంగా ఉన్న ఈ సొకోత్రా ఐల్యాండ్​ ఎన్నో వింతలకు నిలయం. ఇక్కడ ప్రకృతిని చూస్తుంటే.. ఏదో సైన్స్​ ఫిక్షన్​ సినిమా చూస్తున్నట్టు, సోషియో ఫ్యాంటసీ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టే ఉంటుంది. వాస్తవానికి ఈ ద్వీపం ఒకప్పుడు ఆఫ్రికా మెయిన్​లాండ్​లో భాగంగా ఉండేది. కానీ.. కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి పొరల్లో కలిగిన మార్పుల వల్ల మెయిన్​ల్యాండ్​ నుండి విడిపోయింది. అప్పటినుంచి అది భిన్నమైన ప్రాణులకు కేరాఫ్​గా మారింది. మరో ప్రపంచంలా మారిపోయిన ఈ ప్రాంతం... హిందూ మహాసముద్రంలో సోమాలియా నుండి 250 కిలోమీటర్ల దూరంలో, యెమెన్ నుండి 340 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ విశాలమైన ఇసుక బీచ్‌‌‌‌లు, సున్నపురాయి గుహలు, ఎత్తయిన పర్వతాలు ఉన్నాయి. 

వింత చెట్లు

ఇక్కడ ఉండే వింత చెట్ల వల్ల చాలామంది ఈ ఐల్యాండ్​ని ఏలియన్ ఐల్యాండ్​, మిస్టీరియస్​ ల్యాండ్​ అని పిలుస్తుంటారు. ఇక్కడ దాదాపు 60,000 మంది ఉంటున్నారు. 825 అరుదైన జాతుల చెట్లు, జంతువులు ఉన్నాయి. వీటిలో మూడింట ఒక వంతు జీవవైవిధ్యం భూమ్మీద ఎక్కడా కనిపించదు. ఈ ప్రదేశం దాని జీవవైవిధ్యం వల్ల వరల్డ్​ ఫేమస్​ అయ్యింది. యునెస్కో లెక్కల ప్రకారం.. సొకోత్రాలో ఉన్న వృక్ష జాతుల్లో 37 శాతం, ఇక్కడ ఉండే సరీసృపాల జాతుల్లో 90 శాతం, నత్త జాతుల్లో 95 శాతం ఈ ద్వీపానికి ప్రత్యేకమైనవి. వాటిని ఈ భూమ్మీద మరెక్కడా చూడలేం. సొకోత్రాలో బాగా వేడిగా ఉంటుంది. అలాగని వానలు తక్కువ అనుకుంటారేమో... భారీ వరదలు వస్తుంటాయి. అందుకే ఈ వాతావరణాన్ని తట్టుకునే విధంగా ఇక్కడి వృక్షజాలం, జంతుజాలం మార్పు చెందాయి. 

192 పక్షి జాతులు

సొకోత్రా 25 మిలియన్ సంవత్సరాల క్రితం ద్వీపంగా మారింది. ఇక్కడ ఉండే సున్నపురాయి, పీఠభూములు, శుష్క పర్వతాలు, తీర మైదానాలు, వాతావరణం.. ఇలాంటి పక్షులు, కీటకాలు, చెట్లు పెరగడానికి కారణమయ్యాయి. ఏన్నో ఏండ్ల పాటు ఐసోలేట్​ చేసినట్టుగా ఉండడంతో సొకోత్రాలో ఈ వింతలు పుట్టుకొచ్చాయి. ఇది శుష్క ప్రాంతానికి భిన్నంగా ఉంటుంది. ద్వీపంలో కనీసం192 పక్షి జాతులు ఉన్నాయి. వాటిలో 44 జాతులు దానిపై మాత్రమే  కనిపిస్తాయి. 85 రకాల పక్షులు వలస వచ్చాయి. 253 రీఫ్-బిల్డింగ్ పగడపు జాతులు, 730 తీరప్రాంత చేప జాతులు, 300 రకాల పీతలు, రొయ్యలు ఇక్కడ చూడొచ్చు. సొకోత్రా వార్​బ్లర్, సొకోత్రా బంటింగ్, గోస్ట్ క్రాబ్, సొకోత్రా లైమ్‌‌‌‌స్టోన్ క్రాబ్, సొకోత్రా కార్మోరెంట్, సొకోత్రా సన్‌‌‌‌బర్డ్, ఈజిప్షియన్ వల్చర్​, లాగర్‌‌‌‌హెడ్ తాబేలు ఇక్కడ కనిపించే అరుదైన జంతువుల్లో ఉన్నాయి.

సుగంధ ద్రవ్యాలు, వివిధ రకాల కలబందలు, పెద్ద చెట్లు, డ్రాగన్ బ్లడ్​ ట్రీ, దోసకాయ చెట్లు, మిర్హ్ చెట్లు ఈ ద్వీపంలో ముఖ్యమైనవి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే..  ఐల్యాండ్​లో ఒక్క ఉభయచరం కూడా లేదు. ఒకే ఒక క్షీరదం.. గబ్బిలం ఉంది. ఇక సరీసృపాల్లో అరుదైన స్కింక్‌‌‌‌, కాళ్లు లేని బల్లి, ఊసరవెల్లి వంటివి ఉన్నాయి. ల్యాండ్‌‌‌‌స్కేప్ అంతటా వ్యాపించిన గొడుగు లాంటి చెట్టు... డ్రాగన్ బ్లడ్ ట్రీ ఉంది ఇక్కడ. ఈ చెట్టు ఈ ఐల్యాండ్​లో చాలా స్పెషల్​. ఈ ద్వీపాన్ని ఏలియన్​ అని పిలవడానికి కారణం ఇదే. ఒకప్పుడు ఈ ద్వీపంలో ఉండేవాళ్లు కలబంద(అలోవెరా)ను ఔషధంగా, సౌందర్య సాధనాల్లో వాడేవాళ్లు! 

సముద్రం కూడా ప్రత్యేకమే

సొకోత్రా ద్వీపమే కాదు. దాని చుట్టూ ఉన్న సముద్ర జలాలు కూడా ప్రత్యేకమైనవే. ఇక్కడ నీటి అడుగున ప్రపంచం కూడా చాలా అందంగా ఉంటుంది. అద్దంలా కనిపించేంత స్వచ్ఛంగా నీళ్లు ఉంటాయి. సముద్రం లోపల పెద్ద పెద్ద పగడపు దిబ్బలు ఉంటాయి. స్కూబా డైవింగ్ చేయడానికి ఇది బెస్ట్‌‌‌‌ ప్లేస్​. ఉష్ణమండల చేపలు, తిమింగలాలు, సొరచేపలు కనిపిస్తుంటాయి. అందుకే సొకోత్రా ద్వీపాన్ని  యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా, రక్షిత ప్రాంతంగా గుర్తించింది.